ముగిసిన నామినేషన్ల ఘట్టం
ABN , Publish Date - Oct 23 , 2026 | 11:35 PM
పల్లె సమరానికి అభ్యర్థులు సిద్ధమయ్యారు. పరిషత్ పోరుకు అధికార కూటమి, ప్రతిపక్ష పార్టీలు, స్వతంత్రులు పోటాపోటీగా నామినేషన్లు వేశారు.
26 జడ్పీటీసీలకు 185 నామినేషన్లు దాఖలు
432 ఎంపీటీసీలకు 2,180 నామినేషన్లు
ముందస్తు భద్రతతో సాఫీగా ముగిసిన ప్రక్రియ
నేడు నామినేషన్ల పరిశీలన
27వ తేదీ విత్‌డ్రాకు ఆఖరి గడువు
పల్లెసీమల్లో బుజ్జగింపుల పర్వం ఆరంభం
కర్నూలు, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): పల్లె సమరానికి అభ్యర్థులు సిద్ధమయ్యారు. పరిషత్ పోరుకు అధికార కూటమి, ప్రతిపక్ష పార్టీలు, స్వతంత్రులు పోటాపోటీగా నామినేషన్లు వేశారు. ఉత్కంఠగా మొదలైన నామినేషన్ల ఘట్టం శుక్రవారం ప్రశాంతంగా ముగియడంతో పోలీసులు, ఆధికారులు ఊపిరి పీల్చుకున్నారు. పల్లె రాజకీయ రణరంగంలో ఇక అసలైన పోరు మొదలైంది. ఎక్కడా ఏకగ్రీవాలకు తావులేకుండా జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు అభ్యర్థులు పోటాపోటీగా నామినేషన్లు వేశారు. చివరి రోజు ఘర్షణలు, గొడవలు జరిగే అవకాశం ఉందని ముందే ఉహించిన ఎస్పీ విక్రాంత్ పాటిల్ నేతృత్వంతో భారీ పోలీసు భద్రత ఏర్పాటు చేయడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు. జడ్పీ కార్యాలయం వద్ద మూడంచెల భద్రత వలయం ఏర్పాటు చేశారు. కర్నూలు మండలంలో తొలి రెండు రోజులు నామినేషన్లకు దూరంగా ఉన్న వైసీపీ.. వ్యూహాత్మకంగా ఆఖరు రోజున మొత్తం 23 ఎంపీటీసీ స్థానాలకు అభ్యర్థులతో నామినేషన్లు వేయించింది. 26 జడ్పీటీసీ స్థానాలకు 185 నామినేషన్లు, 432 ఎంపీటీసీ స్థానాలకు 2,180 నామినేషన్లు దాఖలు చేశారు. నేడు పరిశీలనలో ఎవరి నామినేషన్ ఉంటుంది? ఎవరిది తిరస్కరణకు గురౌతుంది? అనే ఉత్కంఠ అభ్యర్థుల్లో నెలకొంది. జిల్లాలో పరిషత్ పోరులో ఓ ఘట్టం ముగిసింది. 26 జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలు (జడ్పీటీసీ), 432 మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల (ఎంపీటీసీ)కు ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నెల 21వ తేదీ బుధవారం నుంచి జడ్పీటీసీ స్థానాలకు కర్నూలు జడ్పీ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ (ఆర్‌వో), ఎంపీటీసీ స్థానాలకు మండల పరిషత్ కార్యాలయాల్లో మండల ఎన్నికల రిటర్నింగ్ అధికారులు నామినేషన్లు స్వీకరించారు. మొదటి రోజు దసరా తర్వాతి రోజు కావడం, దేవరగట్టు కర్రల సమరం ఉండడంతో ఆశించిన స్థాయిలో అభ్యర్థులు నామినేషన్లు వేయడానికి ముందుకు రాలేదు. తర్వాతి రోజు జోరందుకుంది. చివరి రోజు శుక్రవారం జిల్లావ్యాప్తంగా జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు ప్రధాన రాజకీయ పార్టీలు టీడీపీ, వైసీపీ సహా వివిధ రాజకీయ పార్టీలు, స్వతంత్రులు పోటాపోటీగా దాఖలు చేశారు. 26 జడ్పీటీసీ స్థానాలకు మొత్తం 185 నామినేషన్లు వచ్చాయి. టీడీపీ అభ్యర్థులు 67, వైసీసీ అభ్యర్థులు 58, జనసేన 8, బీజేపీ 10, ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు 26 నామినేషన్లు వేశారు. రెండు రోజులు 83 నామినేషన్లు వస్తే, చివరి రోజు ఒక్కటే 102 నామినేషన్లు దాఖలు చేశారు. కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ ఎదురూరు విష్ణువర్ధన్‌రెడ్డి, కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరిలతో కలసి వచ్చిన కర్నూలు జడ్పీటీసీ టీడీపీ అభ్యర్థులు శైలజ, శరిత నామినేషన్లు దాఖలు చేశారు. అలాగే.. జిల్లాలో 26 మండలాల్లో 432 ఎంపీటీసీ స్థానాలకు మొత్తం 2,180 నామినేషన్లు వస్తే, చివరి రోజు 1,099 నామినేషన్లు దాఖలయ్యాయి.
నేడు పరిశీలన.. 27న విత్‌డ్రాకు ఆఖరు
జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు అభ్యర్థుల . వచ్చిన నామినేషన్లను నేడు పరిశీలిస్తారు. రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) నిబంధనలు ప్రకారం నామినేషన్ పత్రాలు ఉన్నాయా..? ఓటర్ల జాబితాలో అభ్యర్థి, ప్రతిపాదించిన ఇద్దరు వ్యక్తుల పేర్లు ఉన్నాయా..? రిజర్వేషన్ స్థానాల్లో అభ్యర్థులు కుల ధ్రువీకరణ పత్రాలు సమర్పించారా..? వంటి అంశాలను పరిశీలిస్తారు. నిబంధనలు ప్రకారం ఉంటే ఆమోదిస్తారు. లేకుంటే ఆ నామినేషన్ పత్రాలను తిరస్కరిస్తారు. న్యాయవాదుల సలహాతో నామినేషన్ పత్రాలు పూర్తి చేసినా.. అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. నామినేషన్ల విత్‌డ్రాకు ఆఖరు గడువు 27 వరకు ఉంది. అంటే.. నేటితో ఐదు రోజులు సమయం ఉండడంతో గ్రామాల్లో బుజ్జగింపు పర్వానికి తెర లేచింది. ఎలాగైనా ప్రత్యర్థులను ఒప్పించి నామినేషన్లు విత్‌డ్రా చేసుకునేలా ఒప్పించేందుకు ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నారు. పలు మండలాల్లో ప్రతిపక్ష వైసీపీ సహా స్వతంత్రులు సెల్‌ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని రాజకీయ శిబిరాలకు చేరుకున్నారు. విత్‌డ్రా చివరి రోజు సాయంత్రం 5 గంటలు తరువాత ఊర్లకు చేరుకునేలా ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తుంది.
ఎంపీటీసీ స్థానాలకు పార్టీల వారీగా వచ్చిన నామినేషన్లు
నియోజకవర్గం స్థానాలు టీడీపీ వైసీపీ జనసేన బీజేపీ ఇతరులు మొత్తం
పత్తికొండ 78 145 121 8 2 22 298
ఆదోని 31 65 70 10 19 13 177
కోడుమూరు 67 140 132 19 9 35 335
ఆలూరు 91 168 215 27 7 74 491
మంత్రాలయం 76 139 121 3 2 10 275
ఎమ్మిగనూరు 59 222 158 14 4 43 441
పాణ్యం 30 67 70 3 -- 23 163
మొత్తం 432 946 887 84 43 220 2,180
జడ్పీటీసీ స్థానాలకు పార్టీల వారీగా వచ్చిన నామినేషన్ల వివరాలు
పార్టీ నామినేషన్లు
టీడీపీ 67
వైసీపీ 58
జనసేన 8
బీజేపీ 10
కాంగ్రెస్ 16
ఇతరులు 26
మొత్తం 185