Share News

ఓట్ల లెక్కింపుపై అవగాహన ఉండాలి

ABN , Publish Date - Oct 26 , 2026 | 11:32 PM

కర్నూలు నగర పాలక సంస్థ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పూర్తి అవగాహనతో చేపట్టాలని అడిషనల్‌ ఎలక్షన్‌ అథారిటీ, కమిషనర్‌ చల్లా ఓబులేసు సూచించారు.

ఓట్ల లెక్కింపుపై అవగాహన ఉండాలి
అవగాహన కల్పిస్తున్న అడిషనల్‌ ఎలక్షన్‌ అథారిటీ, కమిషనర్‌

అడిషనల్‌ ఎలక్షన్‌ అథారిటీ, కమిషనర్‌ చల్లా ఓబులేసు

కర్నూలు న్యూసిటీ, అక్టోబరు 26(ఆంధ్రజ్యోతి): కర్నూలు నగర పాలక సంస్థ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పూర్తి అవగాహనతో చేపట్టాలని అడిషనల్‌ ఎలక్షన్‌ అథారిటీ, కమిషనర్‌ చల్లా ఓబులేసు సూచించారు. సోమవారం నగరంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఓట్ల లెక్కింపు విధులు నిర్వహించే సూపర్‌వైజర్లు, సహాయకులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఓట్ల లెక్కింపు విధానంపై ప్రాయోగిక ప్రదర్శనతో అవగాహన, బ్యాలెట్‌ పత్రాల విభజన, ఓట్ల లెక్కింపు సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సిబ్బంది విధులపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ నగర పాలక సంస్థ ఓట్ల లెక్కింపు కోసం రెండు అంతస్తుల్లో మొత్తం 145 కౌంటింగ్‌ టేబుళ్లను ఏర్పాటు చేశామన్నారు. వీటిలో కార్పొరేటర్‌ అభ్యర్థుల ఓట్ల లెక్కింపు కోసం 72 టేబుళ్లు, మేయర్‌ అభ్యర్థి ఓట్ల లెక్కింపు కోసం 73 టేబుళ్లు కేటాయించామన్నారు. ప్రతి కౌంటింగ్‌కు ఒక సూపర్‌వైజర్‌తో పాటు నలుగురు సహాయకులను నియమించామన్నారు. అదనంగా 10 శాతం సిబ్బందిని రిజర్వులో ఉంచినట్లు ఆయన పేర్కొన్నారు. మొత్తం 820 మంది సిబ్బందికి ఓట్ల లెక్కింపు ప్రక్రియపై శిక్షణ ఇచ్చామన్నారు. బ్యాలెట్‌ పత్రాల్లో మేయర్‌ అభ్యర్థులకు సంబంధించిన పింక్‌ రంగులో, కార్పొరేటర్‌ అభ్యర్థులకు సంబంధించినవి తెలుగు రంగులో ఉంటాయని అన్నారు. బ్యాలెట్‌ పత్రాలు కలిపి ఉంటాయని, తొలుత వాటిని మేయర్‌, కార్పొరేటర్‌ అభ్యర్థుల పత్రాలను వేర్వేరుగా విభజించాల్సి ఉంటుందన్నారు. అనంతరం బ్యాలెట్‌ పత్రాలను 25 పత్రాల చొప్పున కట్టలుగా కట్టి, ప్రతి రౌండ్‌లో 1000 బ్యాలెట్‌ పత్రాలను లెక్కించే విధానంపై సిబ్బందికి అవగాహన ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో మేనేజర్‌ జునైద్‌, కార్యదర్శి నాగరాజు, సూపరింటెండెంట్‌ ఇజ్రాయేలు, రామక్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 26 , 2026 | 11:32 PM