Share News

ఇక అంతటా పసిడి కాంతులే

ABN , Publish Date - May 22 , 2026 | 11:27 PM

కరువు ప్రాంతంలో జియో మైసూరు కంపెనీ ఎంతో ధైర్యం చేసి బంగారు నిక్షేపాలు వెలికితీసేందుకు ముందుకు రావడంతో ఇక దేశమంతా ఈ పసిడి కాంతుల వైపు చూస్తుందని రాష్ట్ర మైన్స్‌ అండ్‌ జియాలజీ ఎక్సైజ్‌ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు.

ఇక అంతటా పసిడి కాంతులే
బంగారు శుద్ధి కర్మాగారంలో సిబ్బందితో మంత్రి కొల్లు రవీంద్ర

దేశం గర్వించేలా బంగారు నిక్షేపాల గని

కరువు సీమలో ఏటా 700 కిలోలు వెలికితీత

యువతకు ఉద్యోగావకాశాలు

రాష్ట్ర మైన్స్‌ అండ్‌ జియాలజీ ఎక్సైజ్‌ శాఖల మంత్రి కొల్లు రవీంద్ర

తుగ్గలి/పత్తికొండ, మే 22 (ఆంధ్రజ్యోతి): కరువు ప్రాంతంలో జియో మైసూరు కంపెనీ ఎంతో ధైర్యం చేసి బంగారు నిక్షేపాలు వెలికితీసేందుకు ముందుకు రావడంతో ఇక దేశమంతా ఈ పసిడి కాంతుల వైపు చూస్తుందని రాష్ట్ర మైన్స్‌ అండ్‌ జియాలజీ ఎక్సైజ్‌ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. శుక్రవారం మండలంలోని జొన్నగిరి, పగిడిరాయి గ్రామాల మధ్య వెలసిన జియో మైసూరు గోల్డ్‌ మైన్స్‌ కంపెనీని మంత్రి కొల్లు రవీంద్ర, పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు సందర్శించారు. ముందు కంపెనీ చుట్టూ పరిసర ప్రాంతాలను పరిశీలించడంతో పాటు నూతనంగా నిర్మించిన బంగారు శుద్ధి కర్మాగారాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. అలాగే బంగారు వెలికితీత ప్రాంతాల మ్యాప్‌ను పరిశీలించారు. కంపెనీ ప్రతినిధులు వారి కంపెనీ వివరాలను తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఏటా 700 కిలోల బంగారు, మొత్తం 13వేల టన్నుల సామర్థ్యం కలిగిన బంగారు వెలికి తీసే ప్రాజెక్టును నెలకొల్పడంతో దేశమంతా మన రాష్ట్రం వైపు చూస్తుందన్నారు. పేద ప్రజల కలలు సాకారం చేసేందుకు, రాష్ట్రాన్ని అభివృద్ధి పరిచేందుకు జియో మైసూరు కంపెనీ ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. ఇప్పటికే గత ఏడాది కంటే ఈ ఏడాది 30 శాతం వృద్ధి సాధించిందన్నారు. దేశంలో ఎక్కడా లేని సంపద మన రాష్ట్రంలో ఉందని, వాటిని అన్వేషించి రాష్ట్రానికి ఉపయోగపడేలా కృషి చేస్తున్నామన్నారు. విశాఖపట్టణ పరిసర ప్రాంతాల్లో రేర్‌ ఎర్త్‌ మినరల్స్‌, అభివృద్ధికి టెండర్ల ప్రక్రియ కూడా ప్రారంభించామన్నారు. అలాగే రాష్ట్రంలో దొరికే గ్రానైట్‌ అంతర్జాతీయ మార్కెట్‌లో డిమాండ్‌ ఉందని, వాటిని కూడా అంతర్జాతీయ మార్కెట్‌లోకి తీసుకెళ్తామన్నారు. క్వార్జ్‌ విలువ ఆధారిత పరిశ్రమలు తీసుకువచ్చి సోలార్‌ ప్యానెల్స్‌ వంటి ఉత్పత్తులను రాష్ట్రంలోనే తయారు చేసేలా చర్యలు తీసుకుంటుందన్నారు. జియో మైసూరు కంపెనీ వల్ల దాదాపు 800 మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని అన్నారు. ఈ ప్రాంతానికి చెందిన 80 శాతం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించామన్నారు. ప్రతిరోజు ఒక కేజీ నుంచి 2 కేజీల వరకు బంగారు వెలికితీసేలా సన్నాహాలు చేస్తున్నామని అన్నారు. దాదాపు 13వేల టన్నుల బంగారు ఉత్పత్తి చేసే సామ ర్థ్యం ఉందన్నారు. త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ కంపెనీని ప్రారంభించాక బంగారు వెలికితీత పనులు మొదలవుతాయని పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ శాఖ చైర్మన్‌ తుగ్గలి నాగేంద్ర, టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ, వాల్మీకి కార్పొరేషన్‌ చైర్మన్‌ బొజ్జమ్మ, ప్రముఖ విరాళ దాత పారా విశ్వనాథ్‌ (చిట్టెన్న), కర్నూలు శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ నాగిణి, ఆర్డీవో ఓబులేసు, డీఎస్పీ వెంకట్రామయ్య, తహసీల్దార్‌ రవి, కంపెనీ ప్రతినిధులు గణేషన్‌, బాలాజీ, రాజేష్‌, సీఐ పులిశేఖర్‌ ఉన్నారు.

Updated Date - May 22 , 2026 | 11:27 PM