Share News

వరి.. వర్రీ

ABN , Publish Date - Oct 14 , 2026 | 12:31 AM

ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు కురవకపోవడంతో ఈ ఖరీ్‌ఫలో వరిసాగు గణనీయంగా పడిపోయింది. ఎటుచూసినా పచ్చటి వరిపొలాలతో కళకళలాడే ఈ ప్రాంతం నేడు బోసిపోయింది.

వరి.. వర్రీ
మల్లెవేములలో వదిలేసిన వరి పంట

ఎల్‌నినో ప్రభావంతో గణనీయంగా తగ్గిన సాగు

ఉన్న కాస్త పంట ఎండుముఖం

అమాంతం పెరిగిన బియ్యం ధరలు

చాగలమర్రి, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు కురవకపోవడంతో ఈ ఖరీ్‌ఫలో వరిసాగు గణనీయంగా పడిపోయింది. ఎటుచూసినా పచ్చటి వరిపొలాలతో కళకళలాడే ఈ ప్రాంతం నేడు బోసిపోయింది. గతంలో ఏ వర్షాకాలంలోను ఇలాంటి పరిస్థితి ఎదుర్కొలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేసీ, తెలుగు గంగ కాలవతోపాటు చెరువుల్లో కడా నీరు లేదు. కేవలం బోర్ల కింద మాత్రమే ఈ ఏడాది వరి సాగు చేపట్టారు. ఎల్‌నినో ప్రభావంతో సకాలంలో వర్షాలు కురవక పోవడంతో వరి సాగుచేస్తే నీటి కష్టాలు తప్పవని ఆందోళన చెందుతున్నారు.

గణనీయంగా పడిపోయిన సాగు

వ్యవసాయ అధికారుల లెక్కల మేరకు ఖరీ్‌ఫలో 6 వేల హెక్టార్లలో వరి సాగు చేసేవారు. అయితే ఈ ఏడాది 3వేల హెక్టార్లలో మాత్రమే సాగుచేశారు. తీవ్ర వేడి వతావరణం ప్రభావంతో ఉన్న కాస్త పంట కూడా ఎండుమఖం పట్టింది. కొందరు రైతులు ప్రత్యామ్నాయ పంటలైన మినుము, మొక్కజొన్న, కంది, జొన్న, ఉద్యాన పంటలైన అరటి, పసుపు, బొప్పాయి సాగుచేశారు. మరికొందరు భూములను బీడుగా వదిలేశారు. ప్రభుత్వం కరువు మండలం కింద ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

బియ్యం ధరలకు రెక్కలు..

వరి పంట లేకపోవడంతో మార్కెట్‌లో బియ్యం ధరలకు రెక్కలు వచ్చాయి. గతంలో నంద్యాల సోనా 50కేజీల ప్యాకెట్‌ మార్కెట్‌లో రూ.1,500 ఉండేది. ఈ ఏడాది ఖరీఫ్‌ ఆరంభంలోనే రూ.4వేలు పైగానే పలకడంతో కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు. రానున్న రోజుల్లో మరింత ధర పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు.

నీటి కొరత ఉన్నా సాగుచేశా..

ఈ ఖరీఫ్‌ సీజన్‌లో నీటి కొరత ఉన్నా 4 ఎకరాల్లో బోరు కింద వరి సాగు చేశా. గతేడాది వర్షాలు పుష్కలంగా కురవడంతో అధిక దిగుబడి వచ్చి ఆదాయం లభించింది. అయితే ఈ ఏడాదిఅందుకు పరిస్థితి విరుద్ధం. దేవుడిపై నమ్మకంతో సాగు చేశాను. - లాలునాయక్‌, రైతు, కేపీ తండా

ఆరుతడి పంటలు వేయండి

రైతులు ఆరుతడి పంటల వైపు మొగ్గుచూపాలి. రబీలో మినుము, కంది, పెసర, ఆముదం, కొర్రలు, రాగులు, జొన్న సాగుచేస్తే మేలు. ఎల్‌నినో ప్రభావం దృష్టిలో ఉంచుకోవాలని రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. - రంగనేతాజీ, ఏవో, చాగలమర్రి

Updated Date - Oct 14 , 2026 | 12:31 AM