Share News

ఒక లోక్‌ సభ.. ఏడు అసెంబ్లీ స్థానాలు..!

ABN , Publish Date - Mar 25 , 2026 | 12:01 AM

ఒక లోక్‌ సభ.. ఏడు అసెంబ్లీ స్థానాలు..!

ఒక లోక్‌ సభ..  ఏడు అసెంబ్లీ స్థానాలు..!

పునర్విభజనతో ఉమ్మడి జిల్లాలో పెరగనున్న నియోజకవర్గాలు

కొత్తగా ఆదోని లోక్‌సభకు అవకాశం?

తాజా నిర్ణయాలతో మారనున్న నియోజకవర్గాల స్వరూపం

కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌తో సర్వత్రా ఇదే చర్చ

కర్నూలు, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలను 50 శాతం పెంచాలని ప్రధాని మోదీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పార్లమెంట్‌ సమావేశాల్లోనే ఈ బిల్లును ప్రవేశ పెట్టేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న నియోజకవర్గాల్లో యాభై శాతం పెరిగితే.. ఉమ్మడి కర్నూలు, నంద్యాల జిల్లాలో ఒక లోక్‌సభ, ఏడు అసెంబ్లీ స్థానాలు కొత్తగా ఏర్పడే అవకాశం ఉంది. ఆదోని కేంద్రంగా కొత్తగా లోక్‌సభ నియోజకవర్గం ఏర్పాటుకు అవకాశాలు ఉన్నాయి. కొత్తగా ఏర్పాటు కాబోతున్న ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఏవీ..? ఏ నియోజకవర్గం ఏ మండలం పరిధిలోకి వస్తుంది..? ప్రస్తుతం ఏ ఇద్దరు కలసినా ఇదే హాట్‌ టాపిక్‌. అదే క్రమంలో అసెంబ్లీలో అడుగు పెట్టాలనుకునే ఆశావహుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. 1952 నుంచి నాలుగు పర్యాయాలు జరిగిన నియోజకవర్గాల పునర్విభజన వల్ల రాజకీయంగా ఎంతో ఘన చరిత్ర సొంతం చేసుకున్న ఉమ్మడి కర్నూలు జిల్లా స్వరూపం మారుతూ వచ్చింది.

ఉమ్మడి కర్నూలు జిల్లాలో 2008 నియోజకవర్గాల పునర్విభజన తరువాత కర్నూలు, నంద్యాల లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. కర్నూలు పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలో కర్నూలు, కోడుమూరు (ఎస్సీ), ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆదోని, ఆలూరు, పత్తికొండ, నంద్యాల పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలో నంద్యాల, ఆళ్లగడ్డ, శ్రీశైలం, నందికొట్కూరు (ఎస్సీ), పాణ్యం, బనగానపల్లె, డోన్‌ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఆయా నియోజకవర్గాలకు 2009, 2014, 2019, 2024 నాలుగు పర్యాయాలు ఎన్నికలు జరిగాయి. 2024 మే 13న జరిగిన సార్వత్రిక ఎన్నికల ఓటర్ల జాబితా ప్రకారం ఒక్కో అసెంబ్లీ నియోజకర్గంలో కనిష్ఠంగా 2.04 లక్షలు, గరిష్ఠంగా 3.31 లక్షల ఓటర్లు ఉన్నారు. సగటున రెండు లక్షల ఓటర్లకు ఒకరు అసెంబ్లీలో ప్రాతినిథ్యం వహించేలా నియోకవర్గాలు పునర్విభజన జరిగే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఉమ్మడి జిల్లాలో కొత్తగా ఒక లోక్‌సభతో పాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు కొత్తగా ఏర్పడే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

భారత రాజ్యంగం అమలులోకి వచ్చిన తరువాత ఇప్పటి వరకు 1952, 1963, 1973, 2008లో నాలుగు పర్యాయాలు లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన చేశారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో కూడా నియోజకవర్గాలు సరిహద్దులు మారాయి. పలు అసెంబ్లీ నియోజకవర్గాలు కనుమరుగైతే.. కొత్తగా పలు నియోజకవర్గాలు ఏర్పాటయ్యాయి. ఒకనాటి నియోజకవర్గ కేంద్రాలు ప్రస్తుతం మండల కేంద్రంగా సరిపుచ్చుకోవాల్సి వచ్చింది.

1952 వరకు ఉమ్మడి కర్నూలు జిల్లా మద్రాస్‌ రాష్ట్రంలో ఉండేది. ఆ సమయంలో జరిగిన ఉమ్మడి జిల్లాలో కర్నూలు, నంద్యాల లోక్‌సభ స్థానాలు, కర్నూలు, నంద్యాల, ఆదోని, పత్తికొండ, నందికొట్కూరు, ఆలూరు, ప్యాపిలి, కోసిగి, శిరివెళ్ల, కోవెలకుంట్ల, మార్కాపురం, కంభం నియోజకవర్గాలు ఉండేవి. భాషా సంయుక్త రాష్ట్రాలు ఏర్పాటు తరువాత 1955లో కోసిగి, శిరివెళ్ల, ప్యాపిలి నియోజకవర్గాలు కనుమరుగయ్యాయి. కొత్తగా ఎమ్మిగనూరు, డోన్‌ నియోజకవర్గాలు ఏర్పాటు చేశారు.

1962కు ముందు వరకు ఉమ్మడి జిల్లాలో కర్నూలు, నంద్యాల, ఆదోని, డోన్‌, నందికొట్కూరు, పత్తికొండ, ఆలూరు, ఎమ్మిగనూరు, కోడుమూరు, కోవెలకుంట్ల, ఆళ్లగడ్డ, పాణ్యం, గిద్దలూరు, మార్కాపురం, యర్రగొండపాలెం నియోజకవర్గాలు ఉన్నాయి. కొత్తగా కోడుమూడు, పాణ్యం నియోజకవర్గాలు ఏర్పాటయ్యాయి.

1973 వరకు ఉమ్మడి జిల్లాలో కర్నూలు, కోడుమూరు, ఎమ్మిగనూరు, ఆదోని, ఆలూరు, నందికొట్కూరు, పత్తికొండ, నంద్యాల, బనగానపల్లె, డోన్‌, ఆళ్లగడ్డ, ఆత్మకూరు, పాణ్యం ఉన్నాయి. పునర్విభజన తరువాత మార్కా పురం, గిద్దలూరు ప్రకాశం జిల్లాలో కలిపారు. తదనంతరం ఆత్మకూరు ఆవిర్భవించింది.

2008లో జరిగిన పునర్విభజన తరువాత కర్నూలు లోక్‌సభ నియోజకవర్గంలో కర్నూలు, కోడుమూరు, ఎమ్మిగనూరు, ఆలూరు, ఆదోని, మంత్రాలయం, పత్తికొండ నియోజకవర్గాలు ఉంచారు. కొత్తగా మంత్రాలయం నియోజకవర్గం ఏర్పడింది. నంద్యాల జిల్లాలో నంద్యాల, ఆళ్లగడ్డ, శ్రీశైలం, నందికొట్కూరు, పాణ్యం, బనగానపల్లె, డోన్‌ నియోజకవర్గాలు ఉన్నాయి. ఆత్మకూరు స్థానంలో శ్రీశైలం నియోజకవర్గం కేంద్రంగా చేశారు. కోవెలకుంట్ల సెగ్మెంట్‌ను రద్దు చేసి బనగానపల్లె నియోజకవర్గం చేశారు.

కర్నూలు జిల్లాలో...

కర్నూలు-2: కర్నూలు నగరపాలక సంస్థ పరిధిలో 52 వార్డులు ఉన్నాయి. 32 వార్డులతో కర్నూలు అసెంబ్లీ సెగ్మెంట్‌ ఉంది. పునర్విభజన జరిగితే కర్నూలు నగరంలోని 52 వార్డులను విభజించి 26 వార్డులు చొప్పున కర్నూలు-1, కర్నూలు-2 నియోజకవర్గాలు విభజించే అవకాశం ఉంది.

కర్నూలు రూరల్‌/కల్లూరు: కర్నూలు రూరల్‌, కల్లూరు, ఓర్వకల్లు, వెల్దుర్తి మండలాలు కలిపి కర్నూలు రూరల్‌ లేదా కల్లూరు అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

దేవనకొండ/ఆదోని రూరల్‌: దేవనకొండ, ఆస్పరి, కృష్ణగిరి, గోనేగండ్ల మండలాలతో దేవనకొండ అసెంబ్లీ నియోజకవర్గం లేదా ఆదోని నియోజకవర్గాన్ని ఆదోని అర్బన్‌ నియోజకవర్గంగా మార్చి కొత్త ఆదోని-1,2, కౌతాళం, హోళగుంద మండలాలతో ఆదోని రూరల్‌ నియోజకవర్గం ఏర్పాటు చేసే అవకాశాలు లేకపోలేదు. లేదంటే ఈ రెండు నియోజకవర్గాలు ఏర్పాటుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

నంద్యాల జిల్లాలో...

నంద్యాల రూరల్‌: నంద్యాలను అర్బన్‌ నియోజకవర్గం ఉంచేసి, నంద్యాల రూరల్‌, గోస్పాడు, మహనంది మండలాలతో నంద్యాల రూరల్‌ అసెంబ్లీ సెగ్మెంట్‌ కొత్తగా ఏర్పాటు చేసే అవకాశాలు లేకపోలేదు.

పాణ్యం: పాణ్యం, గడివేముల, బండిఆత్మకూరు మండలాలు సహా సమీపంలోని ఒక మండలం కలిపి పాణ్యం నియోజకవర్గం ఏర్పడే అవకాశం ఉంది.

కోవెలకుంట్ల: ఒకనాటి కోవెలకుంట్ల నియోజకవర్గం మళ్లీ తెరపైకి వచ్చే అవకాశం ఉంది. కోవెలకుంట్ల, కొలిమిగుండ్ల, సంజామల, దొర్నిపాడు, ఉయ్యాలవాడ మండలాలతో కోవెలకుంట్ల నియోజకవర్గం ఏర్పడే అవకాశం ఉంది.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే నివేదికలనే పరిగణలోకి తీసుకోవాల్సి రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. రాజకీయ విశ్లేషకులు, మేధావులు అంచనా వేస్తున్న ప్రకారం ప్రస్తుత నియోజకవర్గాల్లో మిగిలే మండలాలు ఇలా ఉండే అవకాశం ఉంది.

కర్నూలు: కర్నూలు నగరపాలక సంస్థలోని 26 డివిజన్లు (వార్డులు)

కోడుమూరు (ఎస్సీ): కోడుమూరు, సి.బెళగల్‌, గూడూరు

ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు అర్బన్‌, రూరల్‌, నందవరం

మంత్రాలయం: మంత్రాలయం, కోసిగి, పెద్దకడుబూరు, (నందవరం చేర్చే అవకాశాలు ఉన్నాయి). మంత్రాలయం నియోజకవర్గం పేరును కోసిగి నియోజకవర్గంగా మార్చే అవకాశాలు కూడా ఉన్నాయని విశ్లేషిస్తున్నారు.

ఆదోని: ఆదోని అర్బన్‌ మాత్రమే ఒక నియోజకవర్గంగా ఉంచే అవకాశాలు ఉన్నాయి.

ఆలూరు: ఆలూరు, హాలహర్వి, చిప్పగిరి, ఆస్పరి (ఆస్పరి మండలంను కొత్తగా ఏర్పాటు చేసే నియోజకవర్గంలో కలిపితే మూడు మండలాలే ఉంటాయి).

పత్తికొండ: పత్తికొండ, తుగ్గలి, మద్దికెర (దేవనకొండ నియోజకవర్గంగా ఏర్పటు చేయకపోతే ఆ మండలం పత్తికొండలో కలిపే అవకాశం ఉంది)

పాణ్యం: పాణ్యం, గడివేముల మండలాలుతో పాటు కొత్తగా బండిఆత్మకూరు మండలం చేర్చే అవకాశం ఉంది.

డోన్‌: డోన్‌ అర్బన్‌, రూరల్‌, ప్యాపిలి మండలాలతో పాటు కృష్ణగిరి లేదా వెల్దుర్తి మండలాలు కలిపే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

నంద్యాల: నంద్యాల అర్బన్‌ వార్డులతో ఒక నియోజకవర్గంగా ఉంచాని విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు.

శ్రీశైలం: ఆత్మకూరు, వెలుగోడుతో పాటు 2009కి ముందు వరకు ఉన్న పాములపాడు, కొత్తపల్లి మండలాలు కలిపే అవకాశాలు ఉన్నాయి. శ్రీశైలం పేరును మార్పు చేసి ఆత్మకూరు నియోజకవర్గంగా మార్చే అవకాశాలు లేకపోలేదు.

బనగానపల్లె: బనగానపల్లె, అవుకుతో పాటుగా కొత్తగా బేతంచర్ల, ప్యాపిలి మండలాలు చేర్చేలా కసరత్తు చేస్తున్నారు. రాజకీయ కోణంలో పరిశీలిస్తే, అవుకు మండలం కూడా తీసే గోస్పాడు మండలం చేర్చే అవకాశాలు ఉన్నాయి.

ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డ, రుద్రవరం, చాగలమర్రి, సిరువెళ్ల మండలాలతో నియోజకవర్గం ఉంటుంది.

నందికొట్కూరు(ఎస్సీ): నందికొట్కూరు, జూపాడుబంగ్లా, పగిడ్యాల, మిడుతూరు మండలాలతో ఈ నియోజకవర్గం ఉంచే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.

Updated Date - Mar 25 , 2026 | 12:01 AM