బాధితులకు నగలు అప్పగింత
ABN , Publish Date - Mar 24 , 2026 | 12:03 AM
బంధువు ఇంటికి బైక్‌పై వెళ్తూ మార్గ మధ్యంలో పోగొట్టుకున్న బంగారు నగల బ్యాగును గంటల వ్యవధిలోనే నంద్యాల పోలీసులు గుర్తించి బాధితులకు అప్పగించారు.
గంటల వ్యవధిలో రికవరీ చేసిన పోలీసులు
నంద్యాల క్రైం, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): బంధువు ఇంటికి బైక్‌పై వెళ్తూ మార్గ మధ్యంలో పోగొట్టుకున్న బంగారు నగల బ్యాగును గంటల వ్యవధిలోనే నంద్యాల పోలీసులు గుర్తించి బాధితులకు అప్పగించారు. ఈనెల 22వ తేదీ సాయంత్రం చాబోలుకు చెందిన షేక్ షాలినా తన భర్త, పిల్లలతో కలిసి పట్టణంలోని నడిగడ్డలో ఉన్న చెల్లెలు ఇంటికి వెళ్లింది. బైక్‌పై వస్తుండగా మార్గమధ్యలో బట్టలు, బంగారు ఉన్న బ్యాక్ పడిపోయింది. జరిగిన విషయాన్ని బాధితులు స్థానిక ఒకటో పట్టణ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సీఐ సుధాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు పట్టణంలో బాధితులు వెళ్లిన ప్రదేశాలను సీసీ కెమెరాల సహాయంతో పరిశీలించారు. సదరు బ్యాగును నడిగడ్డకు చెందిన ఆటో డ్రైవర్ నూరుల్లాకు దొరికిన విషయాన్ని తెలుసుకుని డ్రైవర్‌ను పోలీసులు విచారించారు. బాధితుల సమక్షంలో బ్యాగును పరిశీలించగా 12 తులాల బంగారం, బట్టలను బ్యాగును బాధితులకు అప్పగించారు. కేవలం గంటల వ్యవధిలోనే పోగొట్టుకున్న బ్యాగ్‌ను రికవరీ చేసి అప్పగించడంపై సీఐ సుధాకర్‌రెడ్డి, సిబ్బందికి బాధితులు కృతజ్ఞతలు తెలిపారు.
గుప్తనిధుల పేరుతో టోకరా
నంద్యాల క్రైం, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): ఇంట్లో గుప్తనిధులు ఉన్నాయని నమ్మబలి ఓ కుటుంబం నుంచి బంగారు, నగదును దోచుకున్న వైనం ఆలస్యంగా వెలుగు చూసింది. గుప్తనిధులు వెలికి తీస్తామని నమ్మించిన పెద్ద హుశేన్ భారీగా బంగారు, నగదును కాజేసి తప్పించుకుపోయాడు. అతనిపై సోమవారం బాధితులు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎస్పీకి ఫిర్యాదు చేశారు. నంద్యాల పట్టణం సాయిబాబానగర్‌కు చెందిన రాజేశ్వరి, లక్ష్మీనారాయణ, వారి కుమారుడు వేణుగోపాల్‌లు తమ ఇంటి నిర్మాణం గురించి వెలుగోడు మండలం మోత్కూరు గ్రామానికి చెందిన పెద్ద ఫకీర్ హుశేన్‌కు తెలిపారు. వారి అమాయకత్వాన్ని ఆసరా చేసుకున్న హుశేన్ ఆ ఇంట్లో గుప్తనిధులు ఉన్నాయంటూ నమ్మించారు. నిధులు వెలికి తీయడానికి నాలుగు తులాల బంగారు, రెండు లక్షల నగదును విడతల వారీగా తీసుకున్నాడు. ఆ తర్వాత గుప్త నిధులు వెలికి తీయకపోగా తప్పించుకు తిరుగుతుండటంతో మోసపోయామని గుర్తించిన బాధితులు రెండో పట్టణ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. విచారణ నిమిత్తం పోలీసులు పిలిచినప్పటికీ హుస్సేన్ రాకపోవడంతో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎస్పీని ఆశ్రయించారు. విచారించి న్యాయం చేస్తామని ఎస్పీ హామీ ఇచ్చినట్లు మీడియాకు బాధితులు తెలిపారు.