మధ్యాహ్నానికే మూత
ABN , Publish Date - Aug 22 , 2026 | 12:07 AM
కర్నూలు ప్రభుత్వాస్పత్రిలో శ్రావణ శుక్రవారం ఎఫెక్ట్ రోగులపై పడింది. పబ్లిక్ హాలిడే పేరుతో ఆస్పత్రిలోని కొన్ని విభాగాలు మధ్యాహ్నం 2గంటలకే మూతపడ్డాయి. హాస్పిటల్‌లోని పరిపాలన విభాగంలోని మొదటి అంతస్థులో ఈఎన్‌టీ, స్కిన్ సైక్రియాట్రి, డెంటల్ విభాగాల ఓపీలు ఉంటాయి.
కొన్ని విభాగాల ఓపీలు బంద్
శ్రావణ శుక్రవారం ఎఫెక్ట్
వైద్యులు లేక వెనుదిరిగిన రోగులు
కర్నూలు హాస్పిటల్, ఆగస్టు 21(ఆంధ్రజ్యోతి): కర్నూలు ప్రభుత్వాస్పత్రిలో శ్రావణ శుక్రవారం ఎఫెక్ట్ రోగులపై పడింది. పబ్లిక్ హాలిడే పేరుతో ఆస్పత్రిలోని కొన్ని విభాగాలు మధ్యాహ్నం 2గంటలకే మూతపడ్డాయి. హాస్పిటల్‌లోని పరిపాలన విభాగంలోని మొదటి అంతస్థులో ఈఎన్‌టీ, స్కిన్ సైక్రియాట్రి, డెంటల్ విభాగాల ఓపీలు ఉంటాయి. ఉదయం 9నుంచి సాయంత్రం 4గంటల వరకు ఓపీలు చూడాల్సి ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్‌లో మె డిసిన్, సర్జరీ, ఆర్థో, ఐడీ విభాగాల ఓపీలు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పని చేశాయి. జనరల్ సర్జరీ ఓపీ నెంబర్.14లో సాయంత్రం 4 గంటల వరకు ఓపీలను నిర్వహించారు. గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉదయం నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓపీలు జరిగాయి.
నాలుగు ఓపీ విభాగాలు..
మొదటి అంతస్థులోని నాలుగు ఓపీ విభాగాలు మధ్యాహ్నం 2 గంటలకే మూసేసి ఇళ్లకు వెళ్లిపోవడంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన రోగులు ఇబ్బందులు పడ్డారు. మొదటి అంతస్థులో ఉండటంత్లో ఎవరూ పట్టించుకోరన్న ఉద్దేశంతో మధ్యాహ్నానికే ఓపీలను మూసివేయడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకే ఆస్పత్రిలో కొన్ని విభాగాలకు పూర్తిస్థాయిలో ఓపీలు పెట్టి మరి కొన్ని విభాగాలకు మధ్యాహ్నం వరకు ఓపీలను పెట్టడంపై కొందరు వైద్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఓ పక్క జూడాల సమ్మెతో ఓపీ విభాగాలు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించాలన్న ఆదేశాలు బేఖాతరవుతున్నాయి.