Share News

ఏసీబీకి చిక్కిన పంచాయతీ సెక్రటరీ

ABN , Publish Date - Jun 16 , 2026 | 11:16 PM

వెల్దుర్తి మేజర్‌ గ్రామ పంచాయతీ సెక్రటరీ లక్ష్మీనాథ్‌ రూ.40 వేలు లంచం తీసుకుంటూ మంగళవారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. డీఎస్పీ సోమన్న తెలిపిన వివరాల మేరకు.. వెల్దుర్తికి చెందిన సంజుపోగు సతీశ్‌ తనకున్న రెండు సెంట్ల స్థలంలో గుడిసె వేసుకున్నాడు.

ఏసీబీకి చిక్కిన పంచాయతీ సెక్రటరీ
పట్టుబడిన పంచాయతీ సెక్రటరీ లక్ష్మీనాథ్‌తో ఏసీబీ అధికారులు

  • రూ.40వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన వైనం

  • కేసు నమోదు చేసిన అధికారులు

వెల్దుర్తి, జూన్‌ 16 (ఆంధ్రజ్యోతి): వెల్దుర్తి మేజర్‌ గ్రామ పంచాయతీ సెక్రటరీ లక్ష్మీనాథ్‌ రూ.40 వేలు లంచం తీసుకుంటూ మంగళవారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. డీఎస్పీ సోమన్న తెలిపిన వివరాల మేరకు.. వెల్దుర్తికి చెందిన సంజుపోగు సతీశ్‌ తనకున్న రెండు సెంట్ల స్థలంలో గుడిసె వేసుకున్నాడు. దీనికి కొత్త ఇంటి నంబరు మంజూరు కోసం మేజర్‌ గ్రామ పంచాయతీ సెక్రటరీ లక్ష్మీనాథ్‌ను సంప్రదించాడు. స్థలం అప్రూవల్ చేయడంతో పాటు కొత్త ఇంటి నంబరు, ఇంటి పన్ను మంజూరు చేస్తానని, అందుకుగాను రూ.50వేలు లంచం డిమాండ్‌ చేశాడు. బేరసారాల మధ్య రూ.45 వేలకు ఒప్పందం కుదిరింది. రూ.40వేలు మొదట ఇచ్చేలా మిగతా రూ.5వేలు పని పూర్తయిన తరువాత ఇచ్చేలా ఇద్దరి మధ్య ఒప్పందం చేసుకున్నారు.

దీంతో ఫిర్యాదుదారుడు సతీశ్‌ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. మంగళవారం సతీశ్‌ రూ.40వేలు డబ్బులు తీసుకుని గ్రామ పంచాయతీ వద్దకు వెళ్లాడు. అక్కడ వద్దని హైవే-44 ఆంజనేయస్వామి కూడలి వద్ద కర్నూలు వైపు ఉన్న టీస్టాల్‌లో వద్దకు సతీశ్‌ను రమ్మన్నాడు. అప్పటికే ఏసీబీ డీఎస్పీ సోమన్న బృందం మాటువేసి ఉంది. సతీశ్‌ నుంచి రూ.40వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పంచాయతీ సెక్రటరీ లక్ష్మీనాథ్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని రూ.40వేలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు డీఎస్పీ సోమన్న తెలిపారు. ఇన్‌స్పెక్టర్లు కృష్ణయ్య, రాజ ప్రభాకర్‌, ఎస్‌ఐ సుబ్బారాయుడు, కానిస్టేబుల్‌ దొరబాబు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Jun 16 , 2026 | 11:52 PM