ఘాటెక్కిన ఉల్లి
ABN , Publish Date - Aug 25 , 2026 | 12:23 AM
నిన్న మొన్నటి వరకు కిలో రూ.30లోపు ఉన్న ఉల్లిగడ్డల ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయయి. సోమవారం గోనెగండ్లలో కిలో రూ.50 పలికాయి. గతంలో రూ.వందకు 4 నుంచి 5 కిలోలు లభించేవి.
కిలో రూ.50కిపైగానే ధర..
బెంబేలెత్తుతున్న వినియోగదారులు
మహారాష్ట్రలో పంట దెబ్బతినటమే కారణం
గోనెగండ్ల, ఆగస్టు 24(ఆంధ్రజ్యోతి): నిన్న మొన్నటి వరకు కిలో రూ.30లోపు ఉన్న ఉల్లిగడ్డల ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయయి. సోమవారం గోనెగండ్లలో కిలో రూ.50 పలికాయి. గతంలో రూ.వందకు 4 నుంచి 5 కిలోలు లభించేవి. అయితే సంజామల సంతలో ఒక్కసారిగా ధర పెరిగింది. కూరగాయలు కొనేందుకు వచ్చిన వినియోగదారులు ఉల్లిగడ్డల ధరను చూసి బెంబేలెత్తారు. అర కిలో నుంచి కిలో మాత్రమే కొనుగోలు చేసి వెళ్లిపోయారు. ఉల్లిపంట సాగు పట్ల రైతులు అసక్తి చూపుతుండటంతో ఉల్లినారకు మంచి గిరాకీ పెరిగింది. కర్నూలు జిల్లాలో దాదాపు 19వేల హెక్టార్లలో సాగు కావాల్సి ఉంది. బావులు బోర్ల కింద ఇప్పటి వరకు 5000 హెక్టార్లలతో మాత్రమే సాగు అయినట్లు తెలుస్తుంది.
తగ్గిన ఉల్లిసాగు, మహారాష్ట్రలో దెబ్బతిన్న పంట
జిల్లాలో వర్షాలు లేక పోవడంతో బావులు బోర్లు ఎండిపోయి ఉల్లి ఆశించినంత మేర సాగు చేయలేదు. ఎమ్మిగనూరు, నందవరం, గోనెగండ్ల మండలాల్లో 18వేల ఎకరాల్లో సాగుచేయాల్సి ఉండగా కేవలం 5వేల ఎకరాల్లో మాత్రమే సాగు చేశారు. అలాగే రాష్ట్రానికి ఉల్లిగడ్డలు అధికంగా మహారాష్ట్ర నుంచి దిగుమతి అవుతాయి. అయితే అక్కడ ఉల్లి పంట దెబ్బతినడంతో దిగుబడి తగ్గి రాష్ట్రానికి రావడం లేదు. మళ్లీ సరుకు దిగుమతి అయ్యేవరకు ధర తేగ్గేఅవకాశాలు కనిపించడం లేదు.
మళ్లీ పెరిగిన ఉల్లి సాగు..
ఇటీవల ఉల్లి ధర పెరగడంతో ఉల్లిసాగు చేసేందుకు రైతులు మక్కువ చూపుతున్నారు. మండలంలో దాదాపు వెయ్యి ఎకరాల్లో సాగు చేశారు. వర్షాబావ పరస్థితి కారణంగా చాలమంది సాగు చేయలేదు. బావులు, బోర్ల దగ్గర ఉల్లిని సాగు చేస్తున్నారు. ఈసారి ఎలాగైన ధర పలుకుతుందనే నమ్మకం తో రైతులు ఉన్నారు.
కిలోతో సరి..
వినియోగదారులు ఉల్లిగడ్డలను ఇది ఒకేసారి వరకు నాలుగైదుకిలోలు నిలువ ఉంచుకునేవారు అయితే ప్రస్తుతం ధర పెరగడంత కిలో మాత్రమే కొని సరిపెట్టుకుంటున్నారు. కూరల్లో కూడా తక్కువ మోతాదు వాడుతున్నారు.
ఆటోల్లో విక్రయాలు..
ఉల్లి ధర ఒక్కసారిగా పెరగడంతో ఆటోల్లో వ్యాపారులు ఆటోలు, ఇతర వాహనాలలో వెళ్లి రూ.వందకు రెండు కేజిల చొప్పున విక్రయిస్తున్నారు. వ్యాపారులు మారుమూల పల్లెలకు సైతం ఆటోల్లో తరలించి విక్రయిస్తున్నారు.