Share News

సివిల్స్‌లో పవన్‌

ABN , Publish Date - Mar 06 , 2026 | 11:10 PM

కేంద్ర ప్రభుత్వం యూపీఎస్‌సీ ప్రకటించిన సివిల్స్‌ సర్వీసెస్‌ పరీక్షా ఫలితాల్లో కర్నూలుకు చెందిన ఎం.పవన్‌ కుమార్‌ రెడ్డి సత్తా చాటారు.

సివిల్స్‌లో పవన్‌
తల్లిదండ్రులు, సోదరితో పవన్‌ కుమార్‌ రెడ్డి

ఫలితాల్లో కర్నూలు వాసికి 297వ ర్యాంకు

మూడో ప్రయత్నంలోనూ ఐఆర్‌ఎస్‌గా ఎంపిక

కర్నూలు ఎడ్యుకేషన్‌, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం యూపీఎస్‌సీ ప్రకటించిన సివిల్స్‌ సర్వీసెస్‌ పరీక్షా ఫలితాల్లో కర్నూలుకు చెందిన ఎం.పవన్‌ కుమార్‌ రెడ్డి సత్తా చాటారు. శుక్రవారం విడుదలైన ఫలితాల్లో ఆలిండియా స్థాయిలో 297వ ర్యాంకు సాధించి ఐఆర్‌ఎస్‌కు ఎంపికయ్యారు. అయితే 2025లో రెండో ప్రయత్నంలోనే ఆయన ఐఆర్‌ఎస్‌ సాధించి.. తాజాగా మరోసారి మెరుగైన ర్యాంక్‌ సాధించారు. కర్నూలు నగరం ప్రకాష్‌ నగర్‌లోని సంకల్‌భాగ్‌లో కృష్ణారెడ్డి, మధుమతి నివాసం ఉంటున్నారు. కృష్ణారెడ్డి కర్నూలు మండలం పంచలింగాలలోని ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడుగా పని చేస్తున్నారు. ఆయన భార్య ఎం.మధుమతి ఇదే మండలంలోని ఆర్‌.కొంతలపాడు పాఠశాలలో స్కూల్‌ అసిస్టెంట్‌ ఫిజికల్‌ సైన్స్‌ ఉపాధ్యాయురాలిగా సేవలందిస్తున్నారు. ఈ దంపతులకు ఇద్దరు సంతానం. కుమారుడు పవన్‌ కుమార్‌ రెడ్డి ఎంబీబీఎస్‌ పూర్తి చేశారు. కుమార్తె ఎం.చరిత బీటెక్‌ విద్యను అభ్యసించారు. పవన్‌ కుమార్‌ రెడ్డి 1 నుంచి 10వ తరగతి వరకు కర్నూలు నగరంలోని కేశవరెడ్డి, శ్రీలక్ష్మి పాఠశాల, శ్రీచైతన్య పాఠశాలలో హై స్కూల్‌ విద్యాభ్యాసం చేశారు. గుంటూరులోని భాష్యం జూనియర్‌ కాలేజీలో ఇంటర్‌ పూర్తి చేశారు. 2016లో జరిగిన ఎంసెట్‌ పరీక్ష ఫలితాల్లో 600 ర్యాంకు సాధించి కర్నూలు మెడికల్‌ కళాశాలలో 2022లో వైద్య పట్టాను అందుకున్నారు. వైద్య విద్య అనంతరం ఢిల్లీలోని రావూస్‌ కోచింగ్‌ సెంటర్‌లో సివిల్స్‌కు శిక్షణ పొందారు. మొదటిసారి ఆయన విఫలమయ్యారు. అయితే రెండో ప్రయత్నంలో 2025లో ఏప్రిల్‌లో విడుదలైన సివిల్స్‌ ఫలితాల్లో 375వ ర్యాంకు సాదించి ఐఆర్‌ఎస్‌ ఇన్‌కం ట్యాక్స్‌ ఆఫీసర్‌గా ఎంపికయ్యారు. దీంతో తృప్తి చెందక దీర్ఘకాలిక సెలవులపై వెళ్లి ఢిల్లీలో మళ్లీ శిక్షణ పొందుతూ మూడో ప్రయత్నంలో 297వ ర్యాంకు సాధించారు.

ఐఏఎస్‌ సాధిస్తా : పవన్‌ కుమార్‌ రెడ్డి

ఐఏఎస్‌, ఐపీఎస్‌ మిస్‌ అయిందనే బాధ చెందక.. మరోసారి గట్టి ప్రయత్నం చేసి సివిల్స్‌లో ఉత్తమ ర్యాంకు సాధిస్తాను. ఐఏఎస్‌ కావాలన్నదే నా చిన్నప్పటి నుంచి లక్ష్యంగా పెట్టుకున్నారు. గతంలో కన్నా మెరుగైన ర్యాంక్‌ సాధించాను. నాకు సివిల్స్‌లో ర్యాంకు రావడంపై మా అమ్మానాన్నలు, బంధువులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అందరి సహకారంతోనే ఇదంతా సాధ్యమయింది. మళ్లీ ప్రయత్నిస్తాను. ఐఏఎస్‌ సాధిస్తానన్న నమ్మకం ఉంది.

Updated Date - Mar 06 , 2026 | 11:10 PM