జీజీహెచ్‌లో భద్రత డొల్ల
ABN , Publish Date - Sep 17 , 2026 | 12:41 AM
కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల(జీజీహెచ్)లో భద్రత ప్రశ్నార్థకంగా మారింది. ఆస్పత్రిలోని పెయింగ్ బ్లాక్‌లో మహిళా హౌస్ సర్జన్లు ఉన్న వసతి గదుల్లోకి అర్ధరాత్రి వేళ ఇద్దరు వ్యక్తులు చొరబడటం కలకలం రేపింది.
మహిళా హౌస్ సర్జన్ల వసతి గదుల్లో చొరబడిన ఇద్దరు వ్యక్తులు
పట్టుకుని పోలీసులకు అప్పగించిన జూనియర్ డాక్టర్లు
విచారణ చేపట్టిన త్రీటౌన్ సీఐ
కర్నూలు హాస్పిటల్, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల(జీజీహెచ్)లో భద్రత ప్రశ్నార్థకంగా మారింది. ఆస్పత్రిలోని పెయింగ్ బ్లాక్‌లో మహిళా హౌస్ సర్జన్లు ఉన్న వసతి గదుల్లోకి అర్ధరాత్రి వేళ ఇద్దరు వ్యక్తులు చొరబడటం కలకలం రేపింది. పెయింగ్ బ్లాక్‌లో 15గదుల్లో 30 మంది మహిళా హౌస్ సర్జన్లుకు అధికారులు వసతి కేటాయించారు. పెయింగ్ బ్లాక్‌లో ఉంటూ హౌస్‌సర్జన్లు రోగులకు వైద్యసేవలు అందిస్తుంటారు. మంగళవారం అర్ధరాత్రి ఇద్దరు వ్యక్తులు పెయింగ్ బ్లాక్‌లో ప్రవేశించడంతో మహిళ హౌస్‌సర్జన్లు భయాందోళనకు గురయ్యారు. గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి తమ గదుల చుట్టూ తిరుగుతున్నారని వారు జూనియర్ డాక్టర్లకు సమాచారమిచ్చారు. ఆఇద్దరిని పట్టుకుని వారు ఔట్‌పోస్టు పోలీసులకు అప్పగించారు. వారిని త్రీటౌన్ పోలీ్‌సస్టేషన్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న జూనియర్ డాక్టర్లు, హౌస్‌సర్జన్లు 50 మంది త్రీటౌన్ పోలీ్‌సస్టేషన్‌కు చేరుకున్నారు. అక్కడ ఉద్రిక్తత నెలకొంది. హుటాహుటిన సీఐ శేషయ్య వచ్చి విచారణ చేపట్టారు. క్యాన్సర్ వార్డు ఉందని, తన భార్య కోసం పెయింగ్ బ్లాక్‌కు వచ్చినట్లు అందులో ఓ వ్యక్తి సీఐకి వివరించారు. పెయింగ్ బ్లాక్ చూసిన తర్వాత అది హాస్టల్ కాదన్న విషయం తెలుసుకుని ఎందుకు అక్కడ నుంచి వెళ్లలేదా అని సీఐ ప్రశ్నించారు. క్యాన్సర్ ఆస్పత్రి చివరలో ఉం డగా హౌస్‌సర్జన్ల వసతి గదుల వైపు ఉద్దేశపూర్వకంగా వచ్చారని మహిళా హౌస్‌సర్జన్లు ఆరోపించారు. బుధవారం తెల్లవారుజామున 3గంటల వరకు సీఐ విచారణ చేసిన తర్వాత కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తానని హామీ ఇవ్వటంతో జూనియర్ డాక్టర్లు వెనుదిరిగారు.
ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌కు ఫిర్యాదు
మహిళా హౌస్ సర్జన్లకు భద్రత కరువైందని, గుర్తు తెలియని వ్యక్తులు తప్పతాగి తమ గదులవైపు సంచరిస్తూ భయాందోళనలకు గురి చేస్తున్నారని జూనియర్ డాక్టర్లు, హౌస్‌సర్జన్లు ఇన్‌చార్జి సూపరింటెండెంట్ డా.ఎన్.నాగేశ్వరరావుకు ఫిర్యాదు చేశారు. రాత్రిపూట కొన్ని చోట్ల లైట్లు ఉండటం లేదని, పోలీసులతో గస్తీ ఏర్పాటు చేయాలని కోరారు. జూనియర్ డాక్టర్లు వినతి పత్రం సమర్పించారు. కమిటీని ఏర్పాటు చేసి సమస్యలను పరిష్కరిస్తామని ఇన్‌చార్జి సూపరింటెండెంట్ హామీ ఇచ్చారు.
ఇద్దరు సెక్యూరిటీ సూపర్‌వైజర్లు సస్పెండ్
పెయింగ్ బ్లాక్‌లో మహిళ హౌస్ సర్జన్ల వసతి గదుల్లో చొరబడిన ఘటనపై ఆస్పత్రి అధికారులు సీరియస్ అయ్యారు. మంగళవారం అర్ధరాత్రి ఆ సమయంలో విధుల్లో ఉన్న సెక్యూరిటీ సూపర్‌వైజర్లు, గార్డులు పెయింగ్ బ్లాక్ వసతి గదుల వైపు ఎవరూ వెళ్లలేదని సీసీ కెమెరాలో స్పష్టమైంది. సెక్యూరిటీ సిబ్బంది రాత్రివేళలో గస్తి వేసి ఉంటే ఇలాంటి సంఘటనలు జరిగేవి కావన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పెయింగ్ బ్లాక్ సంఘటనపై విధుల్లో ఉన్న సెక్కూరిటీ సూపర్‌వైజర్ మహేంద్ర, గార్డు మధును సస్పెండ్ చేస్తూ సెక్యూరిటీ ఏజెన్సీ ఈగల్ హంటల్‌కు నోటీసును ఇన్‌చార్జి సూపరింటెండెంట్ జారీ చేశారు. మంగళవారం రాత్రి (సీ-షిప్టు)లో 50 మంది సెక్యూరిటీ సిబ్బంది ఉండాల్సి ఉండగా.. కేవలం 32మంది మాత్రమే విధుల్లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. రాత్రివేళలో సరైన పర్యవేక్షణ లేకపోవడంతో రోగులకు, వైద్య విద్యార్థులకు భద్రత కరువైందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.