ఉల్లి పంటపై పెరిగిన ఆశ..
ABN , Publish Date - Aug 16 , 2026 | 11:52 PM
ప్రసుత్తం ఉల్లి పంటపై రైతన్నకు ఆశ పెరుగుతుంది. ఇటీవల ఆశాజనకంగా ధర పలుకుతుండటంతో ఉల్లి సాగుపై రైతులు మక్కువ చూపుతున్నారు. ఎమ్మిగనూరు, గోనెగండ్ల, నందవరం మండలాలలో బావులు, బోర్ల కింద రైతులు ఉల్లిసాగు చేస్తున్నారు.
బావులు, బోర్ల కింద సాగు చేస్తున్న రైతన్న
ఆగస్టులో 4500 ఎకరాలలో ఉల్లి సాగు
గోనెగండ్ల, ఆగస్టు 16(ఆంధ్రజ్యోతి): ప్రసుత్తం ఉల్లి పంటపై రైతన్నకు ఆశ పెరుగుతుంది. ఇటీవల ఆశాజనకంగా ధర పలుకుతుండటంతో ఉల్లి సాగుపై రైతులు మక్కువ చూపుతున్నారు. ఎమ్మిగనూరు, గోనెగండ్ల, నందవరం మండలాలలో బావులు, బోర్ల కింద రైతులు ఉల్లిసాగు చేస్తున్నారు. గత రెండు నెలల క్రితం వరకు ఉల్లి పంటకు గిట్టుబాట ధర లేకపోవడతో అటువైపు మక్కువ చూపలేదు. అయితే ఇటీవల ధర పెరగడంతో మళ్లీ సాగుకు ఇష్టపడుతున్నారు. ఒక ఎకరం ఉల్లి పంట సాగుకు రూ. 80వేల నుంచి రూ. 90వేల వరకు పెట్టుబడి అవుతుంది. పంట చేతికి అందే సమయానికి ఉల్లి పంటకు గిట్టుబాటు ధర లభిస్తుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. గోనెగండ్ల, ఎమ్మిగనూరు, నందవరం, మండలాల పరిధిలో ఇప్పటికే బావులు, బోర్ల కింద దాదాపు 4500 ఎకరాలలో పంటను సాగు అయింది. ప్రతి ఏడాది డివిజన్‌లో
ఈ ఖరీ్‌ఫలో 10 వేల ఎకరాల పైగానే ఉల్లి పంటసాగు కావాల్సి ఉంది. అయితే ఈ ఏడాది పండిన పంటకు గిట్టు బాటు ధర లేక పోవడంతో సాగు తగ్గింది. ప్రస్తుతం 50 శాతం సాగు అవుతుంది.
ధర పలుకుతున్న ఉల్లినారు
గత రెండు నెలల వరకు ఉల్లి పంటను సాగు చేసేందుకు రైతులు ముందుకు రాక పోవడంతో ఉల్లి నారకు గిట్టుబాటు ధర లభించలేదు. అయితే 20 రోజులుగా ఉల్లి పంటను సాగు చేసేందుకు రైతులు ముందుకు రావడంతో ఉల్లినారాకు మంచి ధరపలుకుతుంది. గోనెగండ్ల మండలంలో వందల ఎకరాల మేర ఉల్లినారు వేసి రైతులు అమ్మకాలు జరుపుతున్నారు. ఇప్పుడు ఉల్లి పంట సాగుచేసినా పంట చేతికి అందే సమయానికి ఉల్లి నిల్వలు చప్పుకోదగ్గ స్ధాయిలో లేకపోతాయని, ఆ సమయంలో ఇతర రాష్ట్రల నుంచి కూడా ఉల్లి వచ్చేందుకు ఆలస్యం అవుతుంది, కావున ముందుగా పండిన ఉల్లి పంట అమ్మకానికి రావడంతో మంచి డిమాండ్ పలుకుతుందని రైతులు ఆశిస్తున్నారు.
ఆశతో ఉల్లి సాగు చేశాను
గత రెండేళ్ల క్రితం నాలుగు ఎకరాల్లో ఉల్లి సాగు చేశాను. రూ. 2లక్షలు నష్టం వచ్చింది. ఈ ఏడాదైనా గిట్టుబాటు ధర లభిస్తుందనే ధైర్యంతో రెండుఎకరాల్లో ఉల్లి సాగు చేశాను. అంత దైవంపై భారం వేశాం. - బడేసా, రైతు గోనెగండ్ల
డ్రిప్ ఇరిగేషన్ ఏర్పాటు చేసుకుంటే సబ్సిడీ
ఉద్యానవన శాఖ నిబంధనల ప్రకారం ఉల్లి పంటను సాగు చేసుకుంటే హెక్టారుకు రూ. 20వేల వరకు ప్రభుత్వం సబ్సిడీ అందిస్తుంది. అయితే పంటకు డ్రిప్ ఇరిగేషన్ ద్వారా నీటిని మళ్లించాలి. అలాగే ఎత్తు మడుల ద్వారా పంటను సాగు చేయాలి. ఈ ఏడాది డివిజన్‌లో 50 శాతం పంట సాగు తగ్గింది. ఆగస్టులో పంట సాగు చేసేందుకు రైతులు ముందుకొస్తున్నారు. ఎమ్మిగనూరు, గోనెగండ్ల మండలాలలో ఎక్కువగా సాగు చేస్తున్నారు.- శ్రీవాణి, హార్టికల్చర్ ఆధికారి, ఎమ్మిగనూరు