ఆపరేషన్ సక్సెస్..పేషెంట్ డెడ్..!
ABN , Publish Date - Apr 10 , 2026 | 12:22 AM
బైపాస్ సర్జరీ సక్సెస్ అంటూ వైద్యులు బయటకు వచ్చి రోగి బంధువులకు చెప్పారు. కొద్ది సేపటికే కార్డియాక్ అరెస్టుతో రోగి చికిత్స పొందుతూ మృతిచెందాడనీ ప్రకటించడంతో బంధువులు మోసం చేశారంటూ ఆందోళనకు దిగారు.
కర్నూలు కిమ్స్ హాస్పిటల్ వద్ద ఉద్రిక్తత
కలెక్టర్‌కు ఫిర్యాదు
కర్నూలు హాస్పిటల్, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): బైపాస్ సర్జరీ సక్సెస్ అంటూ వైద్యులు బయటకు వచ్చి రోగి బంధువులకు చెప్పారు. కొద్ది సేపటికే కార్డియాక్ అరెస్టుతో రోగి చికిత్స పొందుతూ మృతిచెందాడనీ ప్రకటించడంతో బంధువులు మోసం చేశారంటూ ఆందోళనకు దిగారు. ఓర్వకల్లు మండలం ఉప్పలపాడు గ్రామానికి చెందిన వెంకటరమణారెడ్డి(69) యాంజియోగ్రామ్ పరీక్ష కోసం ఓ కార్డియాలజిస్టు సిఫారసుతో ఈ నెల 2వ తేదీ కర్నూలులోని కిమ్స్ హాస్పిటల్‌లో చేరారు. యాంజియోగ్రామ్ చేసిన తర్వాత రెండు రక్తనాళాలు మూసుకుపోయాయనీ, బైపాస్ సర్జరీ చేయాలని వైద్యులు చెప్పినట్లు బంధువులు తెలిపారు. బుధవారం సాయంత్రం రోగికి ఓపెన్‌హార్ట్ సర్జరీ నిర్వహించి వైద్యులు రెండు స్టంట్లు వేశారు. సర్జరీ తర్వాత ఐసీయూకు రోగిని తరలించి వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. రాత్రి 9:34 గంటలకు కార్డియాక్ అరెస్టుకు గురై రోగి చనిపోయాడు. బైపాస్ సర్జరీ అనంతరం ఆపరేషన్ సక్సెస్ అని వైద్యులు చెప్పారనీ, ఇప్పుడు రోగి మృతి చెందడంతో బంధువులు వైద్యులు, సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. గురువారం హాస్పిటల్ ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు.పోలీసులు జోక్యం చేసుకుంటేగానీ పరిస్థితి అదుపులోకి రాలేదు. రోగి మృతిపై బంధువులు కలెక్టర్ డాక్టర్ సిరికి ఫిర్యాదు చేయగా.. విచారణ చేయాలని డీఎంహెచ్‌వోను కలెక్టర్ ఆదేశించారు. దీనిపై కిమ్స్ హాస్పిటల్ యాజమాన్యం వివరణ ఇస్తూ రోగికి బుధవారం సాయంత్రం ఓపెన్ హార్ట్ సర్జరీ చేసి రెండు స్టంట్లు వేశామని, సర్జరీ అనంతరం ఐసీయూకు తరలించి చికిత్స అందించినట్లు తెలిపారు. 2 గంటల తర్వాత రాత్రి 9:34 గంటలకు కార్డియాక్ అరెస్టుకు గురై రోగి మరణించాడని తెలిపారు.