Share News

పెద్దహరివాణంలో టీడీపీ నాయకులకు చుక్కెదురు

ABN , Publish Date - Oct 08 , 2026 | 12:19 AM

ఆదోని మండలం పెద్దహరివాణం గ్రామంలో టీడీపీ నాయకులకు చుక్కెదురైంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక పెద్దహరివాణ మండలాన్ని ప్రకటించి మళ్లీ వెనక్కు తీసుకోవడంపై గ్రామస్థులు గత కొంతకాలంగా ఆగ్రహంగా ఉన్నారు.

పెద్దహరివాణంలో టీడీపీ నాయకులకు చుక్కెదురు
పోలీసులతో వాగ్వాదానికి దిగిన గ్రామస్థులు

పరామర్శకు వెళ్లిన వారిని అడ్డుకున్న గ్రామస్థులు

పోలీసుల సహకారంతో గ్రామంలోకి ప్రవేశం

ఆదోని, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): ఆదోని మండలం పెద్దహరివాణం గ్రామంలో టీడీపీ నాయకులకు చుక్కెదురైంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక పెద్దహరివాణ మండలాన్ని ప్రకటించి మళ్లీ వెనక్కు తీసుకోవడంపై గ్రామస్థులు గత కొంతకాలంగా ఆగ్రహంగా ఉన్నారు. ఇదే క్రమంలో రాజకీయ పార్టీలు, నాయకులు గ్రామంలో రాకూడదంటూ గ్రామస్థులు తీర్మానం చేసుకున్నారు. ఈ క్రమంలో పెద్దహరివాణం గ్రామానికి చెందిన వీరారెడ్డి అనే వ్యక్తి మృతి చెందగా, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు టీడీపీ నాయకుడు, మాజీ మార్కెట్‌ యార్డు చైర్మన్‌ మదిరె భాస్కర్‌ రెడ్డి, యువ నాయకుడు గొనేహాల్‌ గోపాల్‌ రెడ్డిలు ఆదోని నుంచి బయల్దేరారు. అయితే వారు గ్రామంలోకి రాకుండా ఊరిబయటే గ్రామస్థులు చేరుకుని అడ్డుకున్నారు. చివరకు పోలీసులు రంగప్రవేశం చేసి గ్రామస్థులకు నచ్చచెప్పి టీడీపీ నాయకులను గ్రామంలోకి పంపించారు. ఈ వివాదంపై మదిరె భాస్కర్‌ రెడ్డి మాట్లాడుతూ పెద్దహరివాణాన్ని మండలంగా మార్చడం ప్రభుత్వ పరిధిలోని అంశమన్నారు. ప్రభుత్వం అన్ని విధాలా పరిశీలించి నిర్ణయం తీసుకుంటుందన్నారు. కానీ చనిపోయిన బంధువులను చూడడానికి వస్తే అడ్డుకోవడం ఎంతవరకు న్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. నాయకులను రాకుండా చేస్తే గ్రామానికి వచ్చే అభివృద్ధి కూడా నిలిచిపోతుందనే విషయాన్ని గ్రామస్తులు ఆలోచించాలన్నారు. పోరాటాలు ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలే తప్పా మానవత్వానికి, గ్రామాభివృద్ధికి ముప్పు తెచ్చేలా ఉండకూడదన్నారు.

అడ్డుకున్న వారిపై కేసు నమోదు

ఆదోని రూరల్‌: గ్రామంలోకి నాయకులను రానీయకుండా అడ్డుకున్న గ్రామస్థులపై బుధవారం రాత్రి ఇస్వీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆదోని-2 మండలం పరిధిలోని పెద్దహరివాణం గ్రామానికి చెందిన ఆదినారాయణరెడ్డి, మెడికల్‌ నాగరాజు, తిమ్మప్ప, కరెన్నలతోపాటు మరికొందరికిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ మహేశ్‌ కుమార్‌ తెలిపారు. వీరిపై బీఎన్‌ఎ్‌స 126(2), 351(2)కింద కేసు నమోదు చేశామన్నారు. గ్రామంలోకి రాకుండా ఎవరినైనా సరే అడ్డుకుంటే అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

Updated Date - Oct 08 , 2026 | 12:19 AM