Share News

రూ.50 లక్షల బీమా మొత్తం చెల్లించండి

ABN , Publish Date - Jul 21 , 2026 | 12:40 AM

పాలసీదారుడు ప్రమాదవశాత్తు మృతి చెందితే.. రూ.50లక్షల ఇన్సూరెన్స్‌ మొత్తం చెల్లిస్తామని హామీ ఇచ్చి ఆ తర్వాత నిరాకరించిన ఐసీఐసీఐ లాంబార్డ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీకి కర్నూలు జిల్లా వినియోగదారుల కమిషన్‌ తగిన రీతిలో వడ్డించింది.

రూ.50 లక్షల బీమా మొత్తం చెల్లించండి

కర్నూలు లీగల్‌, జూలై 20(ఆంధ్రజ్యోతి): పాలసీదారుడు ప్రమాదవశాత్తు మృతి చెందితే.. రూ.50లక్షల ఇన్సూరెన్స్‌ మొత్తం చెల్లిస్తామని హామీ ఇచ్చి ఆ తర్వాత నిరాకరించిన ఐసీఐసీఐ లాంబార్డ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీకి కర్నూలు జిల్లా వినియోగదారుల కమిషన్‌ తగిన రీతిలో వడ్డించింది. వివరాలివీ.. నంద్యాల జిల్లా బనగానపల్లె చెందిన గాండ్ల మూలయ్య 2025 జూన్‌లో ఐసీఐసీఐ లాంబార్డ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ నుంచి రూ.50లక్షలు ప్రమాధ బీమా పాలసీని తీసుకున్నారు. ఈ మేరకు సంవత్సర ప్రీమియం మొత్తం 14,440 బీమా కంపెనీకి చెల్లించారు. ఆ తర్వాత 2025 జూలై 28న పాలసీదారుడు మూలయ్య గోస్పాడు పోలీస్‌ స్టేషన్‌ ప రిధిలో రోడ్డుపై నిలిచి ఉండగా.. ఓ మినీ లారీ అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో మూలయ్య తీవ్రగాయాలయ్యాడు. ఆ తర్వాత అతన్ని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆ తర్వాత మృతి చెందిన పాలసీదారుని భార్య, నామినీ అయిన గాండ్ల ప్రమీల తన భర్త తీసుకున్న పాలసీ మేరకు రూ.50 లక్షలు ఇన్సూరెన్స్‌ మొత్తం కోసం అవసరమైన అన్ని పత్రాలతో దరఖాస్తు చేసుకున్నారు. అయితే దరఖాస్తుతో పాటు పోలీసుల ఫైనల్‌ రిపోర్టు జతపరచలేదనే ఉద్దేశంతో ఆమె చేసుకున్న క్లయిమ్‌ దరఖాస్తును ఇన్సూరెన్స్‌ కంపెనీ తిరస్కరించింది. నామినీ అయిన ప్రమీల తన న్యాయవాది ద్వారా జిల్లా వినియోగదారుల కమిషన్‌లో దాఖలు చేసింది. కేసును విచారించిన వినియోగదారుల కమిషన్‌ ఫిర్యాది తన క్లయిమ్‌ దరఖాస్తుతో పాటు చార్జ్‌షీటును కూడా జత పరిచారని, అలాంటప్పుడు ఫైనల్‌ రిపోర్టు దాఖలు చేయలేదనే నెపంతో ఆమె దరఖాస్తును తిరస్కరించడం సేవా లోపం అవుతుందని నిర్ధారించింది. దీంతో ఫిర్యాదికి ఇన్సూరెన్స్‌ మొత్తం రూ.50లక్షలను 9 శాతం వడ్డీతో పాటు రూ.30వేలను నష్టపరిహారం, కోర్టు ఖర్చుల కింద రూ.30వేలను 45రోజుల్లోపు ఇన్సూరెన్స్‌ కంపెనీ ఫిర్యాదికి చెల్లించాలని కమిషన్‌ చైర్మన్‌ కరణం కిషోర్‌ కుమార్‌, సభ్యులు ఎన్‌.నారాయణ రెడ్డి, నజీమా కౌసర్‌ సోమవారం ఆదేశాలు జారీ చేశారు.

Updated Date - Jul 21 , 2026 | 12:40 AM