అధికారుల ఆలోచనా విధానం మారాలి
ABN , Publish Date - Jun 09 , 2026 | 12:27 AM
రాష్ర్టాన్ని అభివృద్ధి వైపు పరుగులు పెట్టిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆశయాలకు అనుగుణంగా అధికారుల ఆలోచనా విధానంలో మార్పు రావాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు.
ఆర్టీసీ, మెప్మా, సెర్ఫ్, విద్యుత్, డీపీవో, పౌర సరఫరాలశాఖపై అసంతృప్తి
నంద్యాల అభివృద్ధి సమీక్షా సమావేశంలో ఇన్‌చార్జి మంత్రి పయ్యావుల కేశవ్
నంద్యాల ఎడ్యుకేషన్, జూన్ 8 (ఆంధ్రజ్యోతి): రాష్ర్టాన్ని అభివృద్ధి వైపు పరుగులు పెట్టిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆశయాలకు అనుగుణంగా అధికారుల ఆలోచనా విధానంలో మార్పు రావాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. నంద్యాల పీజీఆర్‌ఎస్ హాల్‌లో సోమవారం కలెక్టర్ రాజకుమారి ఆధ్వర్యంలో ఇన్‌చార్జి మంత్రి పయ్యావుల కేశవ్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో మంత్రులు బీసీ జనార్దన్‌రెడ్డి, ఎన్‌ఎండీ ఫరూఖ్, ఎమ్మెల్యేలు బుడ్డారాజశేఖర్‌రెడ్డి, భూమా అఖిలప్రియ, గౌరుచరితారెడ్డి, గిత్తా జయసూర్య హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లాలో 14,05,443 మంది ఓటర్లు ఉన్నారని కలెక్టర్ వివరించారు. 74.46 శాతం మ్యాపింగ్ జరిగిందని అన్నారు. పౌరసరఫరాల శాఖలో సంతృప్త స్థాయి 80శాతంగా ఉండడంపై మంత్రి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీలో ప్రజలకు 41శాతం మాత్రమే సంతృప్తిగా ఉన్నారని, మిగిలిన 60శాతం అసంతృప్తిపై ఏం సమాధానం చెబుతారని అధికారులను ప్రశ్నించారు. సివిల్ వర్క్ చేయలేదని, టాయిలెట్స్, శానిటేషన్ అధ్వానంగా ఉన్నాయని, మూడు నెలల్లో సరిచేయాలని హెచ్చరించారు. జిల్లా పంచాయతీ రాజ్ శాఖలో స్ట్రీట్ లైట్స్ సమస్య అధికంగా ఉందని అన్నారు. ఖరీ్‌ఫలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచాలని అన్నారు. 31వేల మెట్రిక్ టన్నుల జొన్నను ప్రభుత్వం మద్దతు ధరతో కొనుగోలు చేసిందని అన్నారు. మరో 12వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు గురించి ఉన్నతాధికారులతో సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి అన్నారు. గ్రామాలకు ఇచ్చే త్రీఫేజ్ కరెంట్ లైన్‌లను వేయడంపై అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్‌డీఎ్‌సఎస్ పథకానికి వేలకోట్ల రూపాయలు ఖర్చుపెడుతున్నామని, కాంట్రాక్టర్‌లతో పనిచేయించలేకుంటే ఎందుకంటూ అధికారులను నిలదీశారు. పనుల పురోగతి పెంచాలని, లేకుంటే చర్యలు తప్పవన్నారు. పెండింగ్‌లో ఉన్న 2347 వ్యవసాయ కనెక్షన్‌లను పరిశీలించి తగు నిర్ణయం తీసుకోవాలన్నారు. ఆత్మకూరు నుంచి శ్రీశైలం వరకు 3.7 మీటర్లు ఉన్న రహదారిని ఏడు మీటర్లకు పెంచేందుకు ఎందుకు అటవీశాఖ అడ్డుపడుతోందని అధికారులను ప్రశ్నించారు. జిల్లాలో 18 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌లు పనిచేయకపోవడంపై మంత్రి ఆరాతీశారు. దీనిపై సమగ్ర నివేదిక తమకు సమర్పించాలని ఆదేశించారు. జిల్లాలో 127 మల్టీ పర్పస్ గోదాములు నిర్మించారని, అందులో 26 మాత్రమే అందుబాటులోకి రావడం పట్ల విచారం వ్యక్తం చేశారు.
ఆలస్యంగా వచ్చిన అధికారులకు షోకాజ్ నోటీసులు
సమావేశానికి ఆలస్యంగా వచ్చిన మెప్మా, సెర్ఫ్ అధికారులకు షోకాజ్ నోటీసులు జారీచేయాలని మంత్రి పయ్యావుల కేశవ్ కలెక్టర్‌ను ఆదేశించారు. డోన్ మున్సిపల్ కమిషనర్ తన వాహనం టైర్ పంక్చర్ అయ్యిందని సమాధానం చెప్పడంతో మరింత అసంతృప్తి వ్యక్తం చేశారు.