అభివృద్ధికి దూరంగా..
ABN , Publish Date - Feb 16 , 2026 | 12:14 AM
శివారు కాలనీలు ఏర్పడి ఏళ్ళు గడుస్తున్నా, సమస్యలు పరిష్కారం కావడం లేదు. పట్టణ శివార్లలోని మైనార్టీ కాలనీ అభివృద్దికి నోచుకోవడం లేదు. గృహాలకు, జనాభాకు సరిపడా వసతులు కల్పించడంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు విఫలమయ్యారని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు
సమస్యల వలయంలో మైనార్టీ కాలనీ
వసతులు లేక కాలనీ వాసుల ఇబ్బంది
పట్టించుకోని పాలకులు, అధికారులు
ఎమ్మిగనూరు టౌన్, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): శివారు కాలనీలు ఏర్పడి ఏళ్ళు గడుస్తున్నా, సమస్యలు పరిష్కారం కావడం లేదు. పట్టణ శివార్లలోని మైనార్టీ కాలనీ అభివృద్దికి నోచుకోవడం లేదు. గృహాలకు, జనాభాకు సరిపడా వసతులు కల్పించడంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు విఫలమయ్యారని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. నాటి టీడీపీ హయాంలో మాజీ మంత్రి బీ వి మోహన్‌రెడ్డి నిరుపేదలకు స్థలాలు కేటాయించారు. అప్పట్లో పట్టణానికి శివారు ప్రాంతం కావడంతో ప్రజలు నివాసాలు ఏర్పాటు చేసుకొలేకపొయారు. అనంతరం ఇళ్లు కటుకున్నారు. కాలనీలో వందల కుటుంబాలు నివసిస్తున్నాయి.
మట్టి రోడ్లే గతి..
అయితే కాలనీ మొత్తానికి ఒకే సీసీ రోడ్డు ఉంది. అది కూడా కేజీబీవి పాఠశాల, హాస్టళ్ల కోసం ఏర్పాటు చేసింది. తరువాత అఽఽఽధికారులు పట్టించుకోలేదు, దీంతో కాలనీ అంతా మట్టిరోడ్లే దర్శనమిస్తున్నాయి, ఎక్కడా సీసీ రోడ్లు, డ్రైనేజీలు లేకపోవడంతో వీధులన్ని గుంతలమయంగా మారింది. వర్షం వచ్చిందంటే కాలు తీసి కాళ్ళు వేయలేని పరిస్థితి, ఇళ్ళలోకి వెళ్ళాలంటే బురద అంటించుకునే వెళ్లాల్సి వస్తోందని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పూర్తికాని వాటర్ ట్యాంకు..
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 2014-19లో వాటర్ ట్యాంక్ పనులు ప్రారంభించారు. అయితే 2019లో ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో పనులు ఆగిపోయాయి. అనంతరం అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో కాలనీ వాసులకు నీటి కష్టాలు ఇప్పటికి తప్పడంలేదు. కూటమి ప్రభుత్వంలోనైనా వాటర్ ట్యాంక్ పూర్తి చేస్తారని కాలనీ వాసులు ఆశిస్తున్నారు.
డ్రైనేజీ లేక ఇబ్బంది..
కాలనీలో డ్రైనేజీ లేకపోవడంతో ఇంటి ముందే మురుగు నీరు నిలిచి దోమలకు నిలయంగా మారింది. అలాగే కొళాయిలకు బోరునీరు వస్తుండడంతో తాగలేకున్నామని కాలనీవాసులు అంటున్నారు.
పన్నులు కడుతున్నా..
మున్సిపల్ అధికారులు పన్నులు వసూలుచేస్తున్నారే తప్ప కాలనీని పట్టించుకోవడం లేదని స్తానికులు అంటున్నారు. ఎన్నికల సమయంలో మాత్రం శివారు కాలనీలకు పెద్దపీట వేస్తామని, అనంతరం పట్టించుకోలేదన్నారు.
డ్రైనే జీ సౌకర్యం కల్పించాలి
పది సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నాము. ఇక్కడ సీసీ రోడ్లు లేకపోవడంతో వర్షాలు పడితే నడిచేదుకు కూడా వీలు కాదు. మోకాళ్ళలోతు బురద నీరు ఉంటుంది, డ్రైనేజిల సౌకర్యం కూడా లేక ఇంటి ముందు మురుగు చేరి పిల్లలకు విష జ్వరాలు వస్తున్నాయి. ఎండాకాలం తాగునీటి కష్టాలు మొదలవుతాయి. - ఇస్మాయిల్, స్థానికుడు.