ఎండిన తుంగభద్ర
ABN , Publish Date - Mar 17 , 2026 | 12:09 AM
ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల మధ్య ప్రవహిస్తున్న తుంగభద్ర నది ఎడారిగా మారింది. మార్చిలోనే నది ప్రవాహం ఆగిపోవడంతో నదీతీర గ్రామాల్లో తాగునీటికి తీవ్ర కటకట ఏర్పడింది. జలకళతో ఉండాల్సిన తుంగభద్ర నది రాళ్లతో దర్శనమిస్తూ కళాహీనంగా మారింది.
రాళ్లుతేలి ఎడారిగా మారిన నది
నదీతీర గ్రామాల్లో తాగునీటికి కటకట
తాగునీటి పంపులకు అందని నీరు
మంత్రాలయం, మార్చి 16 (ఆంధ్రజ్యోతి): ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల మధ్య ప్రవహిస్తున్న తుంగభద్ర నది ఎడారిగా మారింది. మార్చిలోనే నది ప్రవాహం ఆగిపోవడంతో నదీతీర గ్రామాల్లో తాగునీటికి తీవ్ర కటకట ఏర్పడింది. జలకళతో ఉండాల్సిన తుంగభద్ర నది రాళ్లతో దర్శనమిస్తూ కళాహీనంగా మారింది. గ్రామాలకు సరఫరా చేసే పంపులకు నీరు అందడంలేదు. దీంతో ఎక్స్‌కవేటర్ వంటి యంత్రాల సాంతో నదిమధ్యలో గుంతలో ఉన్న నీటిని కాలువద్వారా తాగునీటిపంపుల దగ్గరికి తీసుకొచ్చి తాగునీరు అందిస్తున్నారు. కొన్ని గ్రామాల్లో ఇప్పటినీరు లేకపోవడంతో ప్రత్యామ్నాయంగా గ్రామాల సమీపంలో ఉన్న బోరుబావులు, ట్యాంకర్లతో నీటిని సరఫరా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాఘవేంద్రస్వామి దర్శనార్థం వచ్చే భక్తులకు తుంగభద్ర నదిలో పుణ్య స్నానాలు ఆచరించేందుకు నీరు కరువయ్యాయి. నది మధ్యలో రాళ్లు రప్పలు దాటుకుంటూ వెళ్లి స్నానం చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. చాలామంది భక్తులు రాళ్లను దాటుకుంటూ పిల్లాపాలతో వెళ్తూ కిందామీదా పడుతూ ప్రమాదాలకు గురి అవుతున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి టీబీ డ్యాం నుంచి తుంగభద్ర నదికి నీటిని విడుదల చేసి గ్రామాల ప్రజల దాహార్తిని తీర్చాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.