Share News

నిధులిస్తేనే.. నీళ్లు

ABN , Publish Date - Feb 02 , 2026 | 11:56 PM

బడ్జెట్‌లో సీమ ప్రాజెక్టులకు స్తానం ఎలా ఉంటుందనే విషయంలో జిల్లా ప్రజలు ఆసక్తిగా ఉన్నారు. సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో, ప్రతిపాదన దశలోనే ఉండిపోయిన ప్రాజెక్టులకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతున్నారు.

నిధులిస్తేనే.. నీళ్లు
అసంపూర్తిగా గాజులదిన్నె జలాశయం సామర్థ్యం పెంపు పనులు

ఉమ్మడి జిల్లాలో ఆగిన పలు సాగునీటి ప్రాజెక్టులు

శ్రీశైలం డ్యాంకు బడ్జెట్‌లో ప్రాధాన్యత కల్పించాలి

హంద్రీనీవా పత్తికొండ జలాశయం కుడి, ఎడమ కాలువలు పూర్తికి చర్యలు తీసుకోవాలి

ప్రాధాన్య ప్రాజెక్టుల్లో వేదవతి, అలగనూరు, గాజులదిన్నె

ఉమ్మడి జిల్లా ప్రాజెక్టుల కోసం రూ.1,420 కోట్లతో ప్రతిపాదనలు

ఈ బడ్జెట్‌లోనైనా గుండ్రేవుల ప్రస్తావన వచ్చేనా..?

బడ్జెట్‌లో సీమ ప్రాజెక్టులకు స్తానం ఎలా ఉంటుందనే విషయంలో జిల్లా ప్రజలు ఆసక్తిగా ఉన్నారు. సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో, ప్రతిపాదన దశలోనే ఉండిపోయిన ప్రాజెక్టులకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతున్నారు. గత వైసీపీ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులపై అంతులేని నిర్లక్ష్యం ప్రదర్శించింది. గతేడాది ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ పూర్తిస్థాయి బడ్జెట్‌ శాసనసభలో ప్రవేశ పెట్టినా ఆగిపోయిన ప్రాజెక్టులకు ఆశించిన స్థాయిలో నిధులు ఇవ్వలేదు. ఫలితంగా వేదవతి, ఆర్డీఎస్‌ కుడి కాలువ, గాజులదిన్నె ప్రాజెక్టు, ఆలగనూరు జలాశయం సహా వివిధ సాగునీటి ప్రాజెక్టులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉన్నాయి. శ్రీశైలం డ్యాం మరమ్మతులపై దృష్టి సారించినా నిధులు ఇవ్వలేదు. ఈ నెల 11 నుంచి శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 14న ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌-2026-27 ప్రవేశ పెట్టనున్నారు. ఇప్పటికే వివిధ శాఖల నుంచి ప్రతిపాదనలు తెప్పించుకొని పద్దుల కరసత్తు చేస్తున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో వివిధ సాగునీటి ప్రాజెక్టులకు రూ.1,420 కోట్లు నిధులు ఇచ్చి ప్రాజెక్టుల పురోగతి పరుగులు పెట్టించాలని జలవనరుల శాఖ ఇంజనీరింగ్‌ ఉన్నతాధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. వాస్తవానికి అంతకంటే రెట్టింపు నిధులు అవసరం ఉందని ఇంజనీర్లు అంటున్నారు. బడ్జెట్‌ ప్రతిపాదన వివరాలపై ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం.

కర్నూలు, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి కర్నూలు జిల్లాలో భారీ, మధ్యతరహా, చిన్నతరహా ప్రాజెక్టుల కింద దాదాపుగా 9.50 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ప్రాజెక్టులు, పంట కాలువలు అసంపూర్తిగా వదిలేయడంతో నిర్దేశించిన ఆయకట్టుకు సాగునీరు అందని ద్రాక్షగా మారింది. అసంపూర్తి పనులతో పాటు గత టీడీపీ ప్రభుత్వ హయంలో శ్రీకారం చుట్టిన వేదవతి, ఆర్డీఎస్‌ కుడి కాలువ ప్రాజెక్టులు సహా అసంపూర్తిగా వదిలేసినా హంద్రీనీవా ప్రాజెక్టు పరిధిలోని పత్తికొండ జలాశయం, కుడి, ఎడమ కాలువలు పూర్తి చేస్తే అదనంగా 1.65 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఆనకట్టు కుంగిపోయి నిరర్థకంగా మారిన అలగనూరు జలాశయం పూర్తి చేసే కేసీ కాలువ రైతుల కన్నీళ్లు తుడిచే అవకాశం ఉంది. ఉమ్మడి జిల్లాలో వివిధ ప్రాజెక్టులకు దాదాపుగా రూ.1,420 కోట్లు నిధులు ఇవ్వాలని ప్రాజెక్టుల వారిగా జలవనరుల శాఖ ప్రభుత్వానికి ఇప్పటికే ప్రతిపాదనలు పంపారు. అందులో ప్రాజెక్టుల కోసం రూ.800 కోట్లు, భూ సేకరణకు రూ.200 కోట్లు, విద్యుత్‌ బిల్లులు చెల్లింపుల కోసం రూ.150 కోట్లు, హంద్రీనీవా ప్రాజెక్టు పరిధిలోని పత్తికొండ (పందికోన) జలాశయం, కుడి, ఎడమ కాలువల అసంపూర్తి పనులకు రూ.270 కోట్లు ఇవ్వాలని కోరారు. భూ సేకరణ చేయనిదే ఏ ప్రాజెక్టు కూడా ముందుకు సాగదు. వలసలు నివారణే లక్ష్యంగా చేపట్టిన ప్రాజెక్టులకు ఈ బడ్జెట్‌లో ఎలాంటి ప్రాధాన్యత ఇచ్చేదీ వేచి చూడాల్సిందే.

శ్రీశైలం డ్యాంకు రూ.వంద కోట్లు ఇవ్వండి

తెలుగు రాష్ట్రాలు సహా రాయలసీమ జీవనాడి శ్రీశైలం డ్యాం శాశ్వత మరమ్మతులపై బడ్జెట్‌లో ప్రత్యేక ఫోకస్‌ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని సీమ సాగునీటి నిపుణులు అంటున్నారు. 2009 వరదలకు భారీగా దెబ్బతిన్న శ్రీశైలం ప్రాజెక్టును పలు నిపుణుల కమిటీలు క్షేత్రస్థాయిలో పరిశీలించి రక్షణ, శాశ్వత మరమ్మతుల కోసం పలు సూచనలు చేశారు. 43-45 మీటర్లు లోతు, 400 మీటర్లు పొడవు, 270 మీటర్లు వెడల్పుతో ఏర్పడిన పంజ్‌పూల్‌ గుంత, పూర్తిగా దెబ్బతిని శిథిలావస్థకు చేరిన 62 డ్యాం ప్రొటెక్టివ్‌ స్టీల్‌ సిలిండర్లపై ప్రత్యేక దృష్టి సారించాలని, వరదకు కొట్టుకుపోయిన అప్రోచ్‌ రోడ్డు నిర్మాణం చేయాలని నిపుణులు సూచించారు. శాశ్వత మరమ్మతులు, వివిధ పనుల కోసం కూటమి ప్రభుత్వం రూ.208 కోట్లు అప్రూవల్‌ ఇచ్చింది. తాజాగా బడ్జెట్‌లో రూ.వంద కోట్లు ఇవ్వాలని ప్రతిపాదనలు పంపారు. ప్రత్యేక ప్రాధాన్యతగా పరిగణించి పూర్తిస్థాయిలో నిధులు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

పశ్చిమ పల్లెసీమల్లో నిధుల ‘కరువు తీరేనా’..?:

జిల్లాలో కరువు.. వలసలతో నిత్యం తల్లడిల్లే పశ్చిమ ప్రాంత పల్లెసీమల్లో జలసిరులు పరుగులు పెట్టాలంటే నిధుల వరద కట్టాలి. కరువు, వలసల నివారణే లక్ష్యంగా 2019లో ఆనాటి సీఎం చంద్రబాబు ప్రభుత్వం వేదవతి, ఆర్డీఎస్‌ కుడి కాలువ ప్రాజెక్టులు చేపట్టింది. ఆలూరు, ఆదోని నియోజకవర్గాల్లో 80 వేల ఎకరాలకు సాగు, 195 గ్రామాలకు తాగునీరు అందించే వేదవతి ప్రాజెక్టును రూ.1,942 కోట్లతో, మంత్రాలయం, ఎమ్మిగనూరు, కోడుమూరు నియోజకవర్గాల్లో 40 వేల ఎకరాకలకు సాగునీరు ఇచ్చేందుకు రూ.1,985.42 కోట్లతో ఆర్డీఎస్‌ కుడి కాలువ (రైట్‌ బ్యాంక్‌ కెనాల్‌) చేపట్టారు. ఈ రెండు ప్రాజెక్టుల అంచనా వ్యయం రూ.3,927.42 కోట్లు. గత వైసీపీ హయాంలో అంతులేని నిర్లక్ష్యం వల్ల ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా పనులు మొదలు కాలేదు. ఈ ఏడాది బడ్జెట్‌లో కరువు తీర్చేలా నిధులు ఇస్తేనే పనులు ప్రారంభించే అవకాశం ఉంది. వేదావతి, ఆర్డీఎస్‌, టీబీపీ ఎల్లెల్సీ మూడు ప్రాజెక్టులు ఒకే హెడ్‌ కింద ఉన్నాయి. వీటికి ఈ బడ్జెట్లో కనీసం రూ.300 కోట్లు ఇవ్వాలని ప్రతిపాదనలు పంపించారు.

జీడీపీకి రూ.40 కోట్లు ఇవ్వండి:

ఎమ్మిగనూరు, కోడుమూరు నియోజకవర్గాల ప్రాధారం గాజులదిన్నె జలాశయం. వేసవిలో కర్నూలు నగరవాసులకు దాహం తీర్చేందుకు ప్రత్యామ్నాయంగా ఈ ప్రాజెక్టు ఆదారం. సామర్థ్యం 4.5 టీఎంసీలు కాగా, 5.50 టీఎంసీలకు పెంచడంతో పాటు పూర్తిగా దెబ్బతిన్న గేట్లు స్థానంలో నూతన గేట్లు ఏర్పాటు కోసం గత వైసీపీ ప్రభుత్వం భూ సేకరణతో కలిపి రూ.137 కోట్లతో పనులు చేపట్టింది. దాదాపు రూ.22 కోట్లు బకాయి బిల్లులు చెల్లించాలి. ప్రాజెక్టును పూర్తి చేయాలంటే మరో రూ.96 కోట్లు కావాలి. తాజాగా ప్రవేశ పెట్టే బడ్జెట్‌లో కనీసం రూ.40 కోట్లైనా ఇవ్వాలని ప్రతిపాదనలు పంపారు. వాస్తవానికి బకాయితో కలపి రూ.118 కోట్లు అవసరం ఉంది.

నిధులిస్తేనే నీటి నిల్వలు:

గోరుకల్లు, అలగనూరు జలాశయాల్లో పూర్తి స్థాయిలో నీటి నిల్వలు చేయాలంటే కుంగిపోయిన ఆనకట్టలు తక్షణ మరమ్మతులు చేయాలి. అందుకు అవసరమైన నిధులు ఈ బడ్జెట్‌లో కేటాయించాలి. నంద్యాల, కడప జిల్లాల్లో కేసీ కాలువ ఆయకట్టుకు అత్యసర పరిస్థితుల్లో సాగునీరు అందించి రైతుల కన్నీళ్లు తుడవాలనే ఆశయంగా 2.96 టీఎంసీల సామర్థ్యంతో అలగనూరు జలాశయం నిర్మించారు. ఈ బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ కేసీ రైతులకు జీవనాడి. 2017లో ఆనకట్ట కుంగిపోతే ఆనాటి నుంచి మరమ్మతులకు నోచుకోలేదు. ప్రభుత్వం ప్రాధాన్యత ప్రాజెక్టుల జాబితాలో చేర్చింది. రూ.25 కోట్లు నిధులు ఇవ్వాలని ప్రతిపాదించారు. అలాగే.. గాలేరు-నగరి ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన గోరుకల్లు జలాశయం సామర్థ్యం 12.44 టీఎంసీలు. ఆనకట్ట కుంగిపోవడం, అసంపూర్తి పనుల వల్ల పూర్తి స్థాయిలో నీటి నిల్వలు చేయలేని పరిస్థితి ఉంది. ఆయా పనుల కోసం రూ.35 కోట్లు ఇవ్వాలని ప్రతిపాదించారు.

కేసీ రైతుల కన్నీళ్లు తుడవాలి:

కర్నూలు, నంద్యాల, కపడ జిల్లాల్లో 2.65 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే కేసీ కాలువ, సుంకేసుల బ్యారేజీ 2009 వరదలకు పూర్తిగా దెబ్బతింది. నాటి నుంచి తాత్కాలిక మరమ్మతులతో సిరిపుచ్చుతున్నారు. సుంకేసుల జలాశయం ఆనకట్ట, గేట్లు శాశ్వత మరమ్మతులు చేయాల్సి ఉంది. 0/0 నుంచి 68 కిలోమీటరు వరకు ప్రధాన కాలువ సీసీ లైనింగ్‌ పూర్తిగా శిథిలమైంది. బ్యారేజీ శాశ్వత మరమ్మతులు, కేసీ కాలువ లైనింగ్‌, మరమ్మతుల కోసం రూ.300 కోట్లు ఇవ్వాలని జలవనరుల శాఖ ఇంజనీర్లు ప్రతిపాదనలు పంపించారు.

రూ.270 కోట్లు ఇస్తే 45 వేల ఎకరాలకు సాగునీరు:

హంద్రీనీవా ప్రాజెక్టులో భాగంగా పత్తికొండ (పందికోన) జలాశయం నిర్మించారు. ఉమ్మడి జిల్లాలో హంద్రీనీవా కాలువ కింద 7.5 టీఎంసీలు నీటిని వినియోగించుకొని 80 ఎకరాలకు సాగునీరు ఇవ్వాలి. పత్తికొండ (పందికోన) జలాశయం కుడి కాలువ (ఆర్‌బీసీ) పరిధిలో 50,620 ఎకరాలు, ఎడమ కాలువ (ఎల్‌బీసీ) పరిధిలో 10,774 ఎకరాలు కలిపి 61,394 ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉంది. రిజర్వాయర్‌ రివెట్మెంట్‌ సహా కుడి, ఎడమ ప్రధాన కాలువలు, పంట కాలువ పనులు అసంపూర్తిగా ఉన్నాయి. ప్రస్తుతం 20 వేల ఎకరాలకు కూడా సాగునీరు అందడం లేదు. అసంపూర్తి పనులు పూర్తి చేస్తే 45 వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. అందుకు రూ.270 కోట్లు కావాలని ప్రతిపాదనలు పంపారు. హంద్రీనీవా ప్రధాన కాలువను రూ.3 వేల కోట్లతో విస్తరణ, సీసీ లైనింగ్‌ పూర్తి చేసి కుప్పంకు కృష్ణా జలాలు మళ్లిస్తున్నారు. కళ్ల ముందే జలాలు తరలిపోతుంటే కరువు కన్నీళ్లు పెడుతున్నారు. ఈ బడ్జెట్‌లో నిధులు ఇచ్చి కరువు.. వలసలు నివారించాలని రైతుల విన్నపం.

ప్రాజెక్టుల వారిగా 2026-27 బడ్జెట్‌ ప్రతిపాదనలు. రూ.కోట్లల్లో

ప్రాజెక్టు ప్రతిపాదన

శ్రీశైలం ప్రాజెక్టు 100

టీబీపీ ఎల్లెల్సీ, వేదావతి, ఆర్డీఎస్‌ 300

కేసీ కాలువ 300

గాజులదిన్నె జలాశయం 40

అలగనూరు జలాశయం 25

గోరుకల్లు జలాశయం 35

భూ సేకరణకు 200

విద్యుత్‌ బిల్లులు చెల్లింపులు 150

మొత్తం 1,150

హంద్రీనీవా పత్తికొండ జలాశయం 270

మొత్తం 1,420

Updated Date - Feb 02 , 2026 | 11:56 PM