Share News

కనిపించని చినుకు జాడ..

ABN , Publish Date - Jul 14 , 2026 | 12:16 AM

ఖరీఫ్‌ సాగులో జూలై నెల పంటలకు ఎంతో కీలకం. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఈ నెలలో విస్తారంగా వర్షాలు కురియాలి.

కనిపించని చినుకు జాడ..
శిరివెళ్లలో నీరు అడుగంటిన వ్యవసాయ బావి

జూన్‌, జూలైలో అతి తక్కువ వర్షపాతం

బావుల్లో అడుగంటిన నీరు, ఎండుతున్న పంటలు

శిరివెళ్ల, జూలై 13(ఆంధ్రజ్యోతి): ఖరీఫ్‌ సాగులో జూలై నెల పంటలకు ఎంతో కీలకం. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఈ నెలలో విస్తారంగా వర్షాలు కురియాలి. అయితే ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు రావడంతో రైతులు తల్లడిల్లుతున్నారు. కాలువల్లో నీరు లేదు, భూగర్భ జలాల నిల్వలు తగ్గిపోయి వ్యవసాయ బోర్లు, బావుల్లో నీళ్లు అడుగంటుతున్నాయి. ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించిన విషయం తెలిసిందే. వర్షాలు కురవకపోవడంతో భూగర్భ జలాలు అడుగంటి పంటలకు నీరందడం ప్రశ్నార్థకంగా మారింది.

ఖరీఫ్‌ గట్టెక్కేనా..

ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఖరీ్‌ఫలో దాదాపు 6.55 లక్షల హెక్టార్లలో రైతులు వివిధ పంటలు సాగు చేస్తారని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. వరి, మొక్కజొన్న, మిరప పంటలు విరివిగా సాగు చేస్తున్నారు. ముందుగా పచ్చిరొట్ట పైర్లు పిల్లిపెసర, జీలుగ విత్తనాలు చల్లారు. బోర్లు, బావుల కింద పంటలు సాగుచేసే రైతులు జూలై నెలలో వరి నారుమళ్లు సిద్ధం చేసుకునేవారు. నారు పెరిగి ఆగస్టులో వరి నాటే సమయానికి పంట కాల్వలకు నీరు విడుదల కావడంతో రైతులు ముమ్మరంగా వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యేవారు. కానీ ఈ ఏడాది ఆశించిన మేర వర్షాలు లేక ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు పడిపోయాయి.

వర్షం కోసం ఎదురుచూపులు...

సంజామల: జూన్‌ ప్రారంభంలో ఓ మోస్తరు వర్షం కురియడంతో రైతులు దాదాపు 200 ఎకరాల్లో మొక్కజొన్న, 120 ఎకరాల్లో మిరప పంటలను సాగుచేశారు.

సాధారణం కన్నా తక్కువ సాగు..

జూన్‌లో సాధారణ వర్షపాతం 65.8 మి.మీ కురియాల్సి ఉండగా 50.0 వర్షం మాత్రమే కురిసింది. దీంతో పంటలు వాడకముందే వరుణుడు కరుణించాలని రైతన్నలు ఎదురుచూస్తున్నారు. సాధారణంగా మండలంలో ఈ ఖరీఫ్‌కు 180 హెక్టార్లలో మొక్కజొన్న, 1550 హెక్టార్లలో మిరప సాగు కావాల్సి ఉంది. అయితే ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతం సాగు చేసిన కాస్త పంటలకు కూడా సాగునీరు అందే అవకాశం లేదు. ఎస్సార్బీసీకి నీరు విడుదల కాకపోవడం, పాలేరు వాగులో ప్రవాహం తగ్గడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.

Updated Date - Jul 14 , 2026 | 12:16 AM