Share News

ఆక్రమణలపై ఆగ్రహం

ABN , Publish Date - Nov 14 , 2026 | 11:33 PM

ఆర్టీసీ బస్టాండు ప్రాంగణంలో దుకాణదారులు ప్లాట్‌ ఫారాలను వ్యాపారులు ఆక్రమించడంపై రాష్ట్ర విజిలెన్స్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ (అడిష నల్‌ ఎస్పీ) వినోద్‌కుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆక్రమణలపై ఆగ్రహం
బస్టాండులో తనిఖీలు చేస్తున్న విజిలెన్స్‌ అధికారులు

ఆర్టీసీ బస్టాండులో విజిలెన్స్‌ తనిఖీలు

ఆదోని, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): ఆర్టీసీ బస్టాండు ప్రాంగణంలో దుకాణదారులు ప్లాట్‌ ఫారాలను వ్యాపారులు ఆక్రమించడంపై రాష్ట్ర విజిలెన్స్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ (అడిష నల్‌ ఎస్పీ) వినోద్‌కుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం సిబ్బంది ప్రవీణ్‌కుమార్‌, రామకృష్ణ, మురళీకృష్ణ, శ్రీనివాసులు బస్టాండుపై ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. హోటల్‌ నిర్వాహకులు వారికి కేటాయించిన గదిని వదిలి బస్టాండు ఆవరణలో అక్రమంగా టీ స్టాల్‌ ఏర్పాటు చేయడం, మరోవైపు పార్సిల్‌ సర్వీసు సామగ్రి, ఇంకోవైపు క్యాంటీన్‌ వస్తువులను ఎక్కడ పడితే అక్కడ పడేయడంపై ఆగ్రహించారు. దీనిపై డీఎం రెహమాన్‌ను ఏడీ నిలదీశారు. ప్రయాణికులు కూర్చునేందుకు కూడా కనీస స్థలం లేకుండా ఇలా ఆక్రమణలు ఉంటే మీరేం చేస్తున్నారంటూ ప్రశ్నించారు. తక్షణమే ఆక్రమణలను తొలగించి ప్లాట్‌ఫారాలను ఖాళీ చేయించాలని డీఎంను ఆదేశించారు. విజిలెన్స్‌ అధికారులు బస్టాండులో తనిఖీలు నిర్వహిస్తున్న విషయం తెలుసుకున్న బస్‌పాస్‌ కౌంటర్‌ ఆపరేటర్లు మల్లికార్జున, తిక్కయ్య ఏడీ వినోద్‌కుమార్‌ను కలిసి తమగోడును వెల్లబోసుకున్నారు. తమకు రూ.4.32 లక్షల మేర వేతన బకాయిలు రావాల్సి ఉన్నా ఇప్పటివరకు చెల్లించలేదని ఫిర్యాదు చేశారు. వారి సమస్యలను విన్న వినోద్‌కుమార్‌ వారి వేతన బకాయిల వివరాలను నమోదు చేసుకున్నారు. సంబంధిత ఏజెన్సీతో మాట్లాడి వారికి రావాల్సిన రూ.4.32 లక్షల బకాయిలు తక్షణమే అందేలా చర్యలు తీసుకుంటామని భరోసానిచ్చారు.

Updated Date - Nov 14 , 2026 | 11:33 PM