రుద్రవరం కస్తూర్బా విద్యాలయాన్ని సందర్శించిన వైద్య బృందం
ABN , Publish Date - Jul 07 , 2026 | 12:21 AM
మండలంలోని కస్తూర్బాగాంధీ గురుకుల పాఠశాలను జిల్లా వైద్య, విద్య, ఆర్‌డబ్ల్యూఎస్, ఇతర అధికారులు సోమవారం సందర్శించారు. కస్తూర్బాలో ఇటీవల పదోతరగతి పరీక్షలు రాసిన జ్యోతి అనే విద్యార్ధినికి ఇలియాన్ బారీస్ సిండ్రోమ్ అనే అరుదైన వ్యాధి సోకినట్లు గుర్తించారు. ఈ వ్యాధి శరీరం అంతటికీ వ్యాపిస్తుంది.
విద్యార్థినికి అరుదైన వ్యాధి
అప్రమత్తమైన డీఎంహెచ్‌వో, డీఈవో
రుద్రవరం, జూలై 6 (ఆంధ్రజ్యోతి): మండలంలోని కస్తూర్బాగాంధీ గురుకుల పాఠశాలను జిల్లా వైద్య, విద్య, ఆర్‌డబ్ల్యూఎస్, ఇతర అధికారులు సోమవారం సందర్శించారు. కస్తూర్బాలో ఇటీవల పదోతరగతి పరీక్షలు రాసిన జ్యోతి అనే విద్యార్ధినికి ఇలియాన్ బారీస్ సిండ్రోమ్ అనే అరుదైన వ్యాధి సోకినట్లు గుర్తించారు. ఈ వ్యాధి శరీరం అంతటికీ వ్యాపిస్తుంది. కానీ ఈ విద్యార్ధిని గొంతుకు మాత్రమే సోకింది. అందువల్ల మాటలు మాట్లాడలేకపోతోందని నిర్ధారించారు. సాధారణంగా ఈ వ్యాధి కోటిమందిలో ఒకరి సోకుతుందన్నారు. 2026 మార్చిలో 10వతరగతి రెండు పరీక్షలు మాత్రమే ఈ విద్యార్థిని రాసినట్లు కస్తూర్బా సిబ్బంది తెలిపారు. ఈ క్రమంలో గురుకుల విద్యాలయం ఏఎన్‌ఎంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో జిల్లా అధికారుల బృందం విద్యాలయాన్ని సందర్శించింది. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ ఈ వ్యాధి గాలిలో వచ్చే బ్యాక్టీరియా వల్ల వస్తుందన్నారు. తాగునీరు, భోజనం వంటి వాటిలో రాదన్నారు. శరీరంలో వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోవడంతో ఇలా అవుతుందన్నారు. పిల్లలు ఇంటికి వెళ్లి వచ్చాక ఆరోగ్యంపై ఆరా తీయాలని పాఠశాల ప్రిన్సిపాల్‌ను అధికారులు ప్రశ్నించారు. డీఈవో జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ విద్యార్థినుల ఆరోగ్యం గురించి అప్రమత్తంగా ఉండాలన్నారు. మరో ఇద్దరు పదో తరగతి విద్యార్థినుల ఆరోగ్యంపై కూడా వాకబు చేశారు. ఆర్‌డబ్ల్యూఎస్ డీఈ జోసెఫ్ వినోద్‌కుమార్ మాట్లాడుతూ గురుకుల విద్యాలయంలో ఒక చేతిపంపు, మరో సింగిల్ ఫేజ్ మోటరు ఉందన్నారు. ఇటీవల నాలుగురోజుల క్రితం నీటి పరీక్ష చేయించగా సేఫ్ అని వచ్చిందన్నారు. వీరి వెంట ఎంపీడీవో భాగ్యలక్ష్మి, ఎంఈవో వెంకటస్వామిరెడ్డి, ఎంఈవో-2 లక్ష్మి, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ సుబ్రహ్మణ్యం ఉన్నారు.
ఇదిలా ఉండగా అరుదైన వ్యాధి సోకిన విద్యార్థిని తండ్రి జంబులయ్య మాట్లాడుతూ.. తన కుమార్తె మాట్లాడలేకపోతోందని ఆవేదన వ్యక్తం చేశాడు. హైదరాబాదు, కర్నూలు, నంద్యాల ఆసుపత్రులకు తరలించి వైద్యం చేయించామన్నారు. ఇప్పటివరకు సుమారుగా రూ.11 లక్షలపైగా ఖర్చు చేశామన్నారు. ప్రస్తుతం ఇంట్లో మంచానికే పరిమితమైందని కన్నీటిపర్యంతమయ్యాడు.