మన నీళ్లు మంచివే!
ABN , Publish Date - Sep 28 , 2026 | 11:36 PM
జిల్లాలో కర్నూలు సహా పలు రైల్వే స్టేషన్లలో ప్రయాణికులకు సరఫరా చేస్తున్న తాగునీటిలో ‘ఈ-కోలి’ బ్యాక్టీరియాతో పాటు నీటి సురక్షితంపై ఆ శాఖ ఆర్యోగ విభాగం అధికారులు తనిఖీలు చేశారు.
రైల్వేస్టేషన్ల తాగునీటిలో ‘ఈ-కోలి’
పార్లమెంట్‌కు నివేదించిన కాగ్
అప్రమత్తమైన దక్షిణ మధ్య రైల్వే
కర్నూలు సిటీ సహా పలు స్టేషన్లులో పరీక్షలు
తాగునీరు సురక్షితమేనని నిర్ధారణ
కర్నూలు, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కర్నూలు సహా పలు రైల్వే స్టేషన్లలో ప్రయాణికులకు సరఫరా చేస్తున్న తాగునీటిలో ‘ఈ-కోలి’ బ్యాక్టీరియాతో పాటు నీటి సురక్షితంపై ఆ శాఖ ఆర్యోగ విభాగం అధికారులు తనిఖీలు చేశారు. ఎలాంటి ఈ-కోలి బ్యాక్టీరియా, ఇతర ప్రమాదకర రసాయనాలు లేవని రైల్వే శాఖ అధికారులు సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. దేశంలో రైల్వే జోన్ల పరిధిలో 59 రైల్వే స్టేషన్లలో తాగునీటిని కంపో్ట్రలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) అధికారులు పరీక్షించారు. ప్రయాణికుల కోసం సరఫరా తాగునీటిలో ప్రమాకరమైన ఈ-కోలి బ్యాక్టీరియా ఆనవాళ్లు ఉన్నట్లు గుర్తించారు. 2022-23లో 49, 2023-24లో 56 రైల్వే స్టేషన్లలోని నీటి నమూనాలను పరీక్షించగా ఈ-కోలి బ్యాక్టీరియా ఉన్నట్లు తేలిందని ఆగస్టు 12న పార్లమెంట్‌కు ఇచ్చిన నివేదికలో స్పష్టంగా వెల్లడించింది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని హైదరాబాద్ రైల్వే ష్టేషన్‌లో కూడా ఈ-కోలి బ్యాక్టీరియా ఉన్నట్లు కాగ్ తన నివేదికలో వెల్లడిచింది. కాగ్ హెచ్చరికతో అప్రమత్తమైన రైల్వే బోర్డు రైల్వే స్టేషన్లలో నీటి పరీక్షలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్ డివిజన్‌లోని కర్నూలు నగర రైల్వే స్టేషన్, ఆ స్టేషన్‌కు అనుబంధ రైల్వే స్టేషన్లలో సరఫరా చేసే నీటి నాణ్యత, ఇండియన్ రైల్వేస్ మెడికల్ మాన్యువల్‌లో నిర్దేశించిన ప్రమాణాల మేరకు తాగునీరు సరఫరా అవుతున్నాయా..! వంటి అంశాలపై తాగునీటి పరీక్షలు నిర్వహించాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజరు సంజయ్‌కుమార్ శ్రీవాత్సవ ఆదేశించారు. అందులో భాగంగానే కర్నూలు రైల్వే స్టేషన్ ఆరోగ్య విభాగం అధికారులు కర్నూలు సహా బోగోలు, వెల్దుర్తి, ఉల్లిందకొండ, దూపాడు, తెలంగాణ రాష్ట్రంలోని మానవపాడు, గద్వాల, మహాబూబ్‌నగర్.. తదితర స్టేషన్లు, రైల్వే కాలనీలకు అందుతున్న తాగునీటి నాణ్యత పరీక్షలు నిర్వహించారు. ఈ నెల ఒకటో తేది నుంచి 26 వరకు నీటి నమూనాలు సేకరించి రైల్వే శాఖ ల్యాబ్‌ల్లో పరీక్షలు నిర్వహించారు. తాగునీటి క్లోరిన్ స్థాయిలు గుర్తించేందుకు 1917 నమూనాలు సేకరించి పరీక్షించగా ఆమోదకరమైన స్థాయిల్లోనే క్లోరిన్ ఉన్నట్లు గుర్తించారు. 315 నీటి నమూనాలు ఈ-కోలి సహా వివిధ ప్రమాదకర బ్యాక్టీరియాలజీ పరీక్షలు నిర్వహించగా ఏ పరీక్షలోనూ ఈ-కోలి బ్యాక్టీరియా పాజిటిల్ ఉన్నట్లు గుర్తించలేదు. 17 నమూనాలు రసాయన విశ్లేషణ పరీక్షిలు నిర్వహించగా ఆ నీరు వినియోగానికి యోగ్యమైనవిగా నిర్ధారించారు. అంటే.. జిల్లాలో కర్నూలు సిటీ రైల్వే స్టేషన్ సహా వివిధ స్టేషన్లలో సురక్షిత నీటిని సరఫరా చేస్తున్నట్లు నిర్ధారించారు. రైల్వే ప్రయాణికులకు, రైల్వే కాలనీల్లో నివసించే ఉద్యోగులకు, సిబ్బందికి ఇండియన్ రైల్వేస్ మెడికల్ మాన్యువల్‌లో నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా స్వచ్చమైన, సురక్షితమైన తాగునీరు అందుబాటులో ఉంచాలని, నిరంతరం పరీక్షలు, పర్యవేక్షణ కొనసాగించడంతో పాటు అప్రమత్తంగా ఉండాలని రైల్వే ఇంజనీరింగ్, హెల్త్ అధికారులను జీఎం సంజయ్‌కుమార్ శ్రీవాత్సవ ఓ ప్రకటనలో ఆదేశించారు.
ప్రమాదకరమైన ‘ఈ-కోలి’ బ్యాక్టీరియా మానవ లేదా జంతు మల వ్యర్థాలు కలిసిన నీటిలో ఉంటుంది. ఇలా కలుషితమైన నీటి వల్ల విరేచనాలు, కడుపునొప్పి, వాంతులు, జ్వరం వంటి వంటి సమస్యలు వస్తాయి. అపరిశుభ్రమైన వాతావరణం, జంతువుల మల వ్యర్థాలు కలవడం వల్ల ఈ కోలి బ్యాక్టీరియా వస్తుందని వైద్యులు వెల్లడిస్తున్నారు. ఇది జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం.