Share News

ఉల్లి క్వింటా రూ.3,299

ABN , Publish Date - Aug 17 , 2026 | 11:10 PM

ఉల్లి రైతుల పంట పండింది. గత సంవత్సరం ఇదే సమయంలో క్వింటా ఉల్లికి కనీసం రూ.500 ధర కూడా లభించలేదు.

ఉల్లి క్వింటా రూ.3,299
కర్నూలు మార్కెట్‌ యార్డుకు అమ్మకానికి వచ్చిన ఉల్లి

కర్నూలు మార్కెట్‌యార్డులో మంచి ధర

ఆనందంలో అన్నదాతలు

కర్నూలు అగ్రికల్చర్‌, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): ఉల్లి రైతుల పంట పండింది. గత సంవత్సరం ఇదే సమయంలో క్వింటా ఉల్లికి కనీసం రూ.500 ధర కూడా లభించలేదు. ఈసారి మాత్రం ఉల్లి బంగారమై పోయింది. సోమవారం క్వింటం ఉల్లికి గరిష్ఠ ధర రూ.3,299 మధ్యస్థం రూ.3,085, కనిష్ఠ ధర రూ.1,359 ధర రైతులకు లభించిందని సెలక్షన్‌ గ్రేడ్‌ సెక్రటరీ జయలక్ష్మి తెలిపారు. ఈ ధర మరింత పెరిగే అవకాశం ఉందని ఆమె స్పష్టం చేశారు. కర్నూలు జిల్లాలోని గోనెగండ్ల, కోడుమూరు, ఎమ్మిగనూరు, పత్తికొండ తదితర ప్రాంతాల నుంచి సోమవారం 349 క్వింటాళ్ల ఉల్లిని రైతులు అమ్మకానికి తీసుకువచ్చారు. గతంలో 2019లో క్వింటం ఉల్లికి రూ.10వేల ధర పలికింది. ఈసారి కూడా ఆస్థాయి ధర పునరావృతం అవుతుందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నారు. గత ఏడాది దాదాపు 19వేల హెక్టార్లకు పైగా ఉల్లిని రైతులు సాగు చేశారు. భారీ వర్షాల కారణంగా ఉల్లి పంట పూర్తిగా దెబ్బతింది. దిగుబడి కూడా నామమాత్రంగానే రైతులకు అందింది. అయితే..ధర మాత్రం పూర్తిగా పతనమైంది. ప్రభుత్వం ఆదుకోవడంతో రైతులు కొంత వరకు నష్టం నుంచి బయటపడ్డారు. గత ఏడాది పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రస్తుత ఖరీఫ్‌లో రైతులు ఉల్లి పంట సాగును పూర్తిగా తగ్గించేశారు. సాధారణ సాగు విస్తీర్ణం 19,500 హెక్టార్లు కాగా, ఇప్పటికీ కేవలం 3,500 హెక్టార్లలోనే ఉల్లి పంటను రైతులు సాగు చేశారు. పక్వానికి వచ్చిన ఉల్లిని కర్నూలు మార్కెట్‌యార్డుకు రైతులు తీసుకువస్తున్నారు. మరోవైపు మహారాష్ట్రలో ఇప్పటిదాకా గోదాముల్లో నిల్వ చేసిన ఉల్లి అంతా బయట ప్రాంతాలకు తరలించారు. దీంతో అక్కడ ఉల్లి నిల్వలు లేకపోవడం ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉల్లి సాగు తగ్గిపోవడంతో ఉల్లి ధరలకు రెక్కలు వచ్చాయి. కర్నూలు జిల్లా అవసరాలతో పాటు పక్క జిల్లాలకు పంపేందుకు కూడా తగినంత నిల్వలు లేకపోవడంతో ఒక్కసారిగా వినియోగదారుల నుంచి డిమాండ్‌ ఎక్కువైంది. రిటైల్‌గా కిలో ఉల్లిని రూ.45కు విక్రయిస్తున్నారు. ఈ ధర మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

Updated Date - Aug 17 , 2026 | 11:10 PM