Share News

ఆహార నాణ్యతలో రాజీ వద్దు

ABN , Publish Date - Aug 24 , 2026 | 11:11 PM

ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థులకు అందించే ఆహారం విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడరాదని బీసీ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్‌. సవిత అధికారులను, హాస్టల్‌ వార్డెన్‌లను ఆదేశించారు.

ఆహార నాణ్యతలో రాజీ వద్దు
బీసీ సంక్షేమ, చేనేత శాఖల అధికారుల సమీక్షలో మాట్లాడుతున్న మంత్రి సవిత

బీసీ హాస్టల్‌ విద్యార్థులకు మెరుగైన వసతి కల్పించడమే లక్ష్యం

వార్డెన్లు భోజనాన్ని రుచి చూసి నాణ్యతను నిర్ధారించాలి

సంక్షేమ హాస్టళ్ల అధికారుల సమీక్ష సమావేశంలో మంత్రి సవిత

ఆలూరు, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థులకు అందించే ఆహారం విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడరాదని బీసీ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్‌. సవిత అధికారులను, హాస్టల్‌ వార్డెన్‌లను ఆదేశించారు. సోమవారం ఆలూరులో టీడీపీ ఇన్‌చార్జి వైకుంఠం జ్యోతి స్వగృహంలో బీసీ వసతి గృహాల నిర్వహణ, చేనేత, జౌళి శాఖలకు సంబంధించిన అంశాలపై అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థుల తల్లిదండ్రులు ఎంతో నమ్మకంతో తమ పిల్లలను ప్రభుత్వ హాస్టళ్లలో చేర్పిస్తున్నారని, ఆ నమ్మకాన్ని నిలబెట్టేలా అధికారులు, వార్డెన్లు బాధ్యతాయుతంగా పని చేయాలని సూచించారు. హాస్టళ్లలో విద్యార్థులకు వడ్డించే ముందు వార్డెన్లు, సిబ్బంది ఆహారాన్ని స్వయంగా రుచి చూసి నాణ్యతను నిర్ధారించాలని ఆదేశించారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించడం అధికారుల బాధ్యత అన్నారు. హాస్టళ్లకు శాశ్వత భవనాల నిర్మాణం, మౌలిక వసతుల కల్పనపై కూడా దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న పోస్టులు, సిబ్బంది సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు.

వారంలోగా ’నేతన్న సేవ’ రెండో విడత పూర్తి చేయాలి

’నేతన్న సేవ’ పథకం రెండో విడతలో అర్హత కలిగిన ప్రతి నేతన్నకు ప్రభుత్వ ప్రయోజనం అందేలా చర్యలుచేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు. చేనేత రంగానికి సంబంధించిన పథకాల అమలు, లబ్ధిదారుల డేటా, పెండింగ్‌ దరఖాస్తులు, సిస్టమ్‌ వెరిఫికేషన్‌పై ఆమె సమీక్షించారు. ఆదోని, ఎమ్మిగనూరు ప్రాంతాలకు సంబంధించిన నేతన్నల వివరాలను పరిశీలించారు. తిరస్కరణకు గురైన దరఖాస్తుల స్థితిగతులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్‌ దరఖాస్తులను వెంటనే పరిశీలించి పరిష్కరించాలని, అర్హత ఉన్న ఏ ఒక్క నేతన్న కూడా ప్రభుత్వ ప్రయోజనానికి దూరం కాకుండా ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. నేతన్న సేవ కార్యక్రమం, జాతీయ చేనేత దినోత్సవాన్ని దృష్టిలో ఉంచుకుని రెండో విడత ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. ఈ సమీక్షలో బీసీ వెల్ఫేర్‌ అధికారి ప్రసూన, బీసీఈడీ జాకీర్‌ హుసేన్‌, ఏడీ హ్యాండ్లూమ్స్‌ నాగరాజు, లేపాక్షి, ఆప్కో మేనేజర్లు పాల్గొన్నారు.

Updated Date - Aug 24 , 2026 | 11:11 PM