Share News

నేటి నుంచి పరిషత్‌ పాలన

ABN , Publish Date - Nov 18 , 2026 | 11:46 PM

: పరిషత్‌ ఎన్నికల తుది అంకం మొదలైంది. మండలాధీశులు కొలువుదీరే వేళైంది. మండల పరిషత్‌లను కొత్త పాలకవర్గాలు చేజిక్కించుకోనున్నాయి.

నేటి నుంచి పరిషత్‌ పాలన

24 మండలాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి స్పష్టమైన ఆధిక్యత

నేడు ఎంపీపీ, వైస్‌ ఎంపీపీల ప్రమాణ స్వీకారం

కోడుమూరులో కొనసాగుతున్న ఉత్కంఠ

కర్నూలు, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): పరిషత్‌ ఎన్నికల తుది అంకం మొదలైంది. మండలాధీశులు కొలువుదీరే వేళైంది. మండల పరిషత్‌లను కొత్త పాలకవర్గాలు చేజిక్కించుకోనున్నాయి. ఎంపీటీసీ ఎన్నికల్లో సత్తా చాటిన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఇప్పుడు మండలాధీశుల పీఠాలను అధిష్టించేందుకు సిద్ధమయ్యాయి. 26 మండలాల్లో 25 మండలాల్లో స్పష్టమైన ఆధిక్యంతో ఉండటంతో ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ పదవులు దక్కించుకునేందుకు మార్గం సుగమమైంది. నేడు జరిగే ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ ఎన్నిక లాంఛనమే. ఆ వెంటనే ప్రమాణ స్వీకారం చేస్తారు.

జిల్లాలో కోడుమూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆదోని, ఆలూరు, పత్తికొండ, పాణ్యం నియోజకవర్గాల్లో 26 మండలాలు ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలో 54 మండలాలు ఉండేవి. 2021లో జరిగిన ఎన్నికల్లో.. 6వ మండల పరిషత్‌ పాలకవర్గం కొలువుదీరింది. వాటి పదవీ కాలం సెప్టెంబరు 24న ముగిసింది. జిల్లాల పునర్విభజన జరగడంతో 28 మండలాలతో నంద్యాల ప్రత్యేక జిల్లాగా ఏర్పడింది. కర్నూలు జిల్లాలో 26 మండలాలు ఉన్నాయి. మండల, జిల్లా పరిషత్‌ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అనిల్‌ చంద్ర పునేఠా అక్టోబరు 14న షెడ్యూల్‌ జారీ చేశారు. అందులో భాగంగా.. ఈ నెల 5న పోలింగ్‌ జరగ్గా.. 7న ఓట్లు లెక్కించారు. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అనీల్‌ చంద్ర పునేఠా జారీ చేసిన షెడ్యూల్‌ మేరకు నేడు మండల పరిషత్‌ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కోఆప్టెడ్‌ సభ్యులు ఎంపికకు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్‌ డా.ఏ. సిరి పర్యవేక్షణలో ప్రిసైడింగ్‌ అధికారులు (పీవో) ప్రత్యేక సమావేశం ఏర్పాటుకు సన్నాహాలు చేశారు. కొత్తగా ఎన్నికైన ఎంపీటీసీ సభ్యులు హాజరు కావాలంటూ నోటీసు ఇచ్చారు.

25 మండలాల్లో కూటమిదే హవా..!

జిల్లాలో 26 మండల పరిషత్‌ పరిధిలో 432 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. ఏకగ్రీవాలు సహా టీడీపీ 298, జనసేన 7, బీజేపీ 6 కలిసి కూటమి 311, వైసీపీ 113, ఇతరులు 8 స్థానాలు సొంతం చేసుకున్నారు. మొత్తం స్థానాల్లో 72 శాతం షేర్‌ సాధించి సీఎం చంద్రబాబు సారధ్యంలోని కూటమి 25 మండలాల్లో ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ పదవులు దక్కించుకునే స్పష్టం ఆధిక్యత దక్కించుకున్న కూటమి నేతలు ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ పదవులకు అభ్యర్థులను ఇప్పటికే పూర్తి చేశారు. ప్రతిపక్షాలకు అవకాశం లేకుండా 25 మండలాల్లో ఏకగ్రీవంగా టీడీపీ పదవులు దక్కించుకుంది.

గ్రామాల్లో రాజకీయ జోష్‌

మండల పరిషత్తుల్లో కొత్త పాలకవర్గాలు ఏర్పడుతుండటంతో గ్రామాల్లో వాతావరణం వేడెక్కింది. ఎన్నికల సమయంలో నాయకులు, కార్యకర్తలు చేసిన కృషికి ఇప్పుడు పదవుల రూపంలో గుర్తింపు లభించనుంది. ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ పదవులు దక్కించుకున్న నేతల అనుచరులు సంబరాలకు సిద్ధమవుతున్నారు. మరోవైపు మండల పరిషత్‌లపై పట్టు సాధించడం ద్వారా గ్రామస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసుకోవాలని కూటమి నాయకత్వం భావిస్తోంది. నేటి మండలాధీశుల ఎంపిక, ప్రమాణ స్వీకార కార్యక్రమాలతో మండలాల్లో కొత్త రాజకీయ సమీకరణాలు ఆవిష్కృతం కానున్నాయి. అన్ని మండలాల్లో పసుపు జెండాను రెపరెపలాడబోతోంది. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో, టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణుల్లో మరింత జోష్‌ నింపేందుకు ఎంపీ, ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గాల ఇన్‌చార్జిలు ముఖ్య నేతలు ప్రమాణ స్వీకారమహోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

కోడుమూరుపైనే అందరి దృష్టి

కోడుమూరు మండల పరిషత్‌ ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ ఎన్నికపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. జిల్లాలో 25 మండలాల్లో కూటమి స్పష్టమైన ఆధిక్యత సాధించగా.. కోడుమూరు మండల పరిషత్‌పై వైసీపీ ఒక స్థానం ఆధిక్యతలో ఉంది. ఈ మండలంలో 21 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. టీడీపీ 9 స్థానాలు, వైసీపీ 10, సీపీఎం ఒకటి, స్వతంత్ర అభ్యర్థి ఒక స్థానంలో ఎంపీటీసీగా నిలిచారు. ఎంపీపీ పీఠం దక్కించుకోవాలంటే మ్యాజిక్‌ ఫిగర్‌ 11. వైసీపీకే తమ మద్దతు అని ఇప్పటికే సీపీఎం స్పష్టం చేసింది. అంటే.. ఎంపీపీ పీఠం కైవసం చేసుకునే సంఖ్యా బలం వైసీపీకి కనిపిస్తోంది. అయితే స్వతంత్ర అభ్యర్థి మద్దతుతో టీడీపీ కూడా ఎలాగైనా కోడుమూరు ఎంపీపీ పదవి దక్కించుకోవాలని ప్రయత్నిస్తోంది. వైసీపీ ఎంపీటీసీల్లో ఏ ఒక్కరైనా, లేదా సీపీఎం సభ్యుడైనా గైర్హాజరైతే ఎన్నిక వాయిదా పడే అవకాశం ఉంది.

బాధ్యతలు చేపట్టనున్న మండల పరిషత్‌ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు

మండలం ఎంపీపీ వైస్‌ ఎంపీపీ

ఎమ్మిగనూరు బి. కోటేకల్‌ పుష్పావతి షేక్‌ రసూల్‌బీ

నందవరం చార్లెస్‌ రాధమ్మ

గోనెగండ్ల ఎన్‌. మౌనిక ఫకృద్దీన్‌

కర్నూలు సాలమ్మ --

సి. బెళగల్‌ అరుణకుమారి --

గూడూరు రాణాప్రతాప్‌రెడ్డి --

ఆలూరు వైకుంఠం శ్రీరామ్‌ కురువ నాగవే ణి

చిప్పగిరి ఏరూరు మీనాక్షి నాయుడు యు. గోవిందరాజులు

ఆస్పరి కృష్ణయాదవ్‌ పద్మావతి

హాలహర్వి గుమ్మనూరి గిరిజ --

దేవనకొండ ఈడిగ లక్ష్మి ఉప్పర మంగమ్మ

హొళగొంద జయలక్ష్మి మిక్కిలినేని రమేశ్‌బాబు

పత్తికొండ బత్తిని మంజలవాణి --

తుగ్గలి కె.వరలక్ష్మి వెంకటపతి

మద్దికెర ఎర్రిస్వామి ఆవుల పెద్దన్న

వెల్దుర్తి తోళ్ల మద్దిలేటి --

మంత్రాలయం యశోదమ్మ సులోచన

కోసిగి రాధమ్మ --

కౌతాళం సురేఖ --

పెద్దకడబూరు ప్రవీణ రామాంజనేయులు

ఓర్వకల్లు మల్దిరెడ్డి పుష్పలత రషీదాబీ

ఆదోని-1 కురువ పెద్ద లక్ష్మి ఈవీ రాముగౌడ్‌

ఆదోని-2 సులోచన గోపాల్‌రెడ్డి షాహీనా బాను

కల్లూరు ఎస్‌.అపర్ణ --

Updated Date - Nov 18 , 2026 | 11:46 PM