ఇక ఆన్‌లైన్‌లోనే
ABN , Publish Date - Jul 14 , 2026 | 12:12 AM
విద్యుత్తు బిల్లుల సేకరణను పూర్తిగా డిజిటలైజేషన్ చేయాలని ఏపీ ఏస్పిడీసీఎల్ నిర్ణయం తీసుకుంది. ఇకపై వినియోగదారులు ఆన్‌లైన్ ద్వారానే విద్యుత్ బిల్లులు చెల్లించాలని ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు.
విద్యుత్ బిల్లుల చెల్లింపులపై ఏపీ ఎస్పీడీసీఎల్ నిర్ణయం
దశల వారిగా అమలుకు కసరత్తు
ఆ తర్వాత వసూలు కేంద్రాల మూసివేత
కల్లూరు, జూలై 13 (ఆంధ్రజ్యోతి): విద్యుత్తు బిల్లుల సేకరణను పూర్తిగా డిజిటలైజేషన్ చేయాలని ఏపీ ఏస్పిడీసీఎల్ నిర్ణయం తీసుకుంది. ఇకపై వినియోగదారులు ఆన్‌లైన్ ద్వారానే విద్యుత్ బిల్లులు చెల్లించాలని ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు.
ప్రస్తుతం ఇలా..
ఏపీ ఎస్పీడీసీఎల్ పరిధిలోని కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో మొత్తం 61.32 లక్షల మంది విద్యుత్ వినియోగదారులు ఉన్నట్లు ఆధికారిక సమాచారం. ప్రతి నెల రూ.520 కోట్ల బిల్లులను వినియోగదారులు చెల్లిస్తున్నారు. ప్రస్తుతం 49.50 శాతం మంది వినియోగదారులు అధికారిక వెబ్‌సైట్, మొబైల్ యాప్, డైనమిక్ క్యూఆర్ కోడ్, వాట్సప్ గవర్నెన్స్(మనమిత్ర), నెట్ బ్యాంకింగ్, డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లిస్తున్నారు. మిగిలిన 50.50 శాతం మంది విద్యుత్తు కేంద్రాల వద్ద, సిబ్బంది వద్ద, ఎలక్రిసిటీ రెవిన్యూ కార్యాలయాల వద్ద ఆఫ్‌లైన్ విధానంలో చెల్లిస్తున్నారు. దశల వారిగా 100శాతం చెల్లింపులు ఆన్‌లైన్‌లోనే వసూలు చేయాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ఆన్‌లైన్‌లోకానీ యాప్ ద్వారాకానీ సులభంగా చెల్లించడం సహా వినియోగ వివరాలు, గత బిల్లుల చెల్లింపుల చరిత్ర తెలుసుకోవడం, కొత్త సేవలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది.
నగదు లావాదేవీలు తగ్గించేలా..
బిల్లుల వసూలులో పారదర్శకత మరింత పెంచేందుకు, నగదు లావాదేవీలు తగ్గించేందుకు డిజిటల్ సేవలకు మరింత ప్రోత్సహించే దిశగా సంస్థ చర్యలు చేపడుతోంది. ఎలక్ర్టిసిటీ రెవెన్యూ కార్యాలయాల లోనూ ఆన్‌లైన్ చెల్లింపులకే ప్రాధాన్యం కల్పిస్తోంది. దశల వారిగా ఈ కేంద్రాలను మూసివేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టనుంది.
అవగాహన కల్పిస్తాం: ఆర్. ప్రదీ్‌పకుమార్ ఆపరేషన్స్ ఎస్‌ఈ, కర్నూలు
విద్యుత్ బిల్లుల ఆన్‌లైన్ చెల్లింపులపై వినియోగదారులకు అవగాహన కల్పిస్తాం.. వసూళ్లలో పారదర్శకత పెంచడం సహా వందశాతం డిజిటల్ చెల్లిపులను అమలు చేయాలని ఇప్పటికే డిస్కం అధికారులు ఆదేశించి ఉన్నారు. దశల వారిగా బిల్లు వసూలు కేంద్రాలను మూసివేయడానికి చర్యలు తీసుకోనున్నట్లు ఎస్‌ఈ తెలిపారు.