ఎంపీటీసీలకు అ‘గౌరవ వేతనం
ABN , Publish Date - May 14 , 2026 | 12:28 AM
వాళ్లు పేరుకు మాత్రం మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో సభ్యులు. వారు హాజరు కాకపోతే కోరం లేదని సమావేశాన్ని వాయిదా వేస్తారు. వారి అధికారాలు కూడా అంతంత మాత్రమే. దీంతో ఉత్సవ విగ్రహాలుగా మిగిలి పోతున్నారు. అయినా ఎంపీటీసీలు ఎన్నికలలో పోటీచేసి గెలుస్తున్నారు
సెప్టెంబరుతో ముగుస్తున్న పదవీ కాలం ఫ 36 నెలలుగా అందని గౌరవ వేతనం
వైసీపీ బాటలోనే కూటమి ప్రభుత్వం అంటున్న ఎంపీటీసీలు
గోనెగండ్ల, మే 13(ఆంధ్రజ్యోతి): వాళ్లు పేరుకు మాత్రం మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో సభ్యులు. వారు హాజరు కాకపోతే కోరం లేదని సమావేశాన్ని వాయిదా వేస్తారు. వారి అధికారాలు కూడా అంతంత మాత్రమే. దీంతో ఉత్సవ విగ్రహాలుగా మిగిలి పోతున్నారు. అయినా ఎంపీటీసీలు ఎన్నికలలో పోటీచేసి గెలుస్తున్నారు. కానీ వారికి తగిన గౌరవం దక్కడం లేదు. దీనికి నిదర్శనం... నెలకు వారికి ఇచ్చే రూ.3వేల గౌరవ వేతనం కూడా మూడేళ్లుగా ఇవ్వకపోవడం. ఈ ధోరణి చాలా నిర్లక్ష్యమేగాక అవమానకరమని, ప్రభుత్వాలు తమ సమస్యలను పట్టించుకున్న పాపాన పోలేదని పలువురు ఎంపీటీసీలు వివర్శిస్తున్నారు. మూడేళ్లుగా గౌవర వేతనం అందక పోవడంతో పలుమార్లు సంబంధిత అధికారులు దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ ఫలితం కనిపించడం లేదని ఎంపీటీసీలు ఆవేదన చెందుతున్నారు. అధికారులు కూడా ఎంపీటీసీలపట్ల సానుభూతి చూపుతున్నారే కాని వారి సమస్యను పరిష్కరించడం లేదు. దీంతో గోనెగండ్ల మండలంలోని పలువురు ఎంపీటీసీలు మండల సర్వసభ్య సమావేశాలకు కూడా హాజరు కావడం లేదంటే అతిశయోక్తి కాదు. గోనెగండ్ల మండలంలో 21 మంది ఎంపీటీసీలు ఉన్నారు. వీరులో పెద్ద నేలటూరు-2లో టీడీపీకి చెందిన ఎంపీటీసీ ఉన్నారు. మిగిలిన 20 మంది ఎంపీటీసీలు వైసీపీకి చెందిన వారే. వైసీపీ ప్రభుత్వంలో కూడా వారికి సకాలంలో గౌరవవేతం అందలేదు. అప్పటి సీఎం జగన్ హయాంలోనే ఎంపీటీసీ గౌవరం వేతనంను విడుదల చేయకుండా నిలిపివేశారు.
మరో మూడు నెలలు మాత్రమే గడవు
ఎంపీటీసీల పదవీ కాలం మరో మూడు మాసాలలో(సెప్టెంబరు) ముగియనుంది. తమకు అంతలోపు మొత్తం గౌరవ వేతనం ప్రభుత్వం విడుదల చేస్తుందా లేదా అని ఎంపీటీసీలు ఎదురు చూస్తున్నారు. పదవిలో ఉన్నప్పుడు అధికారులు, నాయకులు తమను పట్టించుకున్న దాఖాలాలు లేవని, పదవీ కాలం అయ్యాక ఇక ఎవరు పట్టించుకుంటారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కూటమి ప్రభుత్వంలోనైనా కదలిక వచ్చేనా
కూటమీ ప్రభుత్వం వచ్చిన తరువాతైనా తమకు గౌరవ వేతనం వస్తుందని చాలామంది ఎంపీటీసీలు ఎదురు చూశారు. ఈ ప్రభుత్వం వచ్చి రెండేళ్లు పూర్తి అవుతున్నా ఇంత వరకు ఎంపీటీసీల గౌరవ వేతనం ఇవ్వలేదు. వైసీసీ హయంలో జరిగిన ఎంపీటీసీ ఎన్నికలను టీడీపీ బహిష్కరించింది. దీంతో చాల తక్కువ మంది టీడీపీ ఎంపీటీసీలు గెలిచారు. 90 శాతం మంది వైసీపీకి చెందిన ఎంపీటీసీలే. దీంతో ఇప్పుడు కూటమి ప్రభుత్వం తమపై చిన్న చూపు చూస్తున్నదని వారు ఆవేదన చెందుతున్నారు.
గౌరవ వేతనం విడుదల చేయండి
మాకు గౌరవ వేతనం అందక 36 నెలలు అయింది. ప్రతిసారి అధికారుల దృష్టికి ఎంపీటీసీ సంఘం నాయకులు తీసుకువెళుతున్నారు. అయినప్పటికి ప్రభుత్వం పట్టించుకోలేదు. మరో మూడు నెలలలో మా పదవీకాలం ముగియనుంది. ఆలోగా మాకు రావాల్సిన గౌరవ వేతనం ప్రభుత్వం విడుదల చేయాలి. - వెంకట్రామిరెడ్డి,ఎంపీపీ. అలువాల.
ప్రతి నెల బిల్లులు పెడుతున్నాం
ఎంపీటీసీల గౌరవ వేతనం పెండింగ్‌లో ఉన్నమాట వాస్తవమే. ప్రతి నెల మండలంలోని 21 మంది ఎంపీటీసీల గౌరవ వేతనం బిల్లులను తయారు చేసి పెడుతున్నాం. ప్రభుత్వం నిధులు విడుదల చేయాల్సి ఉంది. - మణిమంజరి, ఎంపీడీవో గోనెగండ్ల.