వెంటాడి..వేటాడి..!
ABN , Publish Date - Jan 06 , 2026 | 01:19 AM
పాతకక్షలు మరోసారి భగ్గుమన్నాయి. కత్తులు లేచాయి.. ప్రత్యర్థులు పెట్రేగిపోయారు. రెండేళ్ల క్రితం జరిగిన హత్యలకు ప్రతీకారంగా పక్కా ప్రణాళికతో వెంటాడి నరికి చంపారు. వరుసగా ముగ్గురు అన్నదమ్ములపై దాడులకు తెగపడ్డారు.
కందనాతిలో భగ్గుమన్న పాతకక్షలు
ప్రత్యర్థుల దాడిలో అన్నదమ్ముల దారుణహత్య..
ఇద్దరికి తీవ్ర గాయాలు, ఐదేళ్ల బాలుడికి గాయాలు
రెండేళ్లనాటి జంటహత్యలకు ప్రతీకర దాడి
ఘటనా స్థలాలను పరిశీలించిన ఎస్పీ విక్రాంత్‌పాటిల్
ఎమ్మిగనూరు/ఎమ్మిగనూరు రూరల్, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): పాతకక్షలు మరోసారి భగ్గుమన్నాయి. కత్తులు లేచాయి.. ప్రత్యర్థులు పెట్రేగిపోయారు. రెండేళ్ల క్రితం జరిగిన హత్యలకు ప్రతీకారంగా పక్కా ప్రణాళికతో వెంటాడి నరికి చంపారు. వరుసగా ముగ్గురు అన్నదమ్ములపై దాడులకు తెగపడ్డారు. ఇద్దరు అన్నదమ్ములు ప్రత్యర్థుల చేతిలో దారుణ హత్యకు గురికాగా, ఒకరు మాత్రం తీవ్రమైన గాయాలతో ప్రాణాపాయ స్థితిలో బయటపడ్డారు. ఈ దాడుల్లో ఇద్దరు మహిళలు, ఐదేళ్ల బాలుడు గాయపడ్డారు. ఎమ్మిగనూరు మండలం కందనాతిలో సోమవారం అన్నదమ్ములు బోయ పరమేష్(35), బోయ వెంకటేష్ (55), ప్రత్యర్థుల దాడిలో హత్యకుగురికాగా, బోయ గోవిందు (36) తీవ్రగాయాలతో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతూ బయటపడ్డాడు. ఈ ఘటనతో గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఎప్పుడు ఎలాంటి చేదునిజం వినాల్సి వస్తుందోనని గ్రామస్థులు బిక్కుబిక్కుమంటూ ఇళ్లదగ్గరే ఉండిపోయారు. పలువురు ఊరొదిలి పారిపోయారు.
స్థానికులు, బాధితుల కథనం మేరకు... ఎమ్మిగనూరు మండలం కందనాతి గ్రామంలో పడగవిప్పిన పాతకక్షలకు ఇద్దరు అన్నదమ్ములు దారుణంగా హత్యకు గురయ్యారు. పోలీసు పికెట్ ఉన్నా ఈ హత్యాకాండ సాగడం కొసమెరుపు. పక్కాప్రణాళికతో దాడులకు పాల్పడి ప్రత్యర్థులను మట్టుపెట్టారు. మధ్యాహ్నం 11గంటల తర్వాత ఎవరి పనుల్లో వారు నిమగ్నమై ఉన్నారు. గ్రామమంతా పనుల్లో బిజీగా ఉండగా.. మరికొందరు ఎమ్మిగనూరులో జరిగే నీలకంఠేశ్వరస్వామి జాతరకు వెళ్లేందుకు సన్నద్ధం అవుతున్నారు. ఈ సమయంలో ఊహించని ఘోర ఘటన జరిగిపోయింది. రెండేళ్ల క్రితం అనుకోని ఘటనలో జరిగిన జంటహత్యలకు ప్రతీకారంగా ప్రత్యర్థులు ఒకరితర్వాత ఒకరిని ఇద్దరిని మట్టుబెట్టారు. మరొకరు తీవ్రంగా గాయపడి ప్రాణాలతో బయటపడ్డారు. దాదాపు 12 గంటల సమయంలో బోయ గోవిందు(36) భార్య వీరేషమ్మ, ఐదేళ్ల కుమారుడు లోకేంద్రతో కలిసి ట్రాక్టర్‌పై పొలం నుంచి ఇంటికి వస్తున్నారు. సచివాలయం సమీపానికి రాగా.. అప్పటికే మాటు వేసిన ప్రత్యర్థులు బిక్కి దుబ్బ నరసింహులు, బిక్కి లక్ష్మయ్య, బిక్కి వెంకటేష్ మరికొందరు తమ ట్రాక్టర్‌కు మరొక ట్రాక్టర్‌ను అడ్డుపెట్టి గడ్డపారతో గోవిందుపై దాడిచేసి కడుపులో పొడిచారు. అదే సమయంలో మరొకరు మారణాయుధంతో గోవిందుపై దాడికి దిగగా అడ్డుకోబోయిన తనకు, తన చంకలో ఉన్న ఐదేళ్ల కుమారుడికి గాయాలయ్యాయని ఆమె విలపించారు. ఈ దాడిలో గోవిందు రక్తపు మడుగులో ట్రాక్టర్ స్టీరింగ్‌పైనే వాలిపోయాడు. చనిపోయాడనుకున్నారేమో.. ప్రత్యర్థులు అక ్కడి నుంచి అత్యంత సమీపంలో ఉన్న బోయ పరమేష్(35) ఇంటికి మారుణాయుధాలతో వెళ్లారని గ్రామస్థులు అంటున్నారు. ఇంట్లో ఉన్న పరమే్‌షను విచక్షణకోల్పోయి అత్యంత దారుణంగా నరికేశారు. రక్తపు మడుగుల్లో చిక్కుకున్న పరమేష్(35) అక్కడికక్కడే మృతి చెందాడు. అంతటితో ఆగకుండా గ్రామానికి సమీపంలో తన ఆముదం పొలంలో పంటకు నీళ్లు పెడుతున్న బోయ వెంకటేష్(55) దగ్గరకు చేరుకొని మారుణాయుధాలతో దాడిచేసి హతమార్చారు. పక్కా ప్రణాళికతో హత్యకాండ కొనసాగినట్లు స్పష్టంగా తెలుస్తోంది. హత్యల అనంతరం దాడికి పాల్పడిన నిందితులు గ్రామంవదిలి పారిపోయారు.
నాటి జంటహత్యలకు ప్రతీకారం
కందనాతి గ్రామంలో 2024 ఫిబ్రవరి 21న మారెమ్మవ్వ దేవర మహోత్సవం జరిగింది. ఆ సమయంలో ఒకేవీధిలో ఉన్న బిక్కి నరసింహులు, బోయపెద్ద మహానంది కుటుంబాల మధ్య కుళాయి దగ్గర మంచినీటిని పట్టుకునే విషయంలో మాటమాట పెరిగి చిన్నపాటి ఘర్షణకు దారితీసింది. ఆ ఘర్షణే ఇరువర్గాల్లో ఉద్రేకాన్ని పెంచి దాడులకు కారణమైంది. ఆ దాడుల్లో తీవ్రంగా గాయపడిన బిక్కి నరసింహులు, ఆయన కుమారుడు రవి ఇద్దరిని కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. అప్పటికే కోమాలోకి వెళ్లిన వారిద్దరు చికిత్స పొందుతూ కోలుకోలేక మూడు రోజులకు మృతి చెందారు. ఈ ఘటనలో మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పెద్ద మహానంది కుమారులు బోయ గోవిందు, బోయ వెంకటేష్, బోయ పరమే్‌షలతో పాటు 12మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించగా బెయిల్‌పై బయటకు వచ్చారు. గ్రామంలో శాంతిభద్రతల దృష్ట్యా కొన్నాళ్లు ఆ రెండు కుటుంబాలు, వారి వర్గీయులను గ్రామంలోకి రాకుండ పోలీసులు ఆంక్షలు పెట్టారు. గత ఏడాది దసరా రోజున ఇరువర్గాలు గ్రామంలోకి చేరుకున్నాయి. వీరిమధ్య రాజీ చేసేందుకు గ్రామ పెద్దలు, పోలీసులు తీవ్రంగా ప్రయత్నించినా అది సఫలంకాలేదు. 2024 ఫిబ్రవరిలో జరిగిన జంట హత్యలకు ప్రతీకారంగా నాడు హత్యకు గురైన బిక్కి నరసింహులు వర్గీయులు పక్క ప్రణాళికతో, నాటి జంటహత్యల కేసులో నిందితులుగా ఉన్న బోయ గోవిందు, బోయ వెంకటేష్, బోయ పరమే్‌షలపై దాడులకు తెగపడ్డారు. పరమేష్, వెంకటే్‌షలు మృతి చెందగా గోవిందు గాయపడ్డారు. ఈ దాడులను అడ్డుకోబోయిన గోవిందు భార్య వీరేషమ్మ, ఆమె చంకలో ఉన్న ఐదేళ్ల కుమారుడు లోకేంద్రలు, హతుడు పరమేష్ భార్య జయమ్మలకు గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
పోలీసు పహారాలో కందనాతి
కందనాతిలో జంటహత్యల సంఘటన జరగగానే కర్నూలు ఎస్పీ విక్రాంత్‌పాటిల్, ఎమ్మిగనూరు డీఎస్పీ భార్గవి, తాలుకా సీఐ చిరంజీవి, రూరల్ ఎస్‌ఐ కె.శ్రీనివాసులు, నందవరం ఎస్‌ఐ తిమ్మారెడ్డిలతో పాటు పోలీసు సిబ్బంది ఆ గ్రామానికి చేరుకున్నారు. హత్యలు జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. దాడులకు దారితీసిన పరిస్థితులను బాధితులు, గ్రామస్థులను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో పోలీసు పహారా ఏర్పాటు చేశారు. జంట హత్య, మరొకరిపై జరిగిన దాడి ఘటనపై బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని డీఎస్పీ భార్గవి తెలిపారు.