Share News

ఆత్మగౌరవానికి ప్రతీక ఎన్టీఆర్‌

ABN , Publish Date - May 29 , 2026 | 12:17 AM

వెండితెరపై నటసార్వభౌముడిగా.. ప్రజా జీవితంలో యుగపురుషుడిగా తెలుగు వారి గుండెల్లో చెరగని స్థానం సంపాదించుకున్న వ్యక్తి ఎన్టీఆర్‌. తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయుడికి తెలుగు తమ్ముళ్లు ఘన నివాళులర్పించారు.

ఆత్మగౌరవానికి ప్రతీక ఎన్టీఆర్‌
కర్నూలు టీడీపీ కార్యాలయం వద్ద నివాళి అర్పిస్తున్న మంత్రి టీజీ, టీడీపీ నాయకులు

ఘనంగా 103వ జయంతి

నివాళులర్పించిన తెలుగు తమ్ముళ్లు

హైబ్రిడ్‌ మహానాడులోనూ మహా జోష్‌

వర్చువల్‌గా జరిగినా టీడీపీ శ్రేణుల్లో తరగని ఉత్సాహం

రెండో రోజు జిల్లాలో 35 వేల మందికి పైగా హాజరు

కర్నూలు, మే 28 (ఆంధ్రజ్యోతి): వెండితెరపై నటసార్వభౌముడిగా.. ప్రజా జీవితంలో యుగపురుషుడిగా తెలుగు వారి గుండెల్లో చెరగని స్థానం సంపాదించుకున్న వ్యక్తి ఎన్టీఆర్‌. తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయుడికి తెలుగు తమ్ముళ్లు ఘన నివాళులర్పించారు. గురువారం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ 103వ జయంతిని ఘనంగా జరుపుకున్నారు. పల్లెపల్లెనా ఎన్టీఆర్‌ విగ్రహాలు, చిత్రపటాలకు పూల మాలలు వేసి జయహో ఎన్టీఆర్‌ అంటూ నినదించారు. ఆయన స్ఫూర్తిని కొనియాడారు. కర్నూలు నగరంలోని జిల్లా టీడీపీ కార్యాలయం, కలెక్టరేట్‌ దగ్గరున్న ఎన్టీఆర్‌ విగ్రహాలకు రాష్ట్ర మంత్రి టీజీ భరత్‌, జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ, ఎంపీ బస్తిపాటి నాగరాజు తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిలు, ముఖ్య నాయకులు తారక రాముడి జయంతి వేడుకలు పండుగలా జరుపుకున్నారు.

రెండో రోజూ అదే జోష్‌

పసుపు పండుగ మహానాడును ఈసారి హైబ్రిడ్‌ విధానంలో వర్చువల్‌గా నిర్వహించినా కార్యకర్తల్లో జోష్‌ తగ్గలేదు. ఎల్‌ఈడీ స్ర్కీన్‌లపై సీఎం చంద్రబాబు, రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ ప్రసంగాలను విన్నారు. మంత్రి టీజీ భరత్‌, టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ, జోనల్‌ ఇన్‌చార్జి శ్రీనివాసరెడ్డి స్థానిక మౌర్యఇన్‌ హోటల్‌లోని పరిణయ హాల్‌లో క్లస్టర్‌-5 మహానాడులో పాల్గొన్నారు. అనంతరం 12 క్లస్టర్లలో మహానాడుకు హాజరయ్యారు. ఎంపీ బస్తిపాటి నాగరాజు కర్నూలు మండలం ఈ-తాండ్రపాడులో పాల్గొన్నారు. కేడీసీసీబీ చైర్మన్‌ విష్ణువర్దన్‌ రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ, జోనల్‌ ఇన్‌చార్జి శ్రీనివాసరెడ్డిలతో కలసి ఉల్చాల, నాగలాపురం, స్టాంటన్‌పురం క్లస్టర్లలో పాల్గొనగా, కోడుమూరు, సి.బెళగల్‌, గూడూరులో ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి హాజరయ్యారు. పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు మార్కెట్‌ యార్డు వద్ద ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వెల్దుర్తి, కృష్ణగిరి క్లస్టర్లలో పాల్గొన్నారు. పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి ఓర్వకల్లు మండలం హుసేనాపురం క్లస్టర్‌-2లో పాల్గొన్నారు. నందికొట్కూరు ఇన్‌చార్జి గౌరు వెంకటరెడ్డి కల్లూరు అర్బన్‌ వార్డుల్లో జరిగిన మహానాడులో పాల్గొన్నారు. ఆదోని టీడీపీ ఇన్‌చార్జి కె. మీనాక్షినాయుడు పది క్లస్టర్లలో జరిగిన మహానాడులో పాల్గొన్నారు. ఆలూరు ఇన్‌చార్జి వైకుంఠం జ్యోతి దేవనకొండలో ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం దేవనకొండ, పి.కోటకొండ, ఆస్పరి క్లస్టర్లలో మహానాడు వేడుకల్లో పాల్గొన్నారు. మంత్రాలయం ఇన్‌చార్జి రాఘవేంద్రరెడ్డి కోసిగిలో, టీడీపీ నాయకుడు శ్రీనివాసరెడ్డి మంత్రాలయంలో పాల్గొన్నారు.

రెండేళ్లలో ఊహించని అభివృద్ధి

పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్‌

మాజీ సీఎం ఎన్టీఆర్‌కు ఘన నివాళి

కర్నూలు అర్బన్‌, మే 28(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం రెండేళ్లలోనే రాష్ట్రంలో ఊహించని విధంగా అభివృద్ధి చేసిందని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్‌ అన్నారు. గురువారం రెండో రోజు నగరంలోని వివిధ క్లస్టర్లలో జరిగిన మహానాడు కార్యక్ర మంలో ఆయన పాల్గొన్నారు. దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మంత్రి మాట్లాడుతూ ఎన్టీఆర్‌ దేశం గర్వించదగ్గ నాయకుడని కొనియాడారు. ఆయన అమలు చేసిన పథకాలు దేశానికే ఆదర్శవంతంగా నిలిచాయన్నారు. ఎన్టీఆర్‌ ఆశయాలను కొనసాగిస్తూ సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని పాలిస్తున్నారని, తమ ప్రభుత్వంలో పేదలకు అన్ని విధాలుగా అండగా ఉంటున్నామన్నారు. కర్నూలు అభివృద్ధికి ఆహర్నిశలు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి వైసీపీ నాయకులు తట్టుకోలేక పోతున్నారన్నారు.

Updated Date - May 29 , 2026 | 12:17 AM