ఓటమి భరించలేకే కాల్పులు
ABN , Publish Date - Jul 28 , 2026 | 12:33 AM
నగరంలోని జోహరాపురం రోడ్డులో ఆదివారం రాత్రి జరిగిన కాల్పుల కేసులో నిందితుడు కౌశిక్‌ను పోలీసులు అరెస్టు చేశారు. త్రీటౌన్ సీఐ శేషయ్య తెలిపిన వివరాల మేరకు అశోక్‌నగర్ శ్రీకృష్ణ కాలనికి చెందిన కౌశిక్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాడు. బ్యాడ్మింటన్‌లో మంచి అనుభవం ఉండటంతో పాటు కోచింగ్ కూడా ఇస్తుంటాడు
నిందితుడు అరెస్టు
కర్నూలు క్రైం, జూలై 27 (ఆంధ్రజ్యోతి): నగరంలోని జోహరాపురం రోడ్డులో ఆదివారం రాత్రి జరిగిన కాల్పుల కేసులో నిందితుడు కౌశిక్‌ను పోలీసులు అరెస్టు చేశారు. త్రీటౌన్ సీఐ శేషయ్య తెలిపిన వివరాల మేరకు అశోక్‌నగర్ శ్రీకృష్ణ కాలనికి చెందిన కౌశిక్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాడు. బ్యాడ్మింటన్‌లో మంచి అనుభవం ఉండటంతో పాటు కోచింగ్ కూడా ఇస్తుంటాడు. జోహరాపురం రోడ్డులోని వీఆర్ అకాడమిలో బ్యాడ్మింటన్ పోటీలు జరుగుతున్నాయి. ఇందులో అనన్య గ్రూప్ ఆఫ్ ఇంటీరియర్స్ షంషీర్ టీమ్ తరపున కౌశిక్ సెమీ ఫైనల్స్ ఆడాడు. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఆలీ రాయల్ చాలెంజర్స్ టీమ్‌తో ఓటమి చవి చూఽశాడు. ఆ గేమ్ ముగిశాక గ్రౌండులో ఉన్న కొంత మంది ప్లేయర్స్, ప్రజలు మంచి అనుభవం ఉన్న ఆటగాడు ఓడిపోయాడని హేళనగా మాట్లాడారు. దీంతో అసహనానికి గురైన ఆయన తన మిత్రుడు అశోక్ రెడ్డితో కలిసి ఇంటికి వెళ్లిపోయాడు. అక్కడ ఇద్దరు మద్యం సేవించాక, తానేంటో చూపించాలని కౌశిక్ తన దగ్గర ఉన్న లైసెన్స్ రివాల్వర్ వెంట పెట్టుకుని బ్యాడ్మింటన్ అకాడమి వద్దకు వెళ్లాడు. అక్కడ ఉన్న ప్లేయర్స్‌తో గొడవకు దిగాడు. పోలీసులు వీరి గొడవను చూసి బయటకు పంపించేశారు. ఓటమి జీర్ణించకోలేని కౌశిక్ గట్టిగా కేకలు వేస్తూ తన వద్ద ఉన్న రివాల్వర్‌తో రోడ్డుపైన మూడుసార్లు పేల్చాడు. దీంతో అక్కడున్న ప్రజలు భయాందోళనలకు గురై పరారయ్యారు. పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. నిందితునిపై ఆర్మ్స్ యాక్ట్ చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచారు.
లైసెన్సు రద్దుకు సిఫారసు..
కౌశిక్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుండటంతో తనకు ప్రాణహానీ ఉందని 2023లో రివాల్వర్ లైసెన్సు కోసం అప్లయ్ చేశాడు. 2023లో ఆయనకు లైసెన్సు రాగా, ఆ లైసెన్సు రద్దుకు పోలీసు ఉన్నతాధికారుల ద్వారా కలెక్టర్‌కు ప్రతిపాదనలు పంపినట్లు పోలీసులు వివరించారు.