Share News

సమ్మె బాట

ABN , Publish Date - Oct 06 , 2026 | 11:30 PM

తమను క్రమబద్ధీకరించాలని కోరుతూ వైద్యఆరోగ్యశాఖ కాంట్రాక్టు ఉద్యోగులు సమ్మెబాట పట్టారు. ఉమ్మడి జిల్లాలోని ప్రభు త్వాస్పత్రుల్లో పనిచేస్తున్న 1,450 మంది (కర్నూలు 727, నంద్యాల జిల్లాలో 723) కాంట్రాక్టు ఉద్యోగులు మంగళవారం సాధారణ విధులు బహిస్కరించి ఆందోళనకు దిగారు.

సమ్మె బాట
సమ్మె చేస్తున్న వైద్యఆరోగ్యశాఖ కాంట్రాక్టు ఉద్యోగులు

విధులు బహిష్కరించిన వైద్యశాఖ కాంట్రాక్టు ఉద్యోగులు

క్రమబద్ధీకరించాలని డిమాండ్‌

నేటి నుంచి అత్యవసర సేవలు బహిష్కరిస్తామని హెచ్చరిక

ఇబ్బందులు పడ్డ రోగులు

కర్నూలు హాస్పిటల్‌, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి): తమను క్రమబద్ధీకరించాలని కోరుతూ వైద్యఆరోగ్యశాఖ కాంట్రాక్టు ఉద్యోగులు సమ్మెబాట పట్టారు. ఉమ్మడి జిల్లాలోని ప్రభు త్వాస్పత్రుల్లో పనిచేస్తున్న 1,450 మంది (కర్నూలు 727, నంద్యాల జిల్లాలో 723) కాంట్రాక్టు ఉద్యోగులు మంగళవారం సాధారణ విధులు బహిస్కరించి ఆందోళనకు దిగారు. కర్నూలు లోని శ్రీకృష్ణదేవరాయల సర్కిల్‌ ధర్నా చౌక్‌లో ఏపీ కాంట్రాక్టు ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన స్టాఫ్‌ నర్సులు, ల్యాబ్‌ టెక్నీషియన్లు, ఫార్మసిస్టులు, రేడియోగ్రాఫర్లు, ఎమర్జెన్సీ, అనస్థీషియా టెక్నీషియన్‌లు, పారా మెడికల్‌ ఉద్యోగులు ఆందోళ నలు చేపట్టారు. జేఏసీ జిల్లా చైర్మన్‌ శ్రీదేవి మాట్లాడుతూ ఏళ్ల తరబడి వైద్యశాఖలో కాం ట్రాక్టు విధానంలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఇప్పటికీ ఉద్యోగ భద్రత లేదని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వ వైద్య సేవల్లో కీలకంగా పని చేస్తున్నప్పటికీ తమ ఉద్యోగాలు ఎప్పుడు ఉంటాయో.. ఎప్పుడు పోతాయో.. అన్న అనిశ్చితి కొనసాగుతుందన్నారు. సమ్మెలో భాగంగా బుధవారం నుంచి అత్యవసర సేవలను సైతం బహిష్కరిస్తామని హెచ్చరించారు. విధి నిర్వహణలో మరణించిన ప్రతి ఉద్యోగి కుటుంబానికి రూ.50 లక్షలు పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కర్నూలు జిల్లాలోని ప్రభుత్వాస్పత్రుల్లో పనిచేస్తున్న 727 మంది కాంట్రాక్టు ఉద్యోగులు సాధారణ విధులు బహిష్కరించి సమ్మెలోకి వెళ్లడంతో రోగులు ఇబ్బందులు పడ్డారు. కర్నూలు జీజీహెచ్‌లో కాంట్రాక్టు ఉద్యోగుల స్థానంలో ప్రైవేటు, ప్రభుత్వ నర్సింగ్‌ కాలేజీ, గవర్నమెంట్‌ నర్సింగ్‌ స్కూల్‌ విద్యార్థులను ఉంచి సేవలకు ఆటంకాలు కలగకుండా అధికా రులు చర్యలు తీసుకున్నారు ఓపీ కౌంటర్లు, సాధారణ వార్డులు, డయోగ్నస్టిక్‌ బ్లాక్‌లోని ల్యాబ్‌లో సిబ్బంది కొరతతో కొంత ఇబ్బందులు తలెత్తాయి. ఇక పీహెచ్‌సీ, సీహెచ్‌సీల్లో కాంట్రాక్టు స్టాఫ్‌ నర్సులు, పారామెడికల్‌ సిబ్బందితో ఇబ్బందులు తలెత్తాయి.

ప్రభుత్వం స్పందించాలి

తమను క్రమబద్ధీకరించాలని కోరుతూ40 రోజులుగా శాంతియుతంగా నిరసనలు తెలిపాం. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించకపోవడంతో సమ్మెలోకి వెళ్లాం. బుధవా రం నుంచి కర్నూలు జీజీహెచ్‌, పీహెచ్‌సీ, సీహెచ్‌సీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులం సాధారణ, అత్యవసర సేవలను బహిష్కరించనున్నాం. ప్రభుత్వం స్పందించి తమను క్రమబద్ధీకరించాలి.

శ్రీదేవి, జిల్లా చైర్మన్‌, ఏపీ కాంట్రాక్టు మెడికల్‌ ఉద్యోగుల సంఘం, కర్నూలు

16 సంవత్సరాలుగా పని చేస్తున్నా

16 సంవత్సరాలుగా కర్నూలు జీజీహెచ్‌లో ల్యాబ్‌ టెక్నీషియన్‌గా కాంట్రాక్టు పద్ధతిలో పని చేస్తున్నా. నేటికీ తమకు ఉద్యోగ భద్రత లేదు. నిత్యం అభద్రత భావంతో విధులు నిర్వహిస్తున్నా. రెగ్యులర్‌ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్నా అరకొర జీతంతో కాలం వెల్లదీస్తున్నాం.

ఎస్‌.నరేంద్రబాబు, ల్యాబ్‌ టెక్నీషియన్‌, జీజీహెచ్‌, కర్నూలు

20 ఏళ్లుగా నోటిఫికేషన్‌ లేదు

వైద్యశాఖలో 20 ఏళ్లుగా రెగ్యులర్‌ నోటిఫికేషన్‌ను ప్రభుత్వం విడుదల చేయలేదు. కాంట్రాక్టు ఉద్యోగులుగానే మగ్గుతున్నాం. ప్రస్తుతం తమకు ఇస్తున్న జీతం ఇంటి అద్దె, పిల్లల ఫీజులు, కరెంటులకే సరిపోతుంది.

ఎన్‌.పుష్పలత, రేడియోగ్రాఫర్‌, జిల్లా జేఏసీ ఉమెన్‌ వింగ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ దశలవారీగా క్రమబద్ధీకరించాలి

ప్రభుత్వం కాంట్రాక్టు ఉద్యోగులను దశల వారీగా క్రమబద్ధీకరించాలి. ప్రభుత్వాస్పత్రుల్లో అనేక ఏళ్లుగా రోగులకు సేవలు అందిస్తున్నాం. అరకొర జీతాలతో జీవనం సాగిస్తున్నాం. వంద శాతం గ్రాస్‌ జీతాన్ని అమలు చేయాలి.

సూర్యబాయి, ఫార్మసిస్టు, జీజీహెచ్‌, కర్నూలు

Updated Date - Oct 06 , 2026 | 11:30 PM