Share News

దేవస్థానం సొమ్ము రికవరీకి ఆదేశాలు

ABN , Publish Date - Jun 29 , 2026 | 11:28 PM

శ్రీశైల దేవస్థానం పరిధిలో గత ప్రభుత్వం హయాంలో జరిగిన అవకతవకలు అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది.

దేవస్థానం సొమ్ము రికవరీకి ఆదేశాలు

కాంట్రాక్టర్ల నుంచి వసూలు చేయాలని ఉత్తర్వులు

2021-24 మధ్య పనిచేసిన పలువురు అధికారులకు షోకాజ్‌ నోటీసులు

శ్రీశైలం, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి): శ్రీశైల దేవస్థానం పరిధిలో గత ప్రభుత్వం హయాంలో జరిగిన అవకతవకలు అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. వైసీపీ ప్రభుత్వంలో ఆలయ అధికారుల అధికార దుర్వినియోగంతో పాటు నిర్మాణ పనులు చేపట్టిన కాంట్రాక్టర్ల వ్యవహారాలపై విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు సమగ్ర విచారణ చేపట్టి ఆయా కాంట్రాక్టర్ల నుంచి దేవస్థానం సొమ్మును రికవరీకి ఆదేశించడంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 2021 నుంచి 2024 మధ్య కాలంలో దేవస్థానం పరిధిలో గల గణేష్‌ సదన్‌ అంతర్గత సీసీ రోడ్డుకు సంబంధించి కడపకు చెందిన ఓబీ మునుస్వామిరెడ్డి నుంచి రూ.1,17,352, పార్కుకు చెందిన రూ.2,68,003, గుంటూరుకు చెందిన ధరణి ఎంటర్‌ప్రైజెస్‌ వారు చేపట్టిన నక్షత్ర వనం సీసీ రోడ్డు, ఫుట్‌పాత్‌లకు గాను 2,12,221 రూపాయలు, తిరుపతికి చెందిన పీవీజీఎన్‌ బిల్డర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ వారు చేపట్టిన అటవి సరిహద్దులలో వేసిన కంచెకుగాను 2,57,321 రూపాయలు కాగా మొత్తంగా సదరు కాంట్రాక్టర్ల నుంచి రూ. 8,54,897 రూపాయలు రికవరీ చేయాలని దేవదాయశాఖ కమిషనర్‌ వారిచే ఉత్తర్వులు జారీ అయ్యాయి. టెండరు నిబంధనలు పాటించకుండా చేసిన అభివృద్ధి పనులలో సాంకేతిక లోపాలు ఉండటం గమనించి వాటిని సరిదిద్దాల్సిన దేవస్థానం అధికారులైన ఇద్దరు ఈవోలతో పాటు ఇంజనీరింగ్‌ విభాగానికి చెందిన ఈఈ, డీఈ, ఏఈలకు కూడా సంజాయిషీ ఇవ్వాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి.

Updated Date - Jun 29 , 2026 | 11:28 PM