Share News

రూ.వెయ్యి కోసం యువకుడి హత్య

ABN , Publish Date - Jul 04 , 2026 | 11:36 PM

రూ.1000 అప్పుగా ఇచ్చి తిరిగి ఇవ్వకపోవడంతో కక్ష పెంచుకొని ఓ యువకుడిని దారుణంగా హతమార్చిన ఘటన నాలుగో పట్టణ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాలు.. స్థానిక చింతలముని నగర్‌కు చెందిన కొండపల్లి శ్రీను, మౌలాలి, యువరాజులు స్నేహితులు. కొండపల్లి శ్రీను కొరియర్‌ బాయ్‌గా పనిచేస్తున్నాడు

రూ.వెయ్యి కోసం యువకుడి హత్య
శ్రీను (ఫైల్ )

మృతదేహం మాయం

పోలీసుల అదుపులో నిందితులు

కర్నూలు క్రైం, జూలై 4 (ఆంధ్రజ్యోతి): రూ.1000 అప్పుగా ఇచ్చి తిరిగి ఇవ్వకపోవడంతో కక్ష పెంచుకొని ఓ యువకుడిని దారుణంగా హతమార్చిన ఘటన నాలుగో పట్టణ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాలు.. స్థానిక చింతలముని నగర్‌కు చెందిన కొండపల్లి శ్రీను, మౌలాలి, యువరాజులు స్నేహితులు. కొండపల్లి శ్రీను కొరియర్‌ బాయ్‌గా పనిచేస్తున్నాడు. మౌలాలి, యువరాజు గౌండ పనులు చేస్తంటారు. మౌలాలి ఏడాది క్రితం శ్రీనుకు రూ.1000 అప్పుగా ఇచ్చాడు. దాన్ని వసూలు చేసుకునే క్రమంలో పలుసార్లు శ్రీనును నిలదీయగా దాటవేస్తూ వచ్చాడు. ఈ అప్పు విషయంపై వారి మధ్య వాగ్వాదం తలెత్తింది. ఇది మనసులో పెట్టుకున్న శ్రీను నంద్యాల చెకపోస్టు సమీపంలో మౌలాలిపైన తన స్నేహితులతో కలిసి దాడి చేసి కొట్టాడు. ఆ తర్వాత మరో ఆరు నెలలకు స్టాంటన్‌పురంలో మరోసారి రూ.1000 ఇస్తానని పిలిపించి అక్కడ కూడా కొట్టించాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన మౌలాలి తన స్నేహితుడు యువరాజుతో కలిసి ఎలాగైనా శ్రీనును కొట్టాలని నిశ్చయించుకున్నాడు. ఆ తర్వాత ఇద్దరు కలిసి ఈ ఏడాది మే 13న కల్లూరులోని గోడ ఆంజనేయస్వామి ఆలయం సమీపంలో ఒక కిలోమీటరు దూరంలో శ్రీనును పిలిపించుకుని మద్యం సేవించి మత్తులో ఉండగా.. శ్రీనుపై రాళ్లతో దాడి చేసి హత్య చేశారు. ఆ తర్వాత ఎవరి దారిన వారు వెళ్లిపోయారు.

కేసు ఇలా వెలుగులోకి..

కొండపల్లి శ్రీను తల్లిదండ్రులు కనిపించడం లేదని జూన్‌ 20వ తేదీన పోలీసులకు పిర్యాదు చేశారు. ముందుగా రాతపూర్వకంగా మౌకికంగా, ఆ తర్వాత రెండు రోజులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు శ్రీను కాల్‌ డిటైల్స్‌ను సేకరించారు. శ్రీను అదృశ్యమైన రోజున మౌలాలి, యువరాజుతో మాట్లాడినట్లుగా గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నట్లు విచారించారు. పోలీసుల విచారణలో తామే శ్రీనును హత్య చేసినట్లుగా ఒప్పుకుని హత్య చేసిన ప్రదేశాన్ని చూపించారు. వారికి ఎక్కడా శ్రీను మృతదేహం లభ్యం కాలేదు. పోలీసులు డ్రోన్‌ కెమెరాలతో, డాగ్‌ స్కాడ్‌ల బృందాలతో, పోలీసు బలగాలతో చుట్టుపక్కలా గాలించినా ఎక్కడా మృతదేహం లభ్యం కాలేదు. నిందితులు మాత్రం తాము అక్కడే హత్య చేశామని, మృతదేహాన్ని మాయం చేయలేదని చెబుతున్నారు. పోలీసులకు శ్రీను మృతి మిస్టరీగా మారింది. శుక్రవారం హత్య జరిగిన ప్రదేశానికి కొంత దూరంలో ఓ పుర్రె లభ్యమైంది. ఇది శ్రీనుదే అయి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. డీఎన్‌ఏ టెస్టుకు పంపిస్తే గానీ పూర్తి ఆధారాలు రావని చెబుతున్నారు. మరో పక్క బంధువులు, తల్లిదండ్రులు నిందితులను కఠినంగా శిక్షించాలని, మృతదేహాన్ని త్వరగా వెలికితీయాలని శనివారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు.

Updated Date - Jul 04 , 2026 | 11:36 PM