తగ్గేదేలే!
ABN , Publish Date - Nov 20 , 2026 | 10:53 PM
తగ్గేదేలే!
పగిడ్యాల ఎంపీపీ ఎన్నిక కోసం స్వపక్షంలో పోరు
ఎంపీ, ఎమ్మెల్యే వర్గాల మధ్య విభేదాలు
చెరో రెండున్నరేళ్లు ఓకే..
మొదట అవకాశం మాకంటే మాకు అంటూ పట్టుబడ్డ ఇరువర్గాలు
ఎన్నికను వాయిదా వేసిన అధిష్ఠానం
వర్గపోరు పంచాయతీ ఎన్నికలపై ప్రభావం పడే ప్రమాదం?
నందికొట్కూరు/ పగిడ్యాల, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): పగిడ్యాల ఎంపీపీ కోసం తగ్గేదేలే అంటూ ఎంపీ, ఎమ్మెల్యేలు వర్గాలు పట్టుబడ్డాయి. నంద్యాల ఎంపీ డా.బైరెడ్డి శబరి, ఎమ్మెల్యే గిత్తా జయసూర్యల మధ్య వర్గపోరు తారాస్థాయికి చేరుకుంది. నియోజకవర్గంలో పగిడ్యాల ఎంపీపీ ఎన్నిక చుట్టూ రాజకీయ ఆధిపత్యం నడుస్తోంది. శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక సమావేశానికి కూడా ఎంపీటీసీలు గైర్హాజరు కావడంతో ఎంపీపీ ఎన్నికను వాయిదాచేస్తూ ప్రిసైడింగ్ అధికారి(పీవో) నగేష్ తెలిపారు. ఎంపీ డా.బైరెడ్డి శబరి, ఎమ్మెల్యే గిత్తా జయసూర్య మధ్య ఆధిపత్య పోరు మరింత బలప డుతోంది.
విప్ బేఖాతరు
పగిడ్యాల ఎంపీటీసీ-1 స్వాములు ఎంపీపీగాను, వైస్ ఎంపీపీగా పుల్యాల శాంతిని ప్రతిపాదిస్తూ వారికే టీడీపీ ఎంపీటీసీలు అందరు మద్దతు తెలపాలంటూ టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గౌరు చరితారెడ్డి విప్ జారీ చేశారు. పగిడ్యాల-3 ఎల్లస్వామి విప్ హోదాలో ఎంపీటీసీలకు సర్కుల్ జారీ చేయగా ఎంపీ వర్గానికి చెందిన ఎంపీటీసీలు ఆనోటీసులను తీసుకోలేదు. ఎంపీపీ ఎన్నికలను ప్రిసైడింగ్ ఆఫీసర్ ప్రవేశపెట్టగా స్వాములు ఎంపీపీగాను, వైస్ ఎంపీపీగా పుల్యాల ప్రశాంతిని ప్రతిపాదించారు. నంద్యాల ఎంపీ డా.బైరెడ్డి శబరి వర్గం ఎంపీటీసీలు మద్దతు తెలపలేదు. వారి వర్గం నుంచి నెహ్రూనగర్-2కు చెందిన అనురాధను ఎంపీపీగాను, వైస్ ఎంపీపీగా వైసీపీకి చెందిన సంకిరేణిపల్లె ఎంపీటీసీ నీలకంఠేశ్వరరెడ్డిని ప్రతిపాదించారు. ఎవరికి సరైన మెజార్టీ లేకపోవడంతో మొదటి రోజు వాయిదా పడింది.
సర్పంచ్ ఎన్నికల తర్వాత..
మొదట మాకంటే మాకు ఎంపీపీ పదవి అవకాశం కల్పించాలని ఇరువర్గాలు పట్టుబడుతున్నట్లు సమాచారం. ఈ విషయంలో సర్దిచెప్పేందుకు అధిష్ఠానం నియోజకవర్గ పరిశీలకుడు వెంకటశివుడు యాదవ్‌ను పంపారు. కానీ ఎవరూ తగ్గకపోవడంతో సర్పంచ్ ఎన్నికల తర్వాత ఎంపీపీ ఎన్నికపై నిర్ణయం తీసుకుం దామని అధిష్ఠానం చెప్పి ప్రస్తుతానికి వాయిదా వేసినట్లు తెలుస్తోంది.
సయోధ్య కుదుర్చడంలో.:
ఎంపీ శబరి, ఎమ్మెల్యే జయసూర్యల మధ్య నెలకొన్న పగిడ్యాల ఎంపీపీ ఎన్నికలో సయోధ్య కుదర్చడంతో అదిష్ఠానం తాత్సర్యం చేస్తోందా? లేక పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఎంపీపీ ఎన్నికను నిరవధిక వాయిదా వేయించి ఓ నూతన వ్యూహానికి తెర తీసిందా అన్నది తెలియాల్సి ఉంది. ఎంపీపీ ఎన్నిక విషయంలో ఇరువర్గాల మధ్య ఉన్న విభేదాలు మరింత బలపడేందుకు అవకాశం కల్పించాయి. ఇంత వరకు ఎంపీ, ఎమ్మెల్యే వర్గాల మధ్య పరోక్షంగా ఉన్న విభేదాలు పగిడ్యాల ఎంపీపీ ఎన్నికతో బహిర్గతమయ్యాయి.
ప్రతి పల్లెలో చర్చ
నేటి నుంచి ప్రారంభం కానున్న గ్రామ పంచాయతీ ఎన్నికలపై దీని ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు. ఎంపీ, ఎమ్మెల్యేలు వర్గాలుగా విడిపోయి సర్పంచ్ ఎన్ని కలకు వెళ్లితే వైసీపీ మద్దతుదారులు గెలిచే అవకాశం లేకపోలేదన్న చర్చ నియోజక వర్గంలో జరుగుతోంది. మరి ఎంపీ, ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో సర్పంచ్ ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాలు రచిస్తారన్న అంశంపై ప్రతి పల్లెలో చర్చ జరుగుతోంది.
జడ్పీటీసీ మీకు.. ఎంపీపీ మాకు?
పగిడ్యాల మండలంలో ఎమ్మెల్యే వర్గానికి చెందిన బండి రమణమ్మను తామే జడ్పీటీసీగా గెలిపించామని, ఇప్పుడు ఎంపీపీ పదవి తమ వర్గానికి ఇవ్వాలంటూ ఎంపీ శబరి అధిష్ఠానం ముందు పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. ఐదుగురు ఎంపీటీసీలు తమ వర్గానికి చెందిన వారు ఉన్నారు కాబట్టి తమకు ఎంపీపీ పదవి ఇవ్వాలని ఎమ్మెల్యే గిత్తా జయసూర్య భీష్మించుకు కూర్చున్నారు. అధిష్ఠానం చర్చలు జరపగా చెరో రెండున్నరేళ్ల పాటు ఎంపీపీ పదవిని పంచుకోవాలని సూచించారు. రెండున్నర సంవత్సరాల పంపకానికి ఇరువర్గాలు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.
సమావేశానికి గైర్హాజరయ్యారు
ఎంపీ డా.బైరెడ్డి శబరి సొంత మండలం పగిడ్యాల. ఎంపీపీ పదవి తమ వర్గానికి ఇవ్వాలంటూ ఆమె పట్టు పట్టినట్లు తెలుస్తోంది. ఇదే తరహాలోనే నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య కూడా తమ వర్గానికి చెందిన వారికే ఇవ్వాలంటూ భీష్మిం చుకు కూర్చున్నారు. రెండు వర్గాలకు చెరో 5 ఎంపీటీసీలు ఉండడంతో ఎవరికి సరైన మెజార్టీ లేకపోవడంతో మొదటి రోజు వాయిదా వేశారు. శుక్రవారం ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నిక కోసం నిర్వహించిన ప్రత్యేక సమావేశానికి ఇరు వర్గాల ఎంపీటీసీలు ఎంపీడీవో కార్యాలయానికి చేరుకుని కూడా సమావేశానికి గైర్హాజరయ్యారు. గంట పాటు వేచి చూసిన పీవో కోరం లేకపోవడంతో సమావేశాన్ని నిరవధిక వాయిదా వేస్తూ ఆయన తెలిపారు.