వాన రాలె
ABN , Publish Date - Jul 17 , 2026 | 12:17 AM
: మండలంలో సాగుచేసిన పంటలు ఎండిపోయాయి. చాలామంది రైతులు పత్తి సాగు చేసి తీవ్రంగా నష్టపోయారు. వర్షాలు లేక, బోర్లులో నీరు రాక 70 రోజుల క్రితం ఐదెకరాల్లో సాగు చేసిన పత్తి పంటంతా ఎండిపోయింది.
ఎండిపోతున్న పైర్లు
ఊరిస్తూ ఉసూరుమనిపిస్తున్న మేఘాలు
ఎండిపోతున్న బోర్లు, బావులు
400 ఎకరాల్లో పత్తి పంట నష్టం
ఎడారిని తలపిస్తున్న పొలాలు
ఓర్వకల్లు, జూలై 16 (ఆంధ్రజ్యోతి): మండలంలో సాగుచేసిన పంటలు ఎండిపోయాయి. చాలామంది రైతులు పత్తి సాగు చేసి తీవ్రంగా నష్టపోయారు. వర్షాలు లేక, బోర్లులో నీరు రాక 70 రోజుల క్రితం ఐదెకరాల్లో సాగు చేసిన పత్తి పంటంతా ఎండిపోయింది. దీంతో రూ.5లక్షల దాకా నష్టపోయాడు. మండలంలోని 400 ఎకరాలకు పైగా పత్తి సాగు చేసి రైతులందరూ తీవ్రంగా నష్టపోయారు. ఎల్‌నినో ప్రభావంతో వేసవిని మించిన ఎండలు కాస్తున్నాయి. ఉక్కపోతతో ప్రజలు తల్లడిల్లుతున్నారు. ఇంకా ఎన్ని రోజులు ఈ ఎండలు ఉంటాయోనని రైతులు ఆందోళనలో ఉన్నారు. వర్షాలు కురువక పోవడంతో వ్యవసాయ పనులు ఆగిపోయాయి. బోర్లు, బావుల కింద వేసిన పత్తి పంట ఎండిపోతుంది. రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. నీటి కోసం రైతులు మేఘాల వైపు ఎదురు చూస్తూ దేవుళ్లకు అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేస్తున్నారు.
జూన్ నెలలో కురిసిన కొద్దిపాటి వర్షానికి మండలంలోని హుశేనాపురం, సోమయాజులపల్లె, ఓర్వకల్లు, ఎన్.కొంతలపాడు, గుట్టపాడు, కొమరోలు, పాలకొలను తదితర గ్రామాల్లో 300 ఎకరాల్లో పత్తి పంట సాగు చేశారు. నెల రోజులుగా వర్షాలు లేకపోడంతో పత్తి పంట వాడిపోయింది. పాలకొలను గ్రామంలో సుమారు 180 ఎకరాలు బోరుబావుల కింద 70 రోజుల క్రితం పత్తి పంట సాగు చేశారు. అయితే.. వర్షాలు లేకపోవడంతో భూగర్భజలాలు ఇంకిపోవడం, ఎండలు అధికం కావడంతో పూత, కాయ రాలడమే కాకుండా ఆకులు రాలిపోయి మొక్కలు ఎండిపోతున్నాయి. దీంతో రైతులకు రూ.లక్షల్లో నష్టం వాటిల్లింది. అప్పులు చేసి సాగు చేస్తే వానలు కురవక నష్టపోయామని అంటున్నారు.
అప్పులు చేసి సాగు చేశాం
బ్యాంకుల్లో పంట రుణాలు ఇవ్వకపోవడంతో అప్పులు చేసి పొలాలను సాగు చేశామనీ, అయితే.. వర్షాలు లేకపోవడంతో పంటలు దెబ్బతిన్నాయని రైతులు అంటున్నారు. పంటపై చేసిన అప్పులు ఎలా తీర్చాలని రైతులు గుండెలు బాదుకుంటున్నారు.
బోరు ఉన్నా చుక్క నీరు కరువే
బోరుబావులు ఉన్నా చుక్క నీరు కరువైంది. నీరు లేక మోటార్లు మొరాయిస్తున్నాయి. దీంతో పత్తి పంట మూడెకరాల్లో నష్టం వాటిల్లింది. ఎకరాకు రూ.30వేల నుంచి రూ.40వేల దాకా పెట్టుబడి పెట్టాం. - మహేశ్వరరెడ్డి, రైతు
రూ.5 లక్షలు నష్టం
బోరు కింద ఐదెకరాల్లో బీటి పత్తి 70 రోజుల క్రితం సాగు చేశాను. రెండు బోర్లలో నీరు లేక పంటంతా వాడుముఖం పట్టింది. దీంతో రూ.5 లక్షల మేర నష్టం వాటిల్లింది. పంటలపై చేసిన అప్పులు ఎలా తీర్చాలి? - తిరుపతయ్య, రైతు