Share News

పెద్దాసుపత్రిలో రోగులను పట్టించుకోరా?

ABN , Publish Date - May 28 , 2026 | 12:19 AM

కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఆపదలో ఉన్న రోగులు వస్తే పట్టించుకునే నాథుడే కరువయ్యారు.

పెద్దాసుపత్రిలో రోగులను పట్టించుకోరా?
వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న షేక్‌ రియాజ్‌ అహ్మద్‌త

కర్నూలు హాస్పిటల్‌, మే 27 (ఆంధ్రజ్యోతి): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఆపదలో ఉన్న రోగులు వస్తే పట్టించుకునే నాథుడే కరువయ్యారు. అత్యవసర రోగులకు చికిత్స అందించే క్యాజువాల్టీలో చేరి రోజంతా అక్కడే ఉన్న వార్డులకు షిప్టు చేయడంలో అధికారులు, ఆర్‌ఎంవోలు నిర్లక్ష్యం వహిస్తున్నారా? కీలకమైన ప్రజాప్రతినిధులు సిపారసు చేసిన దిక్కు లేకుండా పోతుందా ఇక్కడ పరిణామాలు చూస్తే నిజమని చెప్పక తప్పదు. నంద్యాల పట్టణం నడిగడ్డకు చెందిన షేక్‌ రియాజ్‌ అహ్మద్‌ (48) బిల్డింగ్‌ పని చేస్తూ విద్యుత్‌ షాక్‌కు గురయ్యాడు. ఈ సంఘటన మంగళవారం జరిగింది. నంద్యాలలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స చేసి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో కర్నూలు జీజీహెచ్‌కు రెఫర్‌ చేశారు. బుధవారం మధ్యాహ్నం 1 గంటకు కర్నూలు జీజీహెచ్‌ క్యాజువాల్టీకి రోగిని తీసుకొచ్చారు. మెడిసిన్‌, జనరల్‌, ప్లాస్టిక్‌ సర్జరీకి చెందిన డ్యూటీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు వచ్చి రోగిని పరీక్షించారు. ఈ రోగికి సంబంధించి నంద్యాల ఎంపీ డా.శబరి కూడా వైద్యులకు సిఫారసు చేశారు. రాత్రి 10 గంటలైనా సరే వెంటిలేటర్‌ పై ఉన్న ఆ రోగి క్యాజువాల్టీలోనే ఉంచి చేతులు దులుపుకున్నారు. వాస్తవానికి హాస్పిటల్‌ సూపరింటెండెంట్‌ క్యాజువాల్టీకి వచ్చిన రోగిని గంటలోపే సంబంధిత వార్డుకు షిప్టు చేయాలన్న ఆదేశాలను వైద్యులు బేఖాతరు చేస్తున్నారు. క్యాజువాల్టీలో ఉన్న రోగిని షిప్టు చేసేందుకు తమకు సంబంధం లేదని వైద్యులు అలాగే వదిలేశారు. నంద్యాల జిల్లాకు చెందిన గడ్డం అశోక్‌ అనే మరో రోగి బైక్‌ ప్రమాదంలో గాయపడి క్యాజువాల్టీకి సాయంత్రం వచ్చారు. ఈ రోగికి సంబంధించి ఆ జిల్లాకు చెందిన మంత్రి సిఫారసు చేశారు. ఈ రోగిని కూడా క్యాజువాల్టీకిలోనే ఉంచారు. ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డా.కే. వెంకటేశ్వర్లు రెండు రోజులు విజయవాడలో శిక్షణకు వెళ్లగా.. ఆసుపత్రిలో అడిగే దిక్కు లేకుండా పోయింది.

Updated Date - May 28 , 2026 | 12:19 AM