Share News

తుంగా జలం.. గగనం

ABN , Publish Date - Aug 31 , 2026 | 12:11 AM

): టఆంధ్రా, కర్ణాటక రాష్ర్టాల మధ్య ప్రవహిస్తున్న తుంగభద్ర నది నీరు లేక ఎడారిని తలపిస్తోంది. రాఘవేంద్ర స్వామి 355వ సప్త రాత్రోత్సవ ఆరాఽధనోత్సవాలకు వచ్చే భక్తులకు తుంగా జలం గగనమైపోయింది

తుంగా జలం.. గగనం
మంత్రాలయం వద్ద రాళ్లు చేరిన తుంగభద్ర నది

వెలవెలబోతున్న తుంగభద్ర నదీతీరం

పుణ్యస్నానాలకు కరువైన నీరు

రాళ్లు రప్పలతో కళావిహీనం

వృథా అయిన శ్రీమఠం అధికారుల ప్రయత్నం

పేరుకుపోయిన చెత్తాచెదారం

భరించలేని దుర్గంధం

మంత్రాలయం, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): టఆంధ్రా, కర్ణాటక రాష్ర్టాల మధ్య ప్రవహిస్తున్న తుంగభద్ర నది నీరు లేక ఎడారిని తలపిస్తోంది. రాఘవేంద్ర స్వామి 355వ సప్త రాత్రోత్సవ ఆరాఽధనోత్సవాలకు వచ్చే భక్తులకు తుంగా జలం గగనమైపోయింది. దేశ నలుమూలల నుంచి వచ్చే లక్షలాది మంది దర్శనార్థం వచ్చిన భక్తులు తుంగభద్ర నదిలో పుణ్యస్నానాలు చేసి మొక్కులు తీర్చుకుంటారు. అయితే నదిలో ప్రవాహం లేకపోవడంతో రాళ్లు, రప్పలతో కళావిహీనంగా మారింది. కొంత మంది భక్తులు అపర భగీరథులుగా నది ఒడ్డు నుంచి నదిలోకి అర కిలోమీటరు వెళ్లి మురికి నీటిలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు.

ఆశ్చర్యంలో భక్తులు

ఆగస్టు నెలలోనే చుక్క నీరు నదిలో లేక ఎడారిగా మారిన తుంగభద్రమ్మను చూసి భక్తులు ఆశ్చర్యానికి గురి అవుతున్నారు. మహిళలు, వృద్ధులు, చిన్నారులు నది జలం కోసం పరితపిస్తూ బండరాళ్లపై పడుతూ లేస్తూ ప్రమాదాలకు గురి అవుతూ వెళ్లాల్సిన దుస్థితి. విఐపి, సాధారణ, గణేష్‌, ఎన్‌ఏపీ పంపుహౌస్‌ పుష్కర ఘాట్లు వెలవెల పో తున్నాయి. లాడ్జిల్లో గదులను అద్దెకు తీసుకొని స్నానాలు చేసి గుడికి వెళ్లాలంటే వేలల్లో డబ్బులు చెల్లించలేని భక్తులు తుంగభద్ర నదిలో స్నానానికి సాహస యాత్ర చేయాల్సిన పరిస్థితి వుంది. ఎటూ చూసినా నీటి చుక్క కనిపించకపోవడం భక్తులు జీర్ణించుకోలేక పోతున్నారు.

నెల రోజులు ముందుగా..

నెలరోజులు ముందుగా ఆంధ్రా, కర్ణాటక, తెలంగాణ సీఎంలకు, టీబీ డ్యాం అధికారులకు తుంగభద్ర నదికి నీరు విడుదల చేయాలని శ్రీమఠం అధికారులు లేఖలు రాశారు. అయినా ఫలితం లేకుండా పోయింది. వారం రోజుల క్రితం టీబీ డ్యాం నుంచి తుంగభద్ర నదికి తూతూ మంత్రంగా 2వేలు క్యూసెక్కులు నీటిని విడుదల చేశారు. ఆనీరు మంత్రాలయంకు చేరుకునేలోగా ఉత్సవాలు ముగుస్తుండడంతో భక్తులకు ఈఏడాది నిరాశే మిగిలింది. శ్రీమఠం అధికారులు నది ఒడ్డన రెండుచోట్ల ఏర్పాటు చేసిన షవర్లు నిరుపయోగంగా మారాయి.

బకెట్‌ నీరు రూ.100

నదిలో నీరు లేకపోవడం ఆసరాగా చేసుకున్న షాపుల యజమానులు పుట్టుగొడుగులా నది ఒడ్డనే రేకుల షెడ్లలో మరుగుదొడ్లు, స్నానానికి ఏర్పాట్లు చేసి బకెట్‌ నీరు రూ.100 ప్రకారం అమ్ముకుంటూ భక్తులను నిలువుదోపిడీకి గురి చేస్తున్నారు. పట్టించు కునేవారే లేరు. నదీతీరంలో చెత్త చెదారంతో నిండి దుర్వాసన వెదజల్లుతోంది. నీరులేక, శభ్రత లేకపోవడంపై భక్తులు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Aug 31 , 2026 | 12:11 AM