పౌష్టికాహారం లేదు
ABN , Publish Date - Apr 12 , 2026 | 12:28 AM
చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించేదుకు ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాలను ఏర్పాటుచేసింది.
..బాచుపల్లె అంగన్‌వాడీ కేంద్రం-2 సిబ్బంది ఇష్టారాజ్యం
గుడ్లు, పాలు, చిక్కీలు, చిన్నారులకు భోజనం ఇవ్వడం లేదని తల్లిదండ్రుల ఆవేదన
ఆళ్లగడ్డ, ఏప్రిల్ 11(ఆంధ్రజ్యోతి): చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించేదుకు ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాలను ఏర్పాటుచేసింది. ఇటీవల వీటిని ప్రీ స్కూల్‌గా ప్రకటించి, మరింత మెరుగైన సేవలందించాలని సంకల్పించింది. అయితే కొందరు సిబ్బంది నిర్లక్ష్యంతో లక్ష్యం నెరవేరలేదు. ఆళ్లగడ్డ మండలంలో అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లలకు పౌష్టికాహారం ఇవ్వడంలో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
బాచుపల్లి కేంద్రం-2లో ఇష్టారాజ్యం
మండలం లోని బాచేపల్లె గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రం-2 సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చిన్నారులు, బాలింతలు, గర్భిణులను పట్టించుకోవం లేదని కేంద్రంలో 21మంది చిన్నారులకు గాను కేవలం 8మంది వస్తున్నా వారికి కూడా పాలు, గుడ్లు చిక్కీలు, బాలాంమృతం నెల నెలా పూర్తిగా అందించడం లేదని గర్భిణులు, బాలింతలు ఆవేదన వ్యక్తం చేశారు.
ఏదో ఒక సాకు చూపి..
కేంద్రం సిబ్బంది పౌష్టికాహారం ఇవ్వడానికి ఏదో ఒక సాకుతో తప్పించుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. సర్వర్ బిజీగా ఉందనో, ఆధార్ కార్డు తీసుకోని రావాలని చెపుతూ కొన్ని నెలలుగా ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారం పంపిణీ చేయడంలేదని కాలనీకి చెందిన బాలింతలు నాగేశ్వరి, లక్ష్మిదేవి ఆదేదన వ్యక్తం చేశారు. ప్రీ స్కూల్ చిన్నారులకు గుడ్లు, భోజనం ఇవ్వడం లేదని, ఒకవేళ తాము అడిగినా అంగన్‌వాడీ కార్యకర్త చీదరించుకుంటుందని బాలింతలు వాపోయారు. ఉన్నతాధికారులు చర్యలు తీసుకొని పౌష్టికాహారం అందేలా చూడాలని వారు కోరుతున్నారు. ఈ విషయమై ఐసీడీఎస్ సూపర్‌వైజర్ పార్వతిని వివరణ కోరగా, బాలింతలకు, గర్బవతులకు పౌష్టికాహారం ఇవ్వడంలేదని తన దృష్టికి రాలేదని విచారణ చేసి చర్యలు తీసుకుంటామని తెలిపారు.