Share News

సిబ్బంది లేని ఆరోగ్య కేంద్రం

ABN , Publish Date - Mar 12 , 2026 | 12:30 AM

నాపరాళ్ల పారిశ్రామిక కేంద్రమైన బేతంచెర్లలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. పట్టణంలో పేద, మధ్య తరగతి ప్రజలు, ఇతర ప్రాంతాల నుంచి జీవనోపాధి కోసం వచ్చిన కార్మికులు సుమారు 50వేల జనాభా పైగానే ఉన్నారు. వీరికి వైద్య సేవలు అందేందుకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని 2021 ఏప్రిల్‌లో అప్‌గ్రేడ్‌ చేస్తూ శేషారెడ్డి ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.

సిబ్బంది లేని  ఆరోగ్య కేంద్రం
బేతంచెర్ల శేషారెడ్డి ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం, ఇన్‌సెట్‌లో వార్డులోనే మరుగుదొడ్డి

ఇబ్బంది పడుతున్న బేతంచెర్ల ప్రజలు

అప్‌గ్రేడ్‌ చేసినా రోగులకు అందని వైద్యం

బేతంచెర్ల, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): నాపరాళ్ల పారిశ్రామిక కేంద్రమైన బేతంచెర్లలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. పట్టణంలో పేద, మధ్య తరగతి ప్రజలు, ఇతర ప్రాంతాల నుంచి జీవనోపాధి కోసం వచ్చిన కార్మికులు సుమారు 50వేల జనాభా పైగానే ఉన్నారు. వీరికి వైద్య సేవలు అందేందుకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని 2021 ఏప్రిల్‌లో అప్‌గ్రేడ్‌ చేస్తూ శేషారెడ్డి ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో 31 మంది వైద్యులతో పాటు వైద్య సిబ్బంది ఉండాలి. అయితే ఈ ఆస్పత్రిలో ఉన్న 28 మంది వైద్యులను, ఇతర సిబ్బందిని డోన్‌, ఆళ్ళగడ్డ ప్రభుత్వ వైద్యశాలలకు డిప్టేషన్‌ వేశారు. దీంతో ఇక్కడ వైద్యులు, సిబ్బంది కొరత ఎక్కువైంది. గతంలో పీహెచ్‌సీ ఉన్న సమయంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకోవడానికి గ్రామాల ప్రజలు డోన్‌, బనగానపల్లె, కర్నూలు తదితర పట్టణాలకు వెళ్లేవారు. బనగానపల్లె ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం జరిగేది. ఈ పరిస్థితుల్లో బేతంచెర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గత ప్రభుత్వం అప్‌గ్రేడ్‌ చేసింది. పోస్టుమార్టం గదిని బేతంచెర్లలోనే ఏర్పాటు చేశారు. ప్రస్తుతం శేషారెడ్డి ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేస్తున్నారు. అయితే వైద్యులు, సిబ్బంది లేకపోవడంతో ప్రజలు అవస్థ పడుతున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ ఆస్పత్రిలో సివిల్‌ సర్జన్‌ వైద్యుడు తప్పనిసరిగా ఉండాలి. జిల్లా వైద్యాధికారులు డిప్‌టేషన్‌పై డోన్‌, ఆళ్ళగడ్డ ప్రాంతాలకు చెందిన ఆస్పత్రులకు ఇక్కడున్న వైద్యుడు వెళ్తుండడంతో వైద్యం కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోజుకు సుమారు 500 నుంచి 600 వరకు ఓపీ ఉంటోంది. బేతంచెర్ల ప్రభుత్వ ఆస్పత్రిలో జరిగే ఓపీని దృష్టిలో ఉంచుకొని జిల్లా వైద్యాధికారులు సామాజిక ఆరోగ్య కేంద్రంలో సరిపడా వైద్యులను, వైద్య సిబ్బందిని నియమించాలని ప్రజలు కోరుతున్నారు.

వైద్యులను నియమించాలి

గతంలో మారుమూల గ్రామాల నుంచి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకునేందుకు డోన్‌, బనగానపల్లె ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లాల్సి ఉండేది. ఇప్పుడు ఈ ఆస్పత్రి స్థాయిని పెంచారు. అయితే వైద్యుల కొరత ఉంది. డాక్టర్లను తగినంత మందిని నియమిస్తే మాకు బాగుంటుంది. - లలితమ్మ, పేషంట్‌, సీతారామపురం.

మహిళలకు మరుగుదొడ్లు లేవు

బేతంచెర్ల ప్రభుత్వ ఆస్పత్రిలో మహిళలకు వైద్య సిబ్బందికి కలిసి ఒకే మరుగుదొడ్డి ఉంది. మహిళలకు ప్రత్యేకంగా మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలి. - శివమ్మ, పేషెంట్‌, అయ్యలచెరువు

పోస్టుమార్టం వైద్యుడు లేక ఇబ్బందులు

ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించడానికి వైద్యుడు లేకపోవడంతో ఉన్న వైద్యులే చేయాల్సి వస్తోంది. ఈ ఆస్పత్రిలో ఉన్న వైద్యులను, వైద్య సిబ్బందిని డిప్యుటేషన్‌పై పంపించకపోతే ప్రజలకు సరైన వైద్యం అం దుతుంది. - సాగరిక, డాక్టర్‌, బేతంచెర్ల

Updated Date - Mar 12 , 2026 | 12:30 AM