అయ్యో పాపం..!
ABN , Publish Date - Nov 24 , 2026 | 11:44 PM
నిండు జీవితం ఐదేళ్లకే బుగ్గిపాలైంది. కోటి ఆశలతో పెంచుకున్న కన్నబిడ్డ కళ్ల ఎదుటే మంటల్లో మసైపోతుంటే చూడలేక ఆ తల్లి తల్లడిల్లిపోయింది. జీవితమంటేనే ఎరుగని ఓ బాలుడు అగ్ని ప్రమాదానికి గురై మంటల్లో సజీవదహనమైన విషాద సంఘటన మంగళవారం కొత్తపల్లి మండలంలోని బలపాలతిప్ప గ్రామంలో చోటు చేసుకుంది.
సోలార్ బ్యాటరీకి షార్ట్ సర్క్యూట్
ఎగసిపడిన మంటలు, గుడిసెకు నిప్పు
మంటల్లో ఐదేళ్ల బాలుడు సజీవ దహనం
బలపాలతిప్ప గ్రామంలో విషాదం
కొత్తపల్లి, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): నిండు జీవితం ఐదేళ్లకే బుగ్గిపాలైంది. కోటి ఆశలతో పెంచుకున్న కన్నబిడ్డ కళ్ల ఎదుటే మంటల్లో మసైపోతుంటే చూడలేక ఆ తల్లి తల్లడిల్లిపోయింది. జీవితమంటేనే ఎరుగని ఓ బాలుడు అగ్ని ప్రమాదానికి గురై మంటల్లో సజీవదహనమైన విషాద సంఘటన మంగళవారం కొత్తపల్లి మండలంలోని బలపాలతిప్ప గ్రామంలో చోటు చేసుకుంది. సోలార్ బ్యాటరీలకు షార్ట్ సర్క్యూట్ కావడం వల్ల ఓ బాలుడు మంటల్లో చిక్కుకుని సజీవ దహనం అయ్యాడు. బలపాలతిప్ప గ్రామానికి చెందిన కాట్రాజ్ ఈరన్న, నిమ్మల భారతి తమ ఇద్దరు కుమారులతో కలసి ఓ గుడిసెలో ఉంటున్నారు. సెల్‌ఫోన్ చార్జింగ్ కోసం సోలార్ ప్యానెల్‌కు అనుసంధానం చేసిన విద్యుత్ వైర్లకు షార్ట్ సర్క్యూట్ కావడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. గుడిసెలో నిద్రిస్తున్న తరుణ్‌చరణ్ అనే ఐదేళ్ల బాలుడు అగ్నికి ఆహుతయ్యాడు. ఘటన జరిగిన సమయంలో తండ్రి ఈరన్న కూలి పనులకు వెళ్లగా.. తల్లి భారతి దుస్తులు ఉతికేందుకు ఇంటికి సమీపంలో వెళ్లింది. మంటల వ్యాప్తిని గమనించిన తల్లి బోరున విలపిస్తూ గుడిసె వద్దకు చేరుకోగానే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కళ్ల ఎదుటే కుమారుడు మంటల్లో విలవిల్లాడుతూ ఆహుతవుతుంటే చూసి తట్టుకోలేకపోయిన తల్లి రోదనలు అందర్నీ కలచివేశాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటనాస్థలాన్ని కొత్తపల్లి తహసీల్దార్ ఉమారాణి సందర్శించి బాలుడి మృతదేహాన్ని చూసి చలించిపోయారు. కంటతడి పెడుతూనే తల్లిదండ్రులను ఓదార్చారు. కుటుంబానికి రూ.5వేలు ఆర్థిక సాయం అందించారు. ఎర్రమఠం గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు చంద్రమౌళీశ్వరరెడ్డి రూ.5వేల ఆర్థిక సాయం చేశారు.