Share News

కడుపులు మాడుస్తున్నారు..

ABN , Publish Date - Sep 25 , 2026 | 12:19 AM

రాయలసీమ యూనివర్సిటీలో అధికారులు విద్యార్థులను కడుపులను మాడుస్తున్నారు.

కడుపులు మాడుస్తున్నారు..
సమావేశంలో మాట్లాడుతున్న ఎస్‌ఎ్‌ఫఐ నాయకులు

ఆర్‌యూలో విద్యార్థుల ఆకలి కేకలు

స్టీవార్డెన్స్‌, వార్డెన్‌ మధ్య ఆధిపత్య పోరు

రూ.40 లక్షల మెస్‌ బిల్లులు పెండింగ్‌

కర్నూలు అర్బన్‌ , సెప్టెంబరు 24(ఆంధ్రజ్యోతి): రాయలసీమ యూనివర్సిటీలో అధికారులు విద్యార్థులను కడుపులను మాడుస్తున్నారు. రెండు నెలలుగా ఆకలితో అలమటిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి వర్సిటీ క్యాంప్‌సలో డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్‌ చదువుతున్న 515 మంది విద్యార్థులు ఉంటున్నారు. వీరి భోజనాల కోసం ప్రతి నెల బియ్యం, కంది పప్పు, ఆయిల్‌, ఇతర వంట సామగ్రికి సంబంధించి ప్రతి నెల రూ.7లక్షల దాకా ఖర్చు అవుతోంది. జనవరి నెల నుంచి సరుకుల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. దాదాపు రూ.40లక్షల దాకా బకాయిలు పేరుకు పోయాయి. కాంట్రాక్టర్లు సరుకులు రవాణా నిలిపి వేసినట్లు సమాచారం. ఈక్రమంలో విద్యార్థులు భోజనాలు పస్తులు ఉంటున్నారు. బయటకెళ్లి భోజనాలు చేయాల్సిన పరిస్థితి నెలకొందని పలువురు విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు.

ఆధిపత్య పోరు..

యూనివర్సిటీ క్యాంప్‌సలోని వసతిగృహంలో ముగ్గురు స్టీవార్డెన్స్‌, వార్డెన్‌ విధులు నిర్వహిస్తున్నారు. వారి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. విద్యార్థులకు నెల వారీ భోజన ఖర్చులు, వారు చెల్లించే ప్రొవిజన్‌ బిల్లుకు సంబంధించిన రికార్డుల నమోదు ప్రక్రియలో స్టీవార్డెన్స్‌ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వార్డెన్‌ తిరస్కరిస్తున్నట్లు తెలిసింది. తాను సూచించిన ప్రక్రియలో ఎందుకు రికార్డులు నివేదించడ లేదని వార్డెన్‌ ఆరోపిస్తున్నారు. ఇలా ఒకరి మీద ఒకరు బిల్లులకు సంబంధించిన ప్రక్రియను జాప్యం చేస్తూ రావడంతో జనవరి నుంచి సరుకులు సరఫరా చేసే కాంట్రాక్టర్‌ సరుకులు సరఫరా చేయడం లేదు.

వర్సిటీ ఖాతాల్లో జమ అవుతున్నప్పటికీ..

ప్రతి నెల ఒక్కో విద్యార్థికి ప్రభుత్వం అందించే రూ.3 వేలు మెస్‌ బిల్లు యూనివర్సిటీ ఖాతాలోకి జమ అవుతున్నప్పటికీ సరైన భోజన వసతులు కల్పించడం లేదు. వార్డెన్ల నిర్లక్ష్యంతో విద్యార్థులు పస్తులు ఉండాల్సి వస్తోందని విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంపై ఇప్పటికే వర్సిటీకి చెందిన అధికారుల దృష్టికి తీసుకెళ్లినా తమ గోడును ఎవరు పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సమస్య ఉన్న మాట వాస్తవమే..

సమస్య ఉన్న మాట వాస్తవమే. గాడిలో పెడతాను. స్టీవార్డెన్స్‌ రికార్డుల నమోదు ప్రక్రియలో జాప్యం చేస్తూ వచ్చారు. హాస్టల్‌లో విద్యార్థులకు భోజన వసతుల్లో అంత రాయం లేకుండా చర్యలు తీసుకుంటాం. -సి. విశ్వనాథరెడ్డి, వార్డెన్‌

అధికారులు విఫలం

క్యాంప్‌సలోని హాస్టళ్లలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో యూనివర్సిటీ అధికారులు విఫలం చెందారని ఎస్‌ఎ్‌ఫఐ వర్సిటీ కార్యదర్శి సందీప్‌ అన్నారు. గురువారం క్యాంప్‌సలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించి భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. రెండు నెలలుగా విద్యా ర్థులకు భోజనాలందక అవస్థలు పడుతున్నారన్నారు. వార్డెన్లు సరైన రీతిలో మెనూ పాటించడం లేదన్నారు. అధికారులు హాస్టళ్లలోని సమస్యలను పరిష్కరించాలని, లేనిపక్షంలో ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. నాయకులు భరత్‌, సాయి, వంశీ, కృష్ణ, పవన్‌, మంజు పాల్గొన్నారు.

Updated Date - Sep 25 , 2026 | 12:19 AM