నాడు ఏకగ్రీవం.. నేడు ఎన్నికలు
ABN , Publish Date - Oct 28 , 2026 | 11:58 PM
గత వైసీపీ హయాం 2021లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ఏకపక్షంగా ఏకగ్రీవమయ్యాయి. అయితే ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆళ్లగడ్డ నియోజకవర్గంలో నవంబరు 5న ఎన్నికలు నిర్వహించనున్నారు. దీంతో ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులను ఎన్నుకునే అవకాశం కలిగందని ఓటర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
గత వైసీపీ హయాంలో బలవంతం.. నేడు ఎన్నుకునేందుకు ఓటర్లకు అవకాశం
ఆళ్లగడ్డ, శిరివెళ్ల, చాగలమర్రి, దొర్నిపాడు మండలాల్లో 5న ఎంపీటీసీ ఎన్నికలు
శిరివెళ్ల, అక్టోబరు 28(ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మండలంలో రాజకీయం రసవత్తరంగా మారింది. గత వైసీపీ హయాంలో ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం కాగా, నేడు కూటమి పాలనలో ఎన్నికలు నిర్వహించనున్నారు. మండలంలో 17 ఎంపీటీసీ స్థానాలున్నాయి. గత వైసీపీ హయాంలో 10 ఎంపీటీసీ స్థానాలను వైసీపీ అభ్యర్థులు, ఆరు స్థానాలను టీడీపీ అభ్యర్థులు ఏకగ్రీవం చేసుకోగా గుంప్రమాన్‌దిన్నె ఎంపీటీసీ స్థానానికి మాత్రమే ఎన్నికలు నిర్వహించారు. ప్రస్తుతం గోవిందపల్లెలోని రెండు ఎంపీటీసీ స్థానాల్లో ఒకటి టీడీపీ, మరొకటి వైసీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా తీర్మాంచుకుని నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. దీంతో మండలంలో మిగిలిన 15 ఎంపీటీసీ స్థానాలకు పోటీ ఉంది.
బరిలో 41 మంది అభ్యర్థులు
మండలంలోని 17 ఎంపీటీసీ స్థానాలకు మొత్తం 82 నామినేషన్లు దాఖలు కాగా వివిధ కారణాలతో 7 నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. 75 నామినేషన్లును ఆమోదించారు. రెండు ఎంపీటీసీ స్థానాలకు ఒకటి చొప్పున నామినేషన్లు రావడంతో అధికారులు ఏకగీవ్రంగా ప్రకటించగా 32 మంది అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో 41 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. టీడీపీ అభ్యర్థులు 15 మంది, వైసీపీ 15 మంది, జనసేన ఏడుగురు, బీజేపీ ఒకరు, స్వతంత్ర అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
గత వివరాలు పరిశీలిస్తే...
మండలంలోని 17 ఎంపీటీసీ స్థానాల్లో శిరివెళ్ల-2, శిరివెళ్ల-3, యర్రగుంట్ల-2, బోయలకుంట్ల, మహదేవపురం, గంగవరం స్థానాలు టీడీపీకి ఏకగీవ్రమయ్యాయి. కోటపాడు, శిరివెళ్ల-1, శిరివెళ్ల-4, శిరివెళ్ల-5, గోవిందపల్లె-1, గోవిందపల్లె-2, గుండంపాడుకు, యర్రగుంట్ల-1, జీనేపల్లె, చెన్నూరు స్థానాలు వైసీపీకి ఏకగ్రీవం అయ్యాయి.
జడ్పీటీసీ స్థానానికి పోటీ
శిరివెళ్ల జడ్పీటీసీ స్థానం అన్ రిజర్వుడ్‌కు జనరల్‌కు కేటాయించడంతో పోటీ ఉంది. టీడీపీ తరపున కాటంరెడ్డి శ్రీకాంత్‌రెడ్డి(బోయలకుంట్ల గ్రామం) పోటీ చేస్తుండగా, వైసీపీ, జనసేన, కాంగ్రె్‌సతోపాటు స్వతంత్ర అభ్యర్థి పోటీలో నిలిచారు.
ఆళ్లగడ్డ: జడ్పీటీసీ స్థానానికి 7 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. టీడీడీ నుంచి పొరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, వైసీపీ-గజ్జల రాఘవేంద్రారెడ్డి, జనసేన-ఇరిగెల సూర్యరానాయణరెడ్డి, కాంగ్రెస్ నుంచి వై.సంజీవకుమార్ పోటీలో నిలిచినట్ల అధికారులు తెలిపారు. ఇండిపెండెంట్ అభ్యర్థులుగా మట్ట ఉపేంద్రరెడ్డి, మల్లారెడ్డి, దేవ సువర్ణమ్మ పోటీ చేస్తున్నారు.
10 ఎంపీటీసీ స్థానాలకు 27మంది అభ్యర్థులు
మండలంలోని 10 ఎంపీటీసీ స్ధానాలకు 27 నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు తెలిపారు. టీడీపీ తరపున 10 మంది, వైసీపీ నుంచి 10 మంది, జనసేన రెబల్ అభ్యుర్థులు 5 మంది, ఎస్డిపీ నుంచి ఒకరు పోటీలో ఉన్నారు. అలాగే రుద్రవరం మండలంలో 14 ఎంపీటీసీ స్ధానాలకు 36 మంది నామినేషన్లు వేయ్యగా 14 టిడిపి, 14 మంది వైసీపీ, 6 మంది జనసేన, 1 బిజేసి, 1సీపీఐ బరిలో ఉన్నారు. దొర్నిపాడు మండలంలో 7 ఎంపిటీసీ స్ధానాలకు 23 నామినేషన్లు రాగా 7 టీడీపీ, 7 వైసీపీ, 3 జనసేన, 6 మంది ఇండిపెండెంట్లు బరిలో ఉన్నారు. ఉయ్యలవాడ మండలంలో 8 ఎంపీటీసీ స్ధానాలకు 17 నామినేషన్లు రాగా టీడీపీ 5, వైసీపీ6, జనసేన 4, ఇండిపెండెంట్లుగా ఇద్దరు నిలిచారు.
చాగలమర్రిలో 15 ఎంపీటీసీ స్థానాలు ఉండగా, వివిధ పార్టీలకు చెందిన 45మంది అభ్యర్థులు ఉన్నారు. ఏ ఒక్క స్థానం కూడా ఏకగ్రీవం కాలేదు.