సొంత భవనాలు లేని ఆస్పత్రులు
ABN , Publish Date - Mar 22 , 2026 | 12:03 AM
కర్నూలు జిల్లాలో కొత్త ఆస్పత్రులు సమస్యల్లో ఉన్నాయి. డాక్టర్లను, సూపర్‌వైజర్లను నియమించారు. ఆస్పత్రి భవనాలు నిర్మించలేదు.
మూడేళ్లయినా పునాదులకే పరిమితం
పాత పీహెచ్‌సీల్లోనే విధుల నిర్వహణ
మంత్రాలయం, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): కర్నూలు జిల్లాలో కొత్త ఆస్పత్రులు సమస్యల్లో ఉన్నాయి. డాక్టర్లను, సూపర్‌వైజర్లను నియమించారు. ఆస్పత్రి భవనాలు నిర్మించలేదు. గత వైసీపీ ప్రభుత్వం 2022 నవంబరులో కొత్తగా ప్రాథమిక హెల్త్ సెంటర్లను మంజూరు చేసింది. ఒక్కో భవనానికి రూ.1.90 కోట్లతో ఆర్‌అండ్‌బీ శాఖకు నిర్మాణ బాధ్యతలు అప్పగించింది. కర్నూలు జిల్లాలో 7 కొత్త ఆస్పత్రుల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. మంత్రాలయం నియోజకవర్గంలో కోసిగి మండలంలోని కందుకూరు, మంత్రాలయం మండలంలోని కాచాపురం, పెద్దకడబూరు మండలంలోని హెచ్. మురవణి, గోనెగండ్ల మండలంలోని పెద్ద నెలటూర్, ఆస్పరి మండలంలోని ములుగుందం, దేవనకొండ మండలంలోని తెర్నేకల్, గుడూరు మండలంలోని నాగలాపురం గ్రామాల్లో కొత్త ఆస్పత్రులను అప్పటి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఒక్కో ఆస్పత్రికి ఇద్దరు డాక్టర్లు, ఇద్దరు సూపర్‌వైజర్లను కేటాయించింది. వాళ్లు విధుల్లో చేరారు కాని భవనాలే లేవు. ఒక్కో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనానికి రూ.1.90 కోట్లు మంజూరు చేసి పనులను ప్రారంభించింది. అయితే పనులు ముందుకుపోలేదు. హాస్పెటళ్లకు అద్దె భవననైనా ఏర్పాటు చేయలేదు. దీంతో గతంలో వున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో డాక్టర్లు, సూపర్‌వైజర్లు విధులు నిర్వర్తిస్తున్నారు. 104 వాహనాల ద్వారా వైద్య సేవలు అందిస్తున్నారు. కొత్త ఆస్పత్రికి అవసరమైన ఫార్మసిట్, లాబ్ అసిస్టెంటు, స్టాఫ్ నర్సు ఇతరత్రా సౌకర్యాలు ఏర్పాటు చేయకుండా ప్రభుత్వ ఆనాలోచిత నిర్ణయాలతో పల్లె ప్రజలకు సక్రమంగా సరైన సమయంలో వైద్యం అందక ఇబ్బందులు పడుతున్నారు. కాచాపురంలో దాదాపు భవనం పూర్తి స్థాయిలో నిర్మించారు. కందుకూరులో పిల్లర్స్‌కే పరిమితం అయ్యింది. హెచ్.మురవణిలో గ్రామానికి ఒక కి.మీ. దూరంలో సర్వే నెం. 799 లోని 1.50 ఎకరాలు ప్రభుత్వ భూమిని కేటాయించారుగాని భవనానికి పునాదులు కూడా వేయలేదు. అదేవిధంగా కర్నూలు జిల్లాలో కొత్త ఆస్పత్రుల నిర్మాణంలో ఇదే పరిస్థితి నెలకొంది. ఇక్కడ పనిచేయాల్సిన వైద్యులు, సూపర్‌వైజర్లు ఆస్పత్రి భవనాలు లేకపోవడంతో పాత ఆస్పత్రులకు చుట్టపు చూపుగా వచ్చి వెళ్తున్నారు.
త్వరలో భవనాలు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటాం
మంత్రాలయం నియోజకవర్గంలో 3 కేంద్రాలలో కాంట్రాక్టర్లతో ఆస్పత్రి భవనాల నిర్మాణాలు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటాం. పెద్దకడుబూరు మండలంలోని హెచ్. మురవణి గ్రామంలో స్థలం కేటాయించడం ఆలస్యం కావడంతో పనులు ప్రారంభించలేకపోయాం. కోసిగి మండలం కందుకూరు గ్రామంలో పనులు వేగంగా చేసేందుకు కృషి చేస్తాం. కచాపురంలో త్వరలో పనులు పూర్తిచేసి పేదలకు వైద్యం అందిస్తాం. - నాగరాజు, డీఈ, ఆర్‌అండ్‌బి, ఎమ్మిగనూరు
ఆసుపత్రి భవనాలు పూర్తయితే మెరుగైన వైద్యం అందిస్తాం
ఆస్పత్రి భవనాల నిర్మాణం పూర్తియితే గ్రామాల్లో మెరుగైనా వైద్య సేవలు అందిస్తాం. కొత్త ఆస్పత్రికి అవసరమైన ల్యాబ్, ఫర్నీచర్, మెడిసిన్ సిబ్బందిని ఏర్పాటు చేస్తే పేదలకు ఉచిత వైద్యం అందుతుంది. -డా. సురేష్, కాచాపురం