బ్యాలెట్ పత్రాలపై గుర్తులు మాత్రమే...!
ABN , Publish Date - Nov 26 , 2026 | 12:22 AM
ఉమ్మడి కర్నూలు జిల్లాలో మొదటి విడతలో పల్లెపోరు షురూ అయింది. ఏకగ్రీవ గ్రామ పంచాయతీలు, వార్డుస్థానాలు మినహాయించి మిగిలిన పంచాయతీల్లో గురువారం ఎన్నికలు జరగనున్నాయి.
అభ్యర్థులకు కేటాయించిన గుర్తుకే ఓటెయాలి
సర్పంచ్ అభ్యర్థుల్లో క్రాస్ ఓటింగ్ భయం
నేడు తేలనున్న అభ్యర్థుల భవితవ్యం
శిరివెళ్ల, నవంబరు 25(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి కర్నూలు జిల్లాలో మొదటి విడతలో పల్లెపోరు షురూ అయింది. ఏకగ్రీవ గ్రామ పంచాయతీలు, వార్డుస్థానాలు మినహాయించి మిగిలిన పంచాయతీల్లో గురువారం ఎన్నికలు జరగనున్నాయి. ఒకే రోజు పోలింగ్, ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సం‘గ్రామ’ంలో ఓటర్ల తీర్పు కోసం అభ్యర్థులు వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు. నంద్యాల జిల్లాలో మొదటి విడతలో 136 పంచాయతీల్లో ఎన్నికలు జరగాల్సి ఉండగా 29 పంచాయతీల్లో సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం కావడంతో 107 పంచాయతీల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. అలాగే కర్నూలు జిల్లాలో మొదటి విడతలో 148 గ్రామ పంచాయతీలకుగాను 13 పంచాయతీల్లో మాత్రమే సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో 135పంచాయతీల్లో అభ్యర్థులు తలపడుతున్నారు.
గుర్తులే కీలం
రాజకీయ పార్టీలకు అతీతంగా జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లు.. అభ్యర్థులకు కేటాయించిన గుర్తుకే ఓటేయాల్సి ఉంటుంది. సాధారణంగా బ్యాలెట్ పత్రాలపై అభ్యర్థుల పేర్లు, చిత్రాలు, వాటికి ఎదురుగా ఎన్నికల గుర్తులు ఉంటాయి. కానీ పంచాయతీ ఎన్నికల్లో మాత్రం బరిలో నిలిచిన అభ్యర్థులకు కేవలం ఎన్నికల సంఘం కేటాయించిన గుర్తులు మాత్రమే బ్యాలెట్ పేపర్‌పై ముద్రించి ఉంటాయి. పార్టీ రహిత ఎన్నికలు కావడంతో గుర్తులే అత్యంత కీలకం. సర్పంచ్ అభ్యర్థికి గులాబీ రంగు బ్యాలెట్, వార్డు సభ్యునికి తెలుపు రంగు బ్యాలెట్ ఉంటుంది. వీటిపై అభ్యర్థుల గుర్తులతోపాటు చివరగా ఎవరూ కాదు(నోటా) గుర్తు కూడా ముద్రించి ఉంటుంది. సర్పంచ్, వార్డు సభ్యులకు వేర్వేరుగా ఓటు వేయాల్సి ఉంటుంది.
క్రాస్ ఓటింగ్ భయం ..
ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అక్కడక్కడా క్రాస్ ఓటింగ్ జరిగినట్లు స్పష్టమైంది. పంచాయతీ ఎన్నికల్లో సైతం సర్పంచ్, వార్డు సభ్యునికి వేర్వేవేరుగా ఓటు వేయాల్సి ఉండడంతో అభ్యర్థుల్లో క్రాస్ ఓటింగ్ భయం పట్టుకుంది. పంచాయతీలోని వార్డు స్థానాల్లో ఎక్కువ స్థానాలు గెలుచుకున్న వారికే ఉప సర్పంచ్ పదవి దక్కుతుంది.
మధ్యాహ్నం 1 గంట వరకే అవకాశం
పల్లెపోరులో భాగంగా గ్రామ పంచాయతీల్లో ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభం అవుతుంది. మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రమే ఓటు వేసే అవకాశం ఉంటుంది. మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఎన్నికల అధికారులు లెక్కింపు ప్రారంభిస్తారు. వార్డు స్థానాలు, సర్పంచ్‌కు వచ్చిన ఓట్లను వేర్వేరుగా లెక్కించి విజయం సాధించిన అభ్యర్థులను అధికారులు ప్రకటించి డిక్లరేషన్ పత్రాలు అందజేస్తారు.
ఎడమచేతి చిటికెన వేలుపై సిరా..
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఓటర్లు ఇటీవలే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆ సమయంలో ఎడమ చేతి చూపుడు వేలుపై సిరా గుర్తు వేశారు. ప్రాదేశిక ఎన్నికలు ముగిసిన కొన్ని రోజుల వ్యవధిలోనే గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నందున ఓటు వేసేందుకు వచ్చే వారికి ఎడమచేతి చిటికెన వేలుకు సిరా గుర్తును వేయాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.