Share News

కళాకారులకు స్ఫూర్తి ప్రదాత ఎన్టీఆర్‌

ABN , Publish Date - Jan 19 , 2026 | 12:05 AM

సినీ, నాటక కళాకారులకు స్ఫూర్తి ప్రదాతగా దివంగత ఎన్టీఆర్‌ నిలిచిపోతారని పలువురు వక్తలు కొనియాడారు. తెలుగు సినీ దిగ్గజం, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ వర్ధంతి సందర్భంగా జిల్లా రంగస్థల కళాకారుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో రెండు రోజుల పాటూ ఏర్పాటు చేసిన జాతీయ స్థాయి పౌరాణిక, సాంఘిక ఏకపాత్రాభియన పోటీలు ఆదివారం ఘనంగా ఆరంభమయ్యాయి.

కళాకారులకు స్ఫూర్తి ప్రదాత ఎన్టీఆర్‌
పోటీలను ప్రారంభిస్తున్న డాక్టర్‌ కేవీ సుబ్బారెడ్డి

కర్నూలు కల్చరల్‌, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): సినీ, నాటక కళాకారులకు స్ఫూర్తి ప్రదాతగా దివంగత ఎన్టీఆర్‌ నిలిచిపోతారని పలువురు వక్తలు కొనియాడారు. తెలుగు సినీ దిగ్గజం, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ వర్ధంతి సందర్భంగా జిల్లా రంగస్థల కళాకారుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో రెండు రోజుల పాటూ ఏర్పాటు చేసిన జాతీయ స్థాయి పౌరాణిక, సాంఘిక ఏకపాత్రాభియన పోటీలు ఆదివారం ఘనంగా ఆరంభమయ్యాయి. నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో ఏర్పాటుచేసిన ఈపోటీలకు ముఖ్యఅతిథులుగా విద్యావేత్త డాక్టర్‌ కేవీ సుబ్బా రెడ్డి, కళాక్షేత్రం అధ్యక్షుడు కళారత్న పత్తి ఓబులయ్య, బీసీ సంఘం జాతీయ కార్యదర్శి నక్కలమిట్ట శ్రీనివాసులు విచ్చేసి ప్రారంభించారు. తొలుత ఎన్టీఆర్‌ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జ్యోతిప్రజ్వలనతో పోటీలను ప్రారం భించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కేవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ సమాజ సేవలో, విద్యాసేవలో తనవంతు సహకారం జిల్లా ప్రజలకు ఉంటుందన్నారు. కళారత్న పత్తి ఓబులయ్య మాట్లాడుతూ టీజీవీ కళాక్షేత్రం నిరంతరం కళామతల్లి సేవలో పనిచేస్తుందన్నారు. నక్కలమిట్ట శ్రీనివాసులు మాట్లాడుతూ జిల్లా రంగస్థల కళాకారులు ఐక్యతతో ముందుకు పోవాలని సూచించారు. కళారంగానికి తమ సంస్థ నక్కలమిట్ట ఫౌండేషన్‌ ద్వారా సహాయ సహకారాలు అందిస్తామన్నారు. గాడిచర్ల ఫౌండేషన్‌ అధ్యక్షుడు కేసీ కల్కూర మాట్లాడుతూ మాండలిక వ్యవస్థను పరిపాలనలో తీసుకువచ్చిన ఘనత ఎన్టీఆర్‌కే దక్కుతుందని అన్నారు. రంగస్థల కళాకారుల సంఘం అధ్యక్షుడు, టీడీపీ సాంస్కృతిక విభాగం జిల్లా అధ్యక్షుడు పి. హనుమంతరావు చౌదరి మాట్లాడుతూ ఎన్టీఆర్‌ గురించి ఎంత చెప్పినా, ఎంత రాసినా, ఎంత శ్లాఘించినా తక్కువే అవుతుందన్నారు. కార్యక్రమ కోఆర్డినేటర్‌ బైలుప్పల షఫీయుల్లా మాట్లాడుతూ తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీకగా ఎన్టీ రామారావు నిలువెత్తు రూపం నిలిచిపోతుందని కొనియాడారు. కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్‌ 30వ వర్థంతిని పురస్కరించుకొని కవి డి. పార్వతయ్య రచించిన ‘నందమూరి శతకం’ పుస్తకాన్ని అతిథులు, కళాకారులు ఆవిష్కరించారు. మొత్తం 60మంది పోటీకి రాగా, ఆదివారం 30 మంది కళాకారులు పోటీల్లో పాల్గొన్నారు. సోమవారం మరో ముప్పయ్‌ మంది ప్రదర్శనల అనంతరం సాయంత్రం 6 గంటలకు బహుమతి ప్రదానం చేస్తామని నిర్వాహకులు తెలిపారు. ఐక్యవేదిక ప్రతినిధులు వీవీ రమణారెడ్డి, పి. దస్తగిరి, డి. పుల్లయ్య, కళాప్రియ తిరుపాలు, డీఎన్వీ సుబ్బయ్య, కె. రాజశేఖర్‌, టీడీపీ సాంస్కృతిక విభాగం జిల్లా కార్యదర్శి పి. పద్మాచౌదరి పాల్గొన్నారు.

Updated Date - Jan 19 , 2026 | 12:05 AM