ఇక ప్రత్యేకాధికారుల పాలన
ABN , Publish Date - Mar 16 , 2026 | 12:29 AM
నగరపాలక, మున్సిపాలిటీల పాలకవర్గం పదవీకాలం మంగళవారంతో ముగియనుంది. వారి స్థానంలో ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది.
నగర, పురపాలికల్లో 18న బాధ్యతల స్వీకరణ
రేపటితో ముగియనున్న పాలకవర్గం పదవీకాలం
కర్నూలుకు కలెక్టర్ సిరి
వేధిస్తున్న ప్రధాన సమస్యలెన్నో
నగరపాలక, మున్సిపాలిటీల పాలకవర్గం పదవీకాలం మంగళవారంతో ముగియనుంది. వారి స్థానంలో ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది. మళ్లీ ఎన్నికలు జరిగి నూతన పాలకవర్గం బాధ్యతలు చేపట్టే వరకు ప్రత్యేక అధికారుల పాలన కొనసాగనుంది. కర్నూలు నగరపాలక సంస్థ, ఆదోని, ఎమ్మిగనూరు మున్సిపాలిటీలు సహా గూడూరు నగర పంచాయతీల పాలకవర్గం పదవీ కాలంలో రేపటితో ముగుస్తుంది. వారి స్థానంలో 18వ తేదీన ప్రత్యేకాధికారులు బాధ్యతలు చేపట్టనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఆరు నెలల్లో రాబోతున్నాయి. అప్పటివరకు నగర, పురపాలికల్లో ప్రజలకు కనీస మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో ప్రత్యేక అధికారులదే కీలకపాత్ర ఉంటుంది. బాధ్యతలు చేపట్టబోతున్నవారికి సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి.
కర్నూలు, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కర్నూలు కార్పొరేషన్, ఆదోని, ఎమ్మిగనూరు మున్సిపాలిటీలు, గూడూరు నగర పంచాయతీలున్నాయి. 2021 ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. ఆనాటి ఎన్నికల సమయంలో అధికారంలో వైసీపీ ప్రభుత్వం ఉంది. అధికారం, పోలీస్ పెత్తనంతో నాడు ఏకపక్షంగా ఎన్నికలు జరుపుకున్నారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. మొత్తం పురపాలికల్లో వైసీపీ విజయం సాధించింది. కర్నూలు నగర పాలక సంస్థ మేయర్ బీవై రామయ్య, ఆదోని మున్సిపల్ చైర్మన్‌గా బోయ శాంత, ఎమ్మిగనూరు మున్సిపల్ చైర్మన్‌గా డాక్టర్ కె.రఘు, గూడూరు నగర పంచాయతీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆదోని చైర్మన్ బోయ శాంత బీజేపీలో చేరింది. వైసీపీ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం పెట్టి ఆమెను పదవి నుంచి దింపేశారు. ఆ స్థానంలో చైర్మన్‌గా లోకేశ్వరిని ఎన్నుకున్నారు. చైర్మన్లతో పాటు పాలకవర్గం ఐదేళ్ల పదవీ కాలం రేపటితో ముగియనుంది. వారంతా మాజీలు కానున్నారు.
ప్రభుత్వ ఉత్తర్వులు జారీ
నగర, పురపాలికలకు ప్రత్యేకాధికారులను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 11న ఉత్తర్వులు జారీచేసింది. కర్నూలు నగరపాలక ప్రత్యేకాధికారిగా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి, ఆదోని మున్సిపాలిటీకి జేసీ నూరల్ ఖమర్, ఎమ్మిగనూరుకు ఆదోని సబ్‌కలెక్టర్ అజయ్‌కుమార్, గూడూరు నగర పంచాయతీకి కర్నూలు ఆర్డీవో కిడారి సందీప్‌కుమార్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్వర్వులు జారీచేసింది. ఇప్పటి వరకు ప్రజల చేత ఎన్నుకోబడి కౌన్సిల్, చైర్మన్లు నిర్వహించే బాధ్యతలను ప్రత్యేక అధికారులు నిర్వహిస్తారు. ప్రస్తుతం చైర్మన్ చాంబర్‌నే ప్రత్యేక అధికారి చాంబర్‌గా తీర్చిదిద్దడమే కాకుండా అవసరమైన ఏ ర్పాట్లపై కసరత్తు చేస్తున్నారు. మేయర్ వద్ద పనిచేసే ఐదుగురు సిబ్బందిని ప్రత్యేకాధికారి డా.ఏ.సిరి సాయం కోసం ముందే నియమించడంపై రాజకీయంగా విమర్శలు వెల్లువెత్తాయి.
ముఖ్య బాధ్యతలు
ఎన్నికలు జరిగి నూతన పాలకవర్గం బాధ్యతలు స్వీకరించే వరకు నగరపాలిక, పురపాలికల్లో మేయర్/చైర్మన్లు, కౌన్సిలర్ల తరపున రోజువారి పరిపాలన, అవసరమైన నిర్ణయాలను ప్రత్యేకాధికారులు తీసుకుం టారు. మౌలిక సదుపాయాల కల్పన, రోడ్లు, డ్రైనేజీల పనులను పర్యవేక్షిస్తారు. తాగునీటి సరఫరా, పారిశుధ్యం, దీపాలు వంటి సేవలు ప్రజలకు సజావుగా అందేలా చూస్తారు.
పన్నులు, ప్రభుత్వ పథకాలు ద్వారా వచ్చే మున్సిపల్ నిధులను బాధ్యతాయుతంగా ప్రభుత్వ నిబంధనల మేరకు అభివృద్ధి పనులకు ఖర్చు చేయడం. వృథా ఖర్చులను తగ్గించి ఆదాయం పెంచడం. ప్రత్యేకాధికారుల పర్యవేక్షణలోనే నగరపాలక, మున్సిపల్ ఎన్నికలు జరిగే అకాశం ఉంది.
వేధిస్తున్న సమస్యలు
కర్నూలు నగర జనాభా 6.25 లక్షలు పైమాటే. ఇప్పటికే వేసవి ఎండలు తీవ్రరూపం దాల్చాయి. శివారు కాలనీల్లో తాగునీటి సమస్యలపై ప్రత్యేక దృష్టిని పెట్టాలి. పారిశుధ్యం, వీధిదీపాలపై దృష్టి పెట్టాలి.
కోడుమూరు, పాణ్యం నియోజకవర్గాలకు చెందిన పలు గ్రామాలు కార్పొరేషన్‌లో విలీనం చేశారు. ఆ గ్రామాల్లో కనీస సౌకర్యాలు మృగ్యమయ్యాయి. వీటిపై ప్రత్యేక దృష్టి సారించాలి.
ఆదోని పట్టణం పాత బస్టాండ్‌లో రూ.33కోట్లతో 360 దుకాణాలతో కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మించారు. రాజకీయ జోక్యంతో పనులు ఆగిపోయాయి. ఈ పనులు మొదలు పెట్టేలా చర్యలు తీసుకోవాలి. రహదారుల విస్తరణ, తాగునీటి సరఫరాపై దృష్టి సారించాలి.
ఎమ్మిగనూరులో అసంపూర్తిగా ఉన్న రూ.44కోట్లతో చేపట్టిన భూగర్భ డ్రైనేజీ పనులు, రూ.144 కోట్లతో చేపట్టిన గాజులదిన్నె జలాశయం నుంచి తాగునీటి పైపులైన్ పనులు పూర్తి చేసేలా కృషి చేయాలి. తాగునీటి, వీధి దీపాలు, పారిశుద్ధ్యం నిర్వహణపై దృష్టి పెట్టాలి.
గూడూరు పంచాయతీ పరిధిలో రహదారి విస్తరణ, అసంపూర్తిగా నిలిచిపోయిన నాన్ అమృత్ నిధులు రూ.54 కోట్లతో చేపట్టిన సుంకేసుల జలాశయం నుంచి పైపులైన్ పనులు పూర్తి చేసుందుకు చర్యలు తీసుకోవాలి.