Share News

గొంతెండిన కోసిగి

ABN , Publish Date - Nov 09 , 2026 | 11:39 PM

కోసిగి దాహంతో తల్లడిల్లిపోతోంది. ఒక రోజు కాదు.. రెండు రోజులు కాదు.. ఏకంగా పదిహేను రోజులుగా సిద్ధప్పపాలెంలోని 1వ వార్డులో తాగునీరు సరఫరా కావడం లేదు.

గొంతెండిన కోసిగి
వాల్మీకి సర్కిల్‌లో ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్న సిద్దప్పపాలెం 1వ వార్డు మహిళలు

15 రోజులుగా తాగునీటి కోసం తిప్పలు

రోడ్డెక్కిన 1వ వార్డు మహిళలు

2 గంటల పాటు భారీగా ట్రాఫిక్‌ జామ్‌

కోసిగి, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): కోసిగి దాహంతో తల్లడిల్లిపోతోంది. ఒక రోజు కాదు.. రెండు రోజులు కాదు.. ఏకంగా పదిహేను రోజులుగా సిద్ధప్పపాలెంలోని 1వ వార్డులో తాగునీరు సరఫరా కావడం లేదు. దీంతో సోమవారం తెల్లవారుజామున 6 గంటల సమయంలో ఖాళీ బిందెలతో కాలనీవాసులు ఆందోళనకు దిగారు. వాల్మీకి సర్కిల్‌లో రేషన్‌ డీలర్‌ కప్పయ్య, ఎంపీటీసీ వక్రాని వెంకటేష్‌, ముకుంద కిష్టప్ప, సీపీఎం నాయకుడు రాముడు, చాకలి వేమారెడ్డి, సాతనూరు ఈరన్న, కపటి ఈరన్న, భీమయ్యతో పాటు వందలాది మంది మహిళలు, కాలనీవాసులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం గుక్కెడు నీరు ఇవ్వలేకపోతోందని విమర్శించారు. పంచాయతీ, ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కూలీ పనులు చేసుకొని కుటుంబాలను పోషించుకోవాలా? లేక మంచినీటి కోసం పనులు మానుకోవాలా? అని ప్రశ్నించారు. వీరి ఆందోళనతో సోమవారం ఉరుకుందకు వెళ్లే భక్తుల వాహనాలు పెద్ద సంఖ్యలో ఆగిపోయి ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. సుమారు రెండు గంటలపాటు ఆందోళన కొనసాగడంతో వాహనదారులు ఇబ్బందిపడ్డారు. కానిస్టేబుళ్లు హుసేని, రామ్‌ప్రతాప్‌, మనోజ్‌గౌడ్‌, కోసిగి మేజర్‌ పంచాయతీ మాజీ సర్పంచ్‌, టీడీపీ నాయకుడు ముత్తురెడ్డి అక్కడికి చేరుకొని 1వ వార్డు కాలనీవాసులతో మాట్లాడి సాయంత్రంలోగా తాగునీటి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో మహిళలు ఆందోళన విరమించారు.

Updated Date - Nov 09 , 2026 | 11:39 PM