Share News

విద్యార్థులకు రక్షణ కరువు

ABN , Publish Date - Apr 16 , 2026 | 12:41 AM

సంజామల బీసీ బాలుర వసతి గృహ విద్యార్థులకు రక్షణ కరువైంది. వార్డెన్‌ ఇన్‌చార్జి కావడం, అప్పుడప్పుడు వసతి గృహానికి వస్తుండడంతో విద్యార్థుల్లో క్రమశిక్షణ తగ్గిందన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.

విద్యార్థులకు రక్షణ కరువు
పాలేరు వాగులో స్నానం చేస్తున్న విద్యార్థులు

సంజామల బీసీ బాలుర వసతి గృహంలో నిఘా కరువు

ఆందోళన వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు

రెగ్యులర్‌ వార్డెన్‌ను నియమించాలని విజ్ఞప్తి

సంజామల, ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి): సంజామల బీసీ బాలుర వసతి గృహ విద్యార్థులకు రక్షణ కరువైంది. వార్డెన్‌ ఇన్‌చార్జి కావడం, అప్పుడప్పుడు వసతి గృహానికి వస్తుండడంతో విద్యార్థుల్లో క్రమశిక్షణ తగ్గిందన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. రాత్రివేళల్లో రోడ్లపై విద్యార్థులు తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వార్డన్‌ అన్ని బాధ్యతలను ఓ అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి అయిన వంటమనిషికి అప్పజెప్పినట్లు సమాచారం. నైట్‌ వాచ్‌మన్‌గా తన సమీప బంధువును చేర్పించిన వార్డెన్‌.. ఆ స్థానంలో నెలకు రూ.4 వేలు ఇస్తూ మరో మనిషిని ఏర్పాటు చేసినట్లు సమాచారం. గత మూడు రోజుల నుంచి గ్రామానికి నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడింది. వసతి గృహా విద్యార్థులకు నీటి వసతిని కల్పించాల్సిన సిబ్బంది విద్యార్థులందరినీ స్నానానికి సమీపంలోని పాలేరు వాగుకు పంపించినట్లు తెలుస్తోంది. అయితే ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యులెవరంటూ తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. మంగళ, బుధ వారాల్లో రెండు రోజుల పాటు వసతి గృహ విద్యార్థులు పాలేరు వద్దనే కాలకృత్యాలు ముగించుకున్నారు. బుధవారం సాయంత్రం నుంచి గ్రామానికి నీటి సరఫరాను పునరుద్ధరించారు. బనగానపల్లె కొత్తపేట బీసీ బాలుర వసతి గృహ రెగ్యులర్‌ వార్డన్‌గా ఉన్న మునిరాజును సంజామలకు ఇన్‌చార్జిగా వార్డెన్‌గా నియమించారు. దీంతో పాటు డోన్‌ ఇన్‌చార్జి ఏబీసీడబ్ల్యూవో బాధ్యతలు అప్పగించారు. సంజామల బీసీ బాలుర వసతి గృహానికి రెగ్యులర్‌ వార్డెన్‌ను నియమించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ఇన్‌చార్జి వార్డెన్‌ను వివరణ కోరగా.. విద్యార్థులపై నిఘా ఉంచుతామని, సమస్యలు లేకుండా చూస్తామని చెప్పారు.

Updated Date - Apr 16 , 2026 | 12:41 AM