Share News

పంచాయతీ నగారా

ABN , Publish Date - Aug 24 , 2026 | 11:15 PM

జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికల నిర్వహణకు జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లను ముమ్మరం చేసింది.

పంచాయతీ నగారా

పల్లెల్లో ఓట్ల సందడి

31న పోలింగ్‌ కేంద్రాల తుది జాబితా విడుదల

25న ఓటర్ల ముసాయిదా జాబితా ప్రకటన

650 మంది ఓటర్లకు ఒక పోలింగ్‌ కేంద్రం

3న గ్రామ సభల నిర్వహణ

7న ఓటర్ల జాబితా విడుదల

తుది జాబితాకు జిల్లా యంత్రాంగం కసరత్తు

కర్నూలు కలెక్టరేట్‌, ఆగస్టు 24(ఆంధ్రజ్యోతి): జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికల నిర్వహణకు జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లను ముమ్మరం చేసింది. గ్రామ పంచాయతీలు, వార్డుల వారీగా ఓటర్ల సంఖ్య పోలింగ్‌ కేంద్రాల అవసరాలను పరిశీలిస్తూ మౌలిక వసతుల కల్పనపై అధికారులు దృష్టి సారించారు. ఇప్పటికే పోలింగ్‌ కేంద్రాల ముసాయిదా జాబితాను ప్రకటించారు. ఈ నెల 26లోపు మార్పులు, చేర్పులు, అభ్యంతరాలు స్వీకరించి, పరిశీలన అనంతరం ఈ నెల 31న తుది జాబితా విడుదల చేయనున్నారు. ఒక పోలింగ్‌ కేంద్రంలో సుమారు 650 మంది ఓటర్లు ఉండేలా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఓటర్లకు ఇబ్బందులు లేకుండా పోలింగ్‌ కేంద్రాల భవనాలు, విద్యుత్‌, తాగునీరు, మరుగుదొడ్లు, ర్యాంపులు తదితర సౌకర్యాలను పరిశీలిస్తున్నారు

484 పంచాయతీలు, వార్డులు 5,100

జిల్లాలో మొత్తం 484 గ్రామ పంచాయతీలు ఉండగా.. వాటి పరిధిలో 5,100 వార్డులు ఉన్నాయి. జిల్లాలో పురుషుల సంఖ్య 6,21,167 కాగా, స్త్రీల సంఖ్య 6,28,834. జిల్లాలో 5,244 ని పోలింగ్‌ కేంద్రాలను గుర్తించారు.

26 వరకు అభ్యంతరాలు

ప్రస్తుతం ప్రకటించిన పోలింగ్‌ కేంద్రాల ముసాయిదా జాబితాపై ప్రజలు, రాజకీయ పార్టీల నుంచి అభ్యంతరాలు, సూచనలు స్వీకరించనున్నారు. పోలింగ్‌ కేంద్రం దూరం, ఓటర్లకు రాకపోకలు ఇబ్బందులు, భవనం అనుకూలత, తదితర అంశాలపై వచ్చిన అభ్యంతరాలను అధికారులు పరిశీలిస్తారు. ఈ నెల 26లోపు మార్పులు, చేర్పులకు అవకాశం కల్పించారు. అనంతరం తుది పరిశీలన పూర్తి చేసి ఈ నెల 31న పోలింగ్‌ కేంద్రాల తుది జాబితాను ప్రకటించనున్నారు.

ఓటర్ల జాబితాపై ప్రత్యేక దృష్టి

నేడు ఓటర్ల ముసాయిదా జాబితా ప్రకటించనున్నారు. అభ్యంతరాలపై ఈ నెల 29న విచారణ చేపట్టనున్నారు. సెప్టెంబరు 2న గ్రామసభలు నిర్వహించనున్నారు. గ్రామసభల్లో ఓటర్ల జాబితాను పరిశీలించి ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలు, సూచనలను పరిగణనలోకి తీసుకుంటారు. అనంతరం తుది ప్రక్రియ పూర్తి చేసి సెప్టెంబరు 7న ఓటర్ల తుది జాబితాను విడుదల చేయనున్నారు.

ఎన్నికల షెడ్యూల్‌పై ఉత్కంఠ

పోలింగ్‌ కేంద్రాలు, ఓటర్ల తుది జాబితా ప్రక్రియ పూర్తయిన తర్వాత ఎన్నికల నిర్వహణకు అవసరమైన తదుపరి చర్యలను రాష్ట్ర ఎన్నికల సంఘం చేపట్టనుంది. దీంతో గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ ఎప్పుడు వెలువడుతుందనే ఆసక్తి పల్లెల్లో నెలకొంది.

సెప్టెంబరు 7న ఓటర్ల జాబితా విడుదల

జిల్లాలో పోలింగ్‌ కేంద్రాల ముసాయిదా జాబితా విడుదలైంది. సెప్టెంబరు 7న ఓటర్ల జాబితా ప్రచురిస్తాం.

- భాస్కర్‌, డీపీవో

Updated Date - Aug 24 , 2026 | 11:15 PM